– పులివెందుల ప్రజలకు కూడా ఎంట్రీ పాస్ లా?
– మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు: మాజీ సీఎం జగన్ రెడ్డి నియంత పోకడల నుంచి బయటకు రాలేకపోతున్నారు… పులివెందుల ప్రజలకు కూడా ఎంట్రీ పాస్లా? అని సర్వేపల్లి శాసన సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం. ఏ ఊరికి వెళ్లినా ప్రజలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గొడ్డలి పోటుతో చిన్నాయన్ని లేపేసిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది? ఇప్పటికైనా కొంచెం కాకపోతే కొంచెమైనా బుద్ధితో మాట్లాడండి.
గతంలో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టిన సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదం. దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఎన్నిసార్లు అడుక్కుంటారు? సంవత్సరం మూడు నెలల నుంచి అడుక్కోవడమే పనా? పులివెందుల జెడ్పీటీసీ గెలిపించుకోలేని జగన్ రెడ్డిని కలవాలంటే ఎంట్రీపాస్ ఉండాలంట! సొంత నియోజకవర్గం, సొంత మండల ప్రజలు కలవాలంటే కూడా పాస్ తీసుకోవాలంట!
ఇవన్నీ జగన్ రెడ్డి నియంతపోకడలకు నిదర్శనం. ఐదేళ్లు దరిద్రం పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.
కూటమి పాలనలో మేం ఏ ఊరికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు అమ్మఒడి ఒక బిడ్డకు ఇస్తే, మేం తల్లికివందనం ఎంత మంది బిడ్డలకైనా ఇస్తున్నాం. రైతుభరోసా అని మీరు రైతులకు రూ.7500 ఇస్తే, మేం అన్నదాత సుఖీభవగా రూ.13500 ఇస్తున్నాం.
స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాం. దీపం పథకంతో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. చేనేత కార్మికులు, మత్స్యకారులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. దళితులు, గిరిజనులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తాన్ని మీరు రూ.1.55 లక్షలకు పరిమితం చేయడంతో పాటు అందులోనూ లూటీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి మేం రూ.2.55 లక్షలతో ఇళ్లు కట్టిస్తున్నాం. ఇన్ని చేసిన మేం ప్రజల్లోకి వెళ్లేందుకు ఎందుకు భయపడుతాం..ప్రజలే మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు?
సొంత చిన్నాయనపై గొడ్డలి పోటు వేసిన సమయంలో అప్పట్లో ఓ మహిళ నుంచి పార్టీని కాపాడుకునేందుకు అందరం కలిసి ప్రజాస్వామ్యయుతంగా చంద్రబాబునాయుడిని ఎన్నుకున్నాం. ఈ రోజుకీ ప్రజలు చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ గెలిపించుకుంటున్నారు. వెన్నుపోటు అయితే ప్రజలు ఆదరిస్తారా? మీరు చిన్నాయనపై గొడ్డలి పోటు వేసి, ఆ నెపాన్ని మాపై నెట్టి 2019 ఎన్నికల్లో గెలిచారు.
ప్రజలు అంతా గ్రహించాకే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు.