• కార్యకర్తలకు గుర్తింపు, నాయకత్వ సామర్థ్యం పెంపు, భద్రత అనేవి త్రిశూల్ ప్రధాన అంశాలు
• మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ నినాదంతో ముందుకు వెళ్తాం
• ఆంధ్రప్రదేశ్ కు 15 సంవత్సరాల సుస్థిర ప్రభుత్వం అవసరం
• పాలనతోపాటు పార్టీ కోసం రోజూ 4 గంటల కేటాయింపు
• గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు నాయకత్వం పెంపొందించడమే లక్ష్యం
• కార్యకర్తల సామర్థ్యం ఆధారంగా బాధ్యతలు అప్పగింత
• జనసేన వివిధ విభాగాల విస్తరణకు ఆలోచన
• కాలంతోపాటు రాజకీయ సిద్ధాంతాల్లో మార్పులు అనివార్యం
• విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ప్రసంగించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విశాఖ: పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు.. భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం.. నిరంతరం పార్టీ కోసం పని చేసే వారికి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన ‘త్రిశూల వ్యూహం’ రూపొందిస్తున్నామనీ, దీన్ని దసరా నుంచి అమలు చేసేందుకు పకడ్భందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామనీ, ఈ త్రిశూల్ వ్యూహం ద్వారా జనసేన పార్టీ సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుందని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అందుకోసం ఒక ప్రణాళికాబద్దమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా నిలిచే పరమ శివుడి త్రిశూలం మాదిరిగా ప్రతి క్రియాశీలక సభ్యుడికీ జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత కల్పిస్తుందని తెలిపారు.
పార్టీలో సభ్యులుగా మొదలు పెట్టి, పార్టీ ప్రస్థానంలో నిబద్దత, నిజాయతీతో భాగస్వామ్యమయ్యే ప్రతి జనసైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ.. మన త్రిశూల్.. మన జనసేన.. అని చెప్పారు. శనివారం విశాఖపట్నం వేదికగా ‘‘సేనతో సేనాని’’ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకునే కార్యకర్తలు కిందిస్థాయిలోనే ఉండిపోకూడదు. వారివారి సామర్థ్యాన్ని బట్టి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలన్నదే నా తదుపరి రోడ్ మ్యాప్. కింది స్థాయి నుంచి నాయకులు రావాలి. అందుకోసం ఒక ప్రణాళికాబద్దమైన వ్యూహం తయారు చేశాం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఈ వ్యూహం అమలవుతుంది. త్రిశూల్ ప్రోగ్రాంలో భాగంగా పార్టీ కోసం పని చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి క్రియాశీలక సభ్యుడికీ ప్రత్యేక మెంబర్ షిప్ ఐడీ ఇస్తాం.
ప్రతి క్రియాశీలక సభ్యుడు/సభ్యురాలు కేంద్ర కార్యాలయానికి అనుసంధానంగా పని చేసే విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. గ్రామ, వార్డు, నియోజకవర్గ, పార్లమెంటు, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన నాయకులు కావాలనుకునే వారి కోసం నేను రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను.
• నాయకత్వం అంటే పదవి కాదు
మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం పదవి కాదు.. సేవతో, పోరాటాలతో సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకితభావంతో ముందుకు వచ్చినవారే నాయకులు అవుతారు. దానికి మార్గం నేను వేస్తున్నాను. క్షేత్ర స్థాయి కార్యకర్తలను మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి.
సామర్థ్యం ఉన్న కార్యకర్తలను గుర్తించాలి. కొత్తతరం నాయకులను తయారు చేయాలి. అందుకోసం ప్రతి కార్యకర్తని నిబద్ధత గల నాయకులుగా తీర్చిదిద్దే కచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిక్షణ శిబిరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పని చేసే అందరినీ ప్రభావవంతమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
• పాలనతో పాటు పార్టీకి రోజుకు నాలుగు గంటలు కేటాయిస్తా
మారుమూల గ్రామాల్లో ఉన్న యువతను నాయకులుగా తీర్చిదిద్దే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, సాధారణంగా చేసే సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఆపించేశా. ఇక మీదట పాలనాపరమైన బాధ్యతలు చూస్తూనే, ప్రతి రోజూ పార్టీ కోసం నాలుగు గంటలు కేటాయిస్తా. పాలనాపరమైన బాధ్యతలు విస్మరించకుండా ఆదివారం, సెలవు దినాలు వాడుకుంటూ 2029 నాటికి మీ నుంచి బలమైన నాయకులను తయారు చేస్తా. తెలంగాణ జనసేన శ్రేణులకు ఎంతో పోరాటశక్తి ఉంది. జనసేన భావజాలంతో మీరంతా బలపడండి. పవన్ కళ్యాణ్ ఎలా నిలబడి బలపడ్డాడో చెబుతాను అదే మీరు పాటించండి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా ఇలా ఏ రాష్ట్రంలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తుంది.
