– జగన్ హయాంలో టన్ను ఇసుక రూ.40 వేల నుంచి రూ.లక్ష కొనుగోలు చేశారు
– ప్రజ సమస్యలపై చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలి
– ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్
మంగళగిరి: రాష్ట్రంలో ఎవరికీ ఇసుక కొరత లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ, ఇసుక కొరత ఉందని, అధిక ధరలకు అమ్ముతున్నారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి, ఎక్కడైనా ఇసుక కొరత ఉందో వైసీపీ నేతలు నిరూపించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక అమ్ముతున్నారా? లేదా అధిక ధరలకు అమ్ముతున్నారో వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. వైసీపీ హయాంలో ఇసుక ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్నారు. వైసీపీ హయాంలో లారీ ఇసుకను రూ.40 వేల నుంచి రూ.లక్షకు అమ్మారని దుయ్యబట్టారు.
ఇసుక నుంచి తైలం తీయవచ్చన్నట్టు ఇసుక నుంచి వేల కోట్లు దోచుకున్నారు. వైసీపీ పాలనలో ప్రతి నెల పార్టీ ముఖ్య నేతకు రూ.120 కోట్లు కాంట్రాక్టర్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక సమస్యలపై సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పాపాగ్ని నదిలో గానీ, అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న కడపలోని పెన్నా నదిలో గానీ, ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో లేదా అధిక ధరలకు అమ్ముతున్నారో అన్నదమ్ములు జగన్, అవినాష్ నిరూపించగలరా? అని సవాల్ విసిరారు..
జగన్ కడప పర్యటనకు సంవత్సరానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే వస్తారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, క్రిస్మస్ పండగ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రమే వస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా జగన్ తీరు అదే. ఎరువుల్లో మట్టి, ఇసుక కలిపి రైతులను మోసం చేసిన రవీంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టుకొని, యూరియా కొరత గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు. ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. రూ.265 కంటే ఒక రూపాయి ఎక్కువగా అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత రాకుండా సీఎం చంద్రబాబు చూస్తున్నారు. క్యూలో నిల్చున్న రైతులు యూరియా కోసం నిలబడ్డారని వైసీపీ నేతలు, జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బత్తాయి, చీనీల మధ్య తేడా తెలియని జగన్ ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతుంటే రైతులు సిగ్గుతో తల దించుకుంటున్నారు. జగన్ రెడ్డి పాలనలో చీనీ టన్ను రూ.48,500కు అమ్మారని, కూటమి ప్రభుత్వంలో కూడా అదే ధర రైతులు అమ్ముకున్నారు. రైతుల వద్ద దళారులు 10 టన్నులకు 2.5 టన్నులు సూట్ తీసుకుంటున్నారని జగన్ అబద్ధాలు మాట్లాడుతున్నారు.
సూట్ అనేది 30 ఏళ్లుగా ఉంది, ఇది కొత్త అంశం కాదు. రాజశేఖర్ రెడ్డి, జగన్ సీఎంగా ఉన్న సమయంలో సూట్ లేదా? మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? జగన్ కుటుంబానికి కప్పం కట్టలేక వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అరటికి ధరలు లేవని జగన్ మాట్లాడుతున్నారు. అరటి టన్ను పులివెందులలో రూ.13 వేలకు కొనుగోలు చేశారు. వర్షాలు తగ్గితే అరటి ధరలు పెరుగుతాయి. మీ తల్లి, చెల్లిని పట్టించుకోని జగన్ ఈ రోజు రైతుల కష్టాల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. జగన్ రెడ్డి పాలనలో ఉల్లి కేజీ రూ.4కు లేక రైతులు రోడ్లపై పారబోశారు. అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధరలపై జగన్ ఏమీ మాట్లాడలేదు. అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని మతిభ్రమించి మాట్లాడుతున్నారుని రాంగోపాల్ రెడ్డి విమర్శించారు.
హెరిటేజ్‌లో కిలో ఉల్లిపాయలు రూ.30కు అమ్ముతున్నారని జగన్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. 8 సంవత్సరాల క్రితమే హెరిటేజ్‌ను ఫ్యూచర్ కంపెనీకి అమ్మేశారు. ఆ సంస్థల గురించి అసెంబ్లీలో అనేక సార్లు చర్చ జరిగింది. అయినా జగన్ బురద చల్లే పనిలో ఉన్నాడు. హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని నిరూపించే దమ్ము జగన్‌కు ఉందా? పంటల బీమా జగన్ ఎన్నిసార్లు ఇచ్చారో చెప్పాలి. ప్రతిపక్షంలో చంద్రబాబు అర్ధరాత్రి వరకు ధర్నా చేస్తే, 2022లో జీవో ఇచ్చి పంట బీమా విడుదల చేశారు.
2019కి ముందు రబీ, ఖరీఫ్ రెండు పంటలకు ఇన్సూరెన్స్ ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పంటలకు మాత్రమే బీమా ఇచ్చి, కొన్ని పంటలకు తీసేశారు. ఇది వాస్తవం కాదా? రబీ పంటలకు ఎందుకు బీమా తీసేశారో జగన్ రైతులకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఆనాడు జగన్ చెప్పలేదు. పులివెందుల ప్రజల సమస్యలపై చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వం ద్వారా గన్మెన్లు, అటెండర్లు, జీతం పొందుతున్నావు, మరి ఎందుకు పులివెందుల ప్రజల సమస్యలపై అసెంబ్లీకి రావు? త్వరలో పులివెందుల ప్రజలు ప్రజా ఉద్యమం చేపట్టనున్నారు. అసెంబ్లీకి రాని పక్షంలో జగన్ శాసనసభకు రాజీనామా చేయాలి.