– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మంగళవారం బెడాలపాడు గ్రామంలో జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను గృహనిర్మాణ శాఖ ఎండి వి. పి. గౌతమ్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసన సభ్యుడు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలపాడు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ఒక చారిత్రక ఘట్టం. ఇది గ్రామ ప్రజలకు సంతోషకరమైన మరియు గుర్తుండిపోయే రోజు అవుతుంది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలి అని సూచించారు. కార్యక్రమంలో టీజీ ఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.