– కేసీఆర్ పై సిబిఐ విచారణ జరపాలనుకోవడం సిగ్గుచేటు
– కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు స్వర్ణయుగం
– దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడీ లేకున్నా సంక్షేమ పథకాల ఆగవు
– చిత్తశుద్ది లేనివాళ్లనే చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తారు
– తన అనుచరులతో బీఆర్ఎస్ లో చేరిన మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎర్రవల్లి: మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ లతో రాబోయే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్ పై సిబిఐ విచారణ జరపడం సిగ్గుచేటు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. సిబిఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, రేవంత్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితికి నిదర్శనం అన్నారు.
పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్, భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదేళ్లలో కేసిఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదన్నారు.
కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ ను బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందన్నారు. ఆనాటి దుర్భర రోజులను మళ్లీ తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నిజాయితీగా మోసం చేశాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి తన మాటలతో, చేతలతో ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను క్యాన్సర్, ఎయిడ్స్ రోగితో పోల్చడం, ఢిల్లీకి పోతే తనను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని అనడం, పేగులు మెడలో వేసుకుంటా లాంటి మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు, రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతున్నారన్నారు.
దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడీ లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవన్న కేటీఆర్, కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం సున్నా అయినా రైతుబంధు, పెన్షన్లు, జీతాలను కేసీఆర్ ఆపలేదన్నారు. కానీ కాంగ్రెస్ సన్నాసులకు పనిచేయడం చేతకాక సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమే స్పష్టంగా సమాధానం చెప్పినా, సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందన్న కేటీఆర్, వారసత్వ ఉద్యోగాలు కల్పించడం నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్ని విధాలా అండగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన పది హామీల్లో ఎనిమిదింటిని పూర్తిగా, రెండింటిని పాక్షికంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. అయినప్పటికీ సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు.
పార్టీకి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు మధ్య సమన్వయం లోపించిందా? యూనియన్ అంతర్గత రాజకీయాలు పార్టీపై ప్రభావం చూపించాయా? అనే కోణంలో ఆనాడు చర్చించామని చెప్పారు. పార్టీ మద్దతు లేకున్నా, మణుగూరు డివిజన్లో కేవలం 24 ఓట్ల తేడాతోనే యూనియన్ నాయకులు ఓడిపోయారన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని కేటీఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీల్లో తాను భద్రాచలం, కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్టు, రేవంత్ రెడ్డిని చూశాకే ప్రజలకు కేసీఆర్ విలువ తెలిసిందన్నారు.