• స్వతంత్ర ఆలోచన శక్తితో పని చేసే ఆడపడుచులు కావాలి
ప్రతి క్రియా వాలంటీర్ తన ప్రయాణాన్ని మీ నియోజకవర్గం, స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడం ద్వారా మీ నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఇక మీదట ఆడపడుచుల్ని పక్కన ఉండమని చెప్పడానికి కుదరదు. ఆడపడుచులకు 33 శాతం రిజర్వేషన్ అని చెప్పాం. తెలంగాణలో కావ్య, శిరీష లాంటి బలమైన భావజాలం కలిగిన మహిళా కార్యకర్తలు రావాలి. పార్టీపరంగా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
పాలనలో భర్త చాటుగా ఉంటూ సంతకాలు పెట్టే మహిళలు కాకుండా, స్వతంత్రంగా ఆలోచించి ముందుకు సాగే ఆడపడుచులను తయారు చేసే బాధ్యత, నాయకత్వం పెంపొందించే శిక్షణ ఇస్తాం. సమర్థుడైన ప్రతి క్రియాశీలక సభ్యుడికీ పార్టీ నిర్మాణంలో ఎదగడానికి బలమైన మార్గం రూపొందిస్తున్నాం. సభ్యత్వంతో ప్రారంభించి పని చేస్తాను అనే వారిని వాలంటీర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, సెంట్రల్ లీడర్ షిప్ వరకు ఎదిగే అవకాశం ఇస్తాం. క్షేత్ర స్థాయి నుంచి కేంద్ర నాయకత్వం వరకు ఎవరికైనా అవకాశాలు త్రిశూల్ ద్వారా కల్పిస్తాం.
• పార్టీ విభాగాలపైనా దృష్టి పెడతాను
జనసేన పార్టీకి వివిధ రంగాల విభాగాలపైన ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. అయితే ఇక మీదట కార్మిక, కర్షక విభాగాలతోపాటు ముఖ్యమైన విభాగాల నిర్మాణంపైనా దృష్టిపెడతాను. ఆయా విభాగాల్లో కీలకమైన వ్యక్తులను తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తాం. అలాగే త్రిశూల్ వ్యూహంలో భాగంగా క్రియాశీల కార్యకర్తలు రంగాల వారీగా తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లో పనిచేయాలనుకుంటే, వారి అభిప్రాయం తెలుసుకొని ప్రోత్సహిస్తాము.
ఆయా రంగాల్లోని అంశాలపై పూర్తి శిక్షణ, అధ్యయనం, విజ్ఞానం, విషయ పరిజ్ఞానం పెంపొందించుకునేలా చూస్తాం. క్రమశిక్షణ, నిబద్దత చూపిన కార్యకర్తలను ముందుగా గుర్తిస్తాం. తదుపరి పార్టీ వారిని ముందుకు తీసుకువెళ్తుంది. మొదట నేను జనసేనలో ఒక వ్యవస్థను నిర్మిస్తాను. తర్వాత ఆ వ్యవస్థ పార్టీని ముందుకు తీసుకు వెళ్తుంది. మన కార్యకర్తల భద్రత కోసం ఇప్పటికే ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా 2020లో ఈ బీమాను తీసుకొచ్చాం.
అది ఇక మీదట కూడా ముందుకు సాగుతుంది. రాజకీయాలు వ్యాపారం కాదు. డబ్బు సంపాదించేందుకు మార్గం అంతకంటే కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్న వారి కోసమే నా వెతుకులాట. అలాంటివాళ్లు నాకు కావాలి. రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం రంగు పులిమి లబ్ది పొందే పరిస్థితులు ఉండకూడదు. నేను కులం కోసం ప్రయాణం సాగిస్తే కుల నాయకుడిగా మిగిలిపోయేవాడిని. నేను జాషువా విశ్వనరుడు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను.
• సైద్ధాంతిక బలమే జనసేనను జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్తుంది
జనసేనలో చేరతామని ఈ మధ్య తమిళనాడు నుంచి కొంత మంది వచ్చారు. మహారాష్ట్రలోని లాతూర్, షోలాపూర్, ఒడిశాల నుంచి కూడా వచ్చి పార్టీలో చేరతామంటున్నారు. మీరు బలంగా నిలబడాలంటే ముందుగా సమస్యలపై పోరాటం చేయాలి. దశాబ్ద కాలం తర్వాత ఈ రోజున నేను ఇంత మంది ఎమ్మెల్యేలతో వచ్చా. ఏ రాష్ట్రం వారు అయినా భవిష్యత్తులో ఆ స్థాయికి వెళ్లాలి అంటే ముందుగా పోరాటం చేయాలి.
