– ‘స్ఫూర్తి’లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ: ధర్మం ఇంకా ఉందంటే.. అందుకు సంచారజాతుల వారే ప్రధాన వారధులు.. వీరంతా సంస్కృతికి వారసులు… సంచార జాతులు వారి కాళ్ళు మొక్కాలి. శతాబ్దాల తరబడి మన సాంప్రదాయం రక్షిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. స్ఫూర్తి పేరిట విజయవాడలో బీజేపీ శనివారం కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 34 సంచార జాతులు తెగలు హాజరయ్యాయి. తమ కళలలను ప్రదర్శించడంతో ఒక సమ్మేళనం లా సాగింది. ఉదయాన్నే వారంతా సభాస్థలి కి చేరుకుని తమ కళలలను దాదాపు రెండు గంటల పాటు ప్రదర్శించారు. జాతీయ సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తో సహా బీజేపీ ఎమ్మెల్యే లు, నేతలు కూడా వారి తో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. నేటికి సంస్కృతిని విడనాడకుండా, వివక్షతను పట్టించుకోకుండా సంచార జాతుల వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. మీ ప్రదర్శనల ద్వారా ప్రజలను రంజింప చేస్తున్నారంటే… మీ కష్టాన్ని ఆ అందరూ గుర్తించాలి. మీ సంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి అందరూ తెలుసుకోవాలి..
మన సంస్కృతి, సంప్రదాయాలకు నేడు చాలా మంది దూరంగా బతుకుతున్నామన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. సంచార జాతుల వారు ప్రకృతితో మమేకమై, ప్రకృతిని ఆరాధిస్తున్న గొప్ప జాతులు. వారికి చెట్టు దేవత.. ఆ చెట్టునే ఆరాధన చేస్తూ.. మన పండుగల గొప్పతనం గురించి చెబుతున్నారు. తప్పకుండా మీ సేవలను గుర్తించి,, మీకంటూ ఒక గుర్తింపు ఇచ్చేలా స్పూర్తి అనే కార్యక్రమం చేపట్టాం.
మీ జాతుల వైభవం, గొప్పతనాన్ని పునప్రతిష్ఠ చేసేందుకే స్ఫూర్తి అని పేరు పెట్టాం. లక్ష్మణ్ పార్లమెంటు లో మాట్లాడినందుకే.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాయి. ఒబీసీ కోసం పోరాటం చేస్తున్న లక్ష్మణ్ , ఆర్.కృష్ణయ్య, వెంకట సత్యనారాయణ వంటి వారు మన సభకు రావడం ఆనందంగా ఉంది. దేవర జంగాలు అద్భుతమైన విన్యాసాలతో పాటలతో ఆకట్టుకున్నారు.
ప్రజల్లో చైతన్యం తీసుకు రావడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. మన సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లడంలో, మన పండుగల విశిష్టతలను చెప్పడం ద్వారా ప్రజల్లో మార్పు తెస్తున్నారు. వాళ్లకు ఉన్న కట్టుబాట్లు, నిబంధనలు కూడా ఎవరికీ ఉండవు. జన జీవన స్రవంతిలో గౌరవంగా బతికేలా మేము చేస్తాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ అందరికీ అండగా ఉన్నారు… ఉంటారు.. మీ అభివృద్ది మీరు చూస్తారు. బ్రిటీష్ వాళ్ల హయాంలో మీకు జరిగిన అన్యాయాల గురించి నేటి తరానికి చెబుతాం. సంచార జాతులంటే… క్రిమినల్స్ కాదు… ప్రజల్లో చైతన్యం తెచ్చే ధీరులుగా ప్రచారం చేస్తాం.
సంచారజాతుల విముక్తి దినోత్సవం ఘనంగా చేయాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మీకు అండగా బీజేపీ, టీడీపీ, జనసేనలు ఉంటాయి… మీ హక్కులను కాపాడతాం. డి.యన్.టి కమీషన్ ముగ్గురు సభ్యులతో వేసి.. అధ్యయనం చేశారు. సీడ్ అనే పధకాన్ని తీసుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపలేదు. గత ప్రభుత్వం చేసిన దాష్టికం కారణంగా వైసీపీ ప్రభుత్వం మీకు ఇఛ్చిన డబ్బులను పక్కదారి పట్టించింది. మీకు డి.యన్.టి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వైసీపీ మోసం చేసింది.
కూటమి ప్రభుత్వం మీ సంచార జాతులకు గుర్తింపు, గౌరవం ఇస్తాం. యన్.టి. డి.యన్.టి సర్టిఫికేట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ సక్రమంగా అమలు చేసి,, మీకు సర్టిఫికేట్లు ఇస్తాం.
అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం. సంచారజాతుల వారి పిల్లలు అనాథలుగా తిరుగుతున్నారు.. కాల గమనంలో మాయం అవుతున్నారు. మీ పిల్లల సంరక్షణ కోసం ప్రతి రాష్ట్రంలో డి.యన్.టి హాస్టల్స్ నిర్మాణం చేయాలని మోడీ ఆదేశించారు. ఏపీలో కూడా మూడు డి.యన్.టి హాస్టల్స్ ఉన్నా… అక్కడ చేరేవారు లేరు. బీసీ హాస్టల్స్ గా మార్చిన నేపథ్యంలో.. యన్.టి.డి.యన్.టి వారికి ప్రత్యేక సదుపాయాలు హాస్టల్స్ లో కల్పిస్తాం. సంచార జాతుల వృద్ది కోసం కూటమి ప్రభుత్వం ఒక కమీషన్ వేసి… మీ జీవితాల్లో వెలుగులు తెస్తాం.
సంచార జాతుల వారిని క్రిమినల్స్ గా చిత్రీకరిస్తూ.. దొంగలుగా అరెస్టు చేసే పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి వాటిని అరికట్టి.. విముక్తి కల్గిస్తాం. సంచారజాతుల వారు సంచారులే కానీ.. యాచకులు కాదనేది గుర్తించండి.
పాదాల మీద నడిస్తే.. పాదయాత్ర అని ఇటీవల ఒక మేడం చెప్పారు. కానీ పాదయాత్ర ఆమె అన్నది కాదు.. స్వాములు, మునులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు సంచారం చేసేది పాదయాత్ర. సంచార జాతుల వారికి ఉండే శక్తి, మేధస్సు చాలా ఎక్కువ. వీళ్లు అనేక యేళ్లుగా పాదయాత్రలు చేస్తూ చేస్తూ.. మన ధర్మాన్ని కాపాడారు. వాళ్లు చేసే త్యాగాలను గుర్తించాలి, గౌరవించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లే వారధలుగా మారాలి.
ముఖ్య అతిథి గా హాజరైన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ
సంచార జాతులను గత పాలకులు ఓటు బ్యాంకుగానే చూశారు. వారి నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకుని నేతలు ఎదిగారు. వారి వృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీసీ వర్గాల్లో పుట్టిన మోడీ.. సంచారజాతుల వారి కోసం ఆలోచన చేశారు. ఎన్నికలలో గెలుపు ఓటములే కాదు.. అన్ని వర్గాలకు మోడీ బాధ్యత వహించారు. విస్మరింపబడ్డ వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని మోడీ నిర్ణయించారు. సంచార జాతుల వారి త్యాగాలను గుర్తించి.. ప్రోత్సహించాలని మోడీ పిలుపునిచ్చారు. బ్రిటీష్ కాలంలో సంచార జాతుల వారు చేసిన త్యాగాలు, ఉద్యమాలు ఎంతో గొప్పవి. ప్రజల్లో వారు తీసుకు వస్తున్న చైతన్యాన్ని చూడలేకే.. కేసులు పెట్టి జైల్లో పెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక సంచారజాతుల విముక్తి దినోత్సవంగా ఆగస్టు 31 వ తేదీని ప్రకటించారు. ఆనాటి నుంచి అనేక మంది పాలకులు వచ్చినా.. ఓట్ల కోసమే చూశారు. గరీభీ హటావో అన్న వాళ్లు.. ఈ గరిభీల గురించి ఆలోచన చేయలేదు. అనేక కమీషన్లు నివేదికలు ఇస్తే… నెహ్రూ ఆ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. నేడు రాహుల్ గాంధీ రాజ్యంగం పుస్తకం పట్టుకుని సమాజంలో చీలిక తేవడానికి కుట్ర చేస్తున్నారు.
అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి వృద్ధి చేయాలని మోడీ చూస్తున్నారు. రాహుల్ మాత్రం వర్గాల వారీగా విడకొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… కులాల పేరుతో రిజర్వేషన్లు ఉండేందుకు వీలు లేదని గతంలో రాజీవ్ గాంధీ చెప్పారు. ఇప్పుడు తండ్రి బాటలో రాహుల్ గాంధీ కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సంచారజాతులకు ఒక గౌరవం, గుర్తింపు ఇవ్వాలని మోడీ ఆలోచన చేశారు. 1999లో వాజ్ పాయ్ తొలుత ఈ ఆలోచన చేశారు.. కొంతవరకు అమలు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ వారిని పట్టించుకోలేదు. మోడీ మళ్లీ సంచార జాతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సంచార జాతుల వారికి కేరాఫ్ లేదు.. సర్టిఫికేట్లు లేవు.. ఆధార్ లేదు. మోడీ ప్రభుత్వం వారి కోసం సీడ్ అనే పథకం ప్రవేశ పెట్టింది.
ఏపీ, తెలంగాణా తో సహా రేపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేపు కార్యక్రమాలు చేపడుతున్నాం.
సమావేశానికి ఓబిసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్ అధ్యక్షత వహించారు.
రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య,పాకా వెంకట సత్యనారాయణ సంచార జాతులు సమస్యలపై మాట్లాడారు.
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు,బీజేపీ శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్యే లు పార్థసారథి, ఎన్. ఈశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సంచార జాతులు రాష్ట్ర అధ్యక్షుడు అరబోలు చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ కిలారు దిలీప్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, వివిధ సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు.