– ఆ వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడితో అంటకాగినోళ్లే
– శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
– తన నిర్వాకం నుంచి దృష్టి మళ్ళించేందుకే హత్యాయత్నం డ్రామాలు
– ఆ వీడియోలో ఉన్న వ్యక్తులంతా కోటంరెడ్డి పెంచి పోషించిన వారే
– వ్యవసాయ మంత్రి కమీషన్లు దండుకునే పనిలో నిమగ్నం
– వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కార్
– నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నాలంటూ నెల్లూరులో కొత్త తరహా రాజకీయానికి కూటమి ప్రభుత్వం తెరదీసింది. మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం నెల్లూరు ఎస్పీకి అలవాటైపోయింది. కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యాప్రయత్నం, కోవూరు ఎమ్మెల్యేకి నక్సల్స్ హెచ్చరిక అని హడావుడి చేసిన నాయకులు.. కొత్తగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీద హత్యాయత్నంకు ప్లాన్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపారు.
ఈ కేసులో ఎవర్ని అరెస్ట్ చేయాలో ఇంకా పోలీసులు ఖరారు చేసినట్లు లేరు. పదవుల కోసం, చంద్రబాబు దగ్గర మార్కుల కోసం దిగజారి మాట్లాడుతున్నాడు. నిద్ర లేచింది మొదలు ఎవరెవర్ని ఏయే కేసుల్లో ఇరికించాలా అని ఆలోచించే శ్రీధర్ రెడ్డి తనకేమీ తెలియదన్నట్టు మీడియా ముందు నీతులు మాట్లాడుతున్నాడు.
రాజకీయాల్లో ఉచ్చనీచాలు మరిచిన వ్యక్తి ఎవరని చంద్రబాబు ర్యాంకులిస్తే జిల్లాలో ఫస్ట్ ప్లేస్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే ఉంటాడు. నెల్లూరులో రౌడీషీటర్ల గ్యాంగులు ఏర్పాటు చేసింది ఆయనే. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనిది ఇన్ని హత్యలు జరిగాయంటే ఆయన తీసుకొచ్చిన రౌడీ గ్యాంగ్ కల్చరే. రౌడీషీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోయి దానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయి, ఇలాంటి డ్రామాలాడుతున్నాడు.
రౌడీషీటర్ పెరోల్ కోసం లెటర్ ఇచ్చానని ఆయనే అంగీకరించాడు. ఎవరు ప్రలోభ పెడితే హోంమంత్రి అనిత సంతకం పెట్టారో కూడా చెప్పాలి. పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్‌రెడ్డి వాటికి సమాధానం ఇచ్చుకోలేక తన మీద హత్యాప్రయత్నం జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపాడు.
నిజానికి నిన్న బయటకొచ్చిన ఆ వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడితో అంటకాగినోళ్లే. (కోటంరెడ్డి బ్రదర్స్‌తో నిందితులు వినీత్, జగదీశ్, మహేష్ దిగిన ఫొటోలు ప్రదర్శించారు.) కానీ దీన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తే సహించేది లేదు.
పెరోల్ వ్యవహారంలో సీబీఐ విచారణకు సిద్దమా?
గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మీదకెళితే వైయస్ జగన్ ఉపేక్షించలేదు. ఆయన మీద కేసు పెట్టించి కోర్టుకు పంపించారు. సాయంత్రానికి విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని వైయస్ జగన్ ఆదేశించారు. ఆదిలోనే అతడి అరాచకాలకు అడ్డుకట్ట వేశారు. నా పార్టీ నాయకులకు ఒక చట్టం, ఇతర పార్టీ వారు తప్పుచేస్తే ఒక చట్టం అన్నట్టు నాడు వైయస్ జగన్ ఆలోచించలేదు. ఆ కారణంతోనే శ్రీధర్ రెడ్డి మా పార్టీ వదిలేసి వెళ్లిపోయాడు.
కానీ పెరోల్ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకునే ధైర్యం సీఎం చంద్రబాబుకి లేదు. వాస్తవాలు వెలుగు చూడాలంటే రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం, శ్రీధర్ రెడ్డి మీద హత్యాయత్యం కేసులను సీబీఐకి అప్పగించి విచారణ చేయించే దమ్ము చంద్రబాబుకి ఉందా? సీబీఐ విచారణ కోరే దమ్ము శ్రీధర్‌రెడ్డికి ఉందా?