మీకు అవసరం అయిన సైద్ధాంతిక బలం, వనరులు మాత్రమే నేను సమకూర్చగలను. మీకు మానసిక స్థిరత్వం, స్థైర్యం ఉంటే సిద్ధాంతాలను నమ్మి ముందుకు వెళితే ఒక రోజున జనసేన జాతీయ పార్టీ స్థాయికి వెళ్తుంది. అది మనమంతా కలసి నిలబడితే అవుతుంది. ప్రతి ఒక్కరు పదవి, అధికారం అన్న ఆలోచన మాని మన దేశం, మన మూలాలను పరిరక్షించుకోవాలన్న భావన పెంపొందించుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే త్రిశూల్ ప్రోగ్రాం పెట్టాం.
• పుష్కర కాలం… ఎన్నో అవరోధాలు
సగటు మనిషి కోపం, ఆవేశం, ఆక్రోశాల నుంచే జనసేన పార్టీ పురుడుపోసుకుంది. జనసేన పార్టీ ఏర్పడి వచ్చే ఏడాది మార్చి 14నాటికి పుష్కర కాలం పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కుటుంబానికి సమయం కేటాయించలేకపోయాను. సినిమాలపై దృష్టి సారించలేకపోయాను. కానీ సమాజం, దేశంపై ఏనాడూ ప్రేమ తగ్గలేదు. దాని ఫలితంగానే దేశ రాజకీయ చరిత్ర ఎవరూ సాధించలేని విధంగా 100 శాతం స్ట్రైక్ రేట్ తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం.
2014లో 150 మందితో మొదలైన జనసేన పార్టీ ప్రయాణం నేడు 12 లక్షల పైచిలుకు క్రియాశీల కార్యకర్తలకు చేరింది. పార్టీ భావజాలాన్ని నమ్మి నాతో పాటు దశాబ్ద కాలపాటు ప్రయాణం చేసిన జన సైనికులు, వీరమహిళలే రియల్ హీరోస్. వాళ్ల పోరాటం ఫలితంగానే 21 మంది శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించాం.
• జన సైనికులు, వీర మహిళలే అన్ సంగ్ హీరోస్
పోరాటాల పురుటిగడ్డ తెలంగాణలో జనసేన పార్టీ ప్రయాణం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పార్టీ ప్రారంభించిన మొదటి రోజు ఏ ఉద్వేగంతో ఉన్నానో… ఈ రోజుకు అదే ఉద్వేగంతో ఉన్నాను. దశాబ్దకాల ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. తగిలిన ప్రతి దెబ్బకు రాటుదేలాను తప్ప విశ్వాసం కోల్పోలేదు, నడక తడబడలేదు. తగిలిన ప్రతి దెబ్బ నన్ను మరింత బలవంతుడిని చేసింది.
ఈ ప్రయాణంలో నాతో పాటు నిలబడిన మీరంతా అన్ సంగ్ హీరోసే. నిజాయతీతో భవిష్యత్తు గమనాన్నే మార్చొచ్చు అని మీరంతా నిరూపించారు. యుద్ధరంగంలో కాలం, సహనమే బలమైన ఆయుధాలు. అలాంటి సహనాన్ని గుండెల్లో పెట్టుకున్న రియల్ హీరోస్ జన సైనికులు, వీర మహిళలు.
• ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం సరైనదే
జనసేన పార్టీ జాతి ఆశలను ముందుకు తీసుకెళ్లే పార్టీ. ఈ పార్టీ గురించి ఒక రోజు దేశమంతా మాట్లాడుకోవాలని కలలు కన్నాను. అది నిజమైనందుకు గర్వపడుతున్నాను. బంగారం లాంటి భవిష్యత్తు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానని నాకు ఏనాడు అనిపించలేదు.
ఉద్ధానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడినప్పుడు, గిరి శిఖర గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూసి నా నిర్ణయం సరైనదే అనిపించింది. జనసేన పార్టీ ఉనికి లేకపోయినా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి మేము కూడా జనసేనలో భాగస్వాములు అవుతాం అని అడుగుతున్నారు. వారందరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను.
కాలంతో పాటు మార్పు అనివార్యం
సరైన రాజకీయ వ్యూహం లేకుండా సిద్ధాంత బలం మాత్రమే మాట్లాడి అడవుల్లో హతమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో సిద్ధాంత బలంతోపాటు వాటిని సంపూర్ణంగా నమ్మి అమలు చేసే శక్తి ఉండాలి. అప్పుడే కోరుకున్న మార్పు వస్తుంది. జనసేన పార్టీ ఏడు మూల సిద్దాంతాలను ప్రతిపాదించినప్పుడు చాలా మంది అవహేళనగా మాట్లాడారు. నిలకడలేని రాజకీయాలు అంటూ అపహాస్యం చేశారు. ఆ రోజు నన్ను నిజంగా నమ్మింది జనసైనికులు, వీరమహిళలే.
