– విద్యుత్ రంగ సమాలోచనలో నిపుణులు
విజయవాడ: స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సభ్యుడు శ్రీకుమార్ వెల్లడించారు. థింక్ ఫర్ ఏపీ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంపై సమాలోచన పేరుతో స్థానిక బాలోత్సవ భవన్లో సదస్సు జరిగింది. శాతావాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి అధ్యక్షతన ‘విద్యుత్ సంస్కరణలు`ప్రభావాలు` ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకుమార్ మాట్లాడారు.
విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మీటర్లను చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయని చెప్పారు. రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టిన సమయంలో అనేక ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. మీటర్ ఫైయిలై డేటా రీడిరగ్ సమయంలో సమస్య వచ్చిందన్నారు.
విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కార్పొరేట్ రంగానికి ఎలా దోచిపెట్టాలి, కమీషన్లు ఎలా పంచుకోవాలనే విధంగానే ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా వారికి కావాల్సిన వారితో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అధిక ధరలకు చేసుకుంటూ వినియోగదారులపై విపరీతమైన భారాలు మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ రంగ నిపుణుడు బి.తులసీదాస్ మాట్లాడుతూ ప్రపంచీకరణ తరువాత సంస్కరణల్లో విద్యుత్ రంగం ముందు ఉందని, ఇది ప్రయోగశాలగా తయారైందన్నారు. యూరోపియన్ పెట్టుబడులు పునరుత్పాదక విద్యుత్‌లో పెడుతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగం విసృతి చాలా ఎక్కువగా ఉందని, సమాజం మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వక్తలకు వై.రాము స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఏపీ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు వందన సమర్పణ చేశారు. రిటైర్డ్ ఎస్ఇ పున్నారావు, విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గన్నారు.