ఆనాడు కమ్యూనిజం అంటూ మాట్లాడిన సోవియట్ రష్యా.. డెమోక్రటిక్ దేశంగా మారింది. మావోయిజం అని మాట్లాడిన చైనా క్యాపిటలిజంలోకి వచ్చింది. కఠినమైన నిబంధనలు పాటించే సౌదీ అరేబియా ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించింది. ప్రపంచమే క్రమక్రమంగా మారుతోంది. కాలంతోపాటు మార్పులు అనివార్యం. కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటిలిజం ఇలా అన్ని సిద్ధాంతాలపై అవగాహన పెంచుకున్న తరువాతే పార్టీ పెట్టాను.
సినిమాల్లో నటించినంత మాత్రాన అవగాహన లేదని అనుకోవద్దు. ప్రతి సిద్ధాంతంపై సంపూర్ణ అవగాహనతోనే మాట్లాడతాను. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకు నేను దశాబ్ద కాలంపాటు నలిగి నిలబడ్డాను కాబట్టే 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాను. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడానికి తుపాకులే పట్టుకోనక్కరలేదు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో మనం పట్టుకున్న పార్టీ జెండానే ఆయుధంగా మారుతుంది. మన మాటే తూటా అవుతుంది.
• మనం నిలబడ్డాం.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములయ్యాం
మనం బలంగా నిలబడ్డాం.. పోరాడాం కాబట్టే రాష్ట్రంలో సుస్థిరపాలనకు బీజాలు పడ్డాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వద్దేవద్దు అని మొదట గళమెత్తింది జనసేన పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని కేంద్ర పెద్దల దృష్టికి బలంగా తీసుకెళ్లింది జనసేన పార్టీ. మనం అండగా నిలిచాం కాబట్టే కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసి, ఆర్థికంగా ఆదుకునేందుకు నిధులు విడుదల చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8,622 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,295 నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. విశాఖ స్టీల్ ను గాడిన పెట్టే చర్యలు వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.12,157 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.5,936 కోట్లు అందించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు చొరవ తీసుకవడం సంతోషం.
కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం కింద ప్రతి ఒక్కరికీ ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి అయిదేళ్లలో రూ.13,422 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం కింద 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. దీనికోసం రూ.2 వేల కోట్లను వెచ్చించనుంది.
అలాగే నేను నిర్వర్తించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ఒకే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభలను నిర్వర్తించి రికార్డు నెలకొల్పాం. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా పల్లె పండుగ పేరుతో 4 వేల కిలోమీటర్ల రోడ్లు, 22,500 గోకులాలు, 1.50 లక్షల నీటితొట్టెలు వంటి కార్యక్రమాలను అమలు చేశాం. 75 లక్షల ఉపాధి శ్రామికులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ప్రమాద బీమాను అమలు చేశాం.
అడవితల్లి బాట పేరుతో రూ.1005 కోట్ల నిధులతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ, 1069 కిలోమీటర్ల రోడ్లను వేయగలిగాం. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 5 కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చి, రూ.7,910 కోట్లతో 1.20 కోట్ల మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి కొరత లేకుండా చేయగలిగాం. ఇవన్నీ కూడా దేశం గురించి ఆలోచించి, రాష్ట్ర పురోగతి గురించి రాజకీయ ప్రయాణం చేస్తే లభించిన గొప్ప మైలురాళ్లు.
రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వ పాలన ఉంటేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ సరికొత్తగా వెలుగులీనుతుంది. గత ప్రభుత్వ అరాచక పాలన మళ్లీ ఈ రాష్ట్రంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఈ దసరా నుంచి దేశం కోసం పనిచేసే సరికొత్త సేనను నిర్మిద్దాం. ఈ క్రతువులో ప్రతి ఒక్కరూ పోరాట శక్తిలా తయారు కావాలి.’’ అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కె.నాగబాబు, ప్రభుత్వ విప్ లు పిడుగు హరిప్రసాద్, అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, శాసన సభ్యులు సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేశ్ బాబు, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, నిమ్మక జయకృష్ణ, పంతం నానాజీ, దేవ వరప్రసాద్, బత్తుల బలరామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, మండలి బుద్ధప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీటీడీ బోర్డు సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జీవీఎంసీ ఉప మేయర్, కార్పొరేటర్లు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పార్టీ నియోజకవర్గ ఇంచార్జులు, పీఓసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.