– 2 నెలల్లోనే దాదాపు 40 మందికి పైగా ఒకే విధంగా చనిపోయినా పట్టించుకోలేదు
– కలుషిత నీటిని తాగి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారు
– ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు
– మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలి
– ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ ప్రతినిధుల బృందం ఫైర్
తురకపాలెం: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గడిచిన రెండు నెలలుగా జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాలతో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్సీపీకి చెందిన డాక్టర్లు, నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం తురకపాలెం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో మృతుల కుటుంబాలతో మాట్లాడి, మరణాలకు గల కారణాలపై వివరాలు సేకరించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాగునీరు కలుషితం అవ్వడం వల్లే గ్రామస్తులు అస్వస్తతకు గురై, మృత్యువాత పడుతున్నారని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు వైయస్ఆర్సీపీ వైద్య విభాగం ప్రతినిధులు తెలిపారు. నీరు కలుషితం అవుతోందని నెల రోజుల కిందటే వైయస్ఆర్సీపీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గ్రామంలోని ప్రజలకు రక్తపరీక్షలు జరిపించాలని, అస్వస్తతకు గురైన వారికి గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
స్పెషలిస్ట్ డాక్టర్లను రప్పించాలి
– మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో రెండు నెలలుగా దాదాపు 40 మందికి పైగా జ్వరం బారిన పడి అకస్మాత్తుగా చనిపోతున్నారు. మృతుల్లో 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు కూడా ఉండటం కలవరపరుస్తోంది. వైయస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలను సందర్శించి వారితో మాట్లాడటం జరిగింది. వైయస్సార్సీపీ తరఫున గ్రామాన్ని సందర్శించి దీనికి గల కారణాలపై అన్వేషణ చేస్తే గ్రామానికి సరైన మంచినీటి సదుపాయం లేదని అర్థమైంది.
క్వారీ గుంతల్లో నుంచి పైపులైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకుకి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగిన వారే రోగాల బారిన పడి చనిపోతున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. గుంటూరు నగరానికి ఈ గ్రామం నుంచి రోజూ 45 లక్షల నీరు వెళ్తున్నా, వీరికి మాత్రం సురక్షితమైన మంచినీరు దొరకడం లేదు. మృతులకు చికిత్స చేసిన డాక్టర్లతో మాట్లాడితే మిలినియోసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని రిపోర్టులు ద్వారా తెలుస్తోందని చెప్పారు.
అపరిశుభ్ర పరిసరాలు, వాతావరణం, తాగునీటి కారణంగానే ఈ బ్యాక్టిరియా వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. తక్షణమే ప్రభుత్వం ఓవర్‌హెడ్ ట్యాంక్ నీటి సరఫరాను ఆపేసి సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని వైయస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న క్యాంపుల వల్ల గ్రామానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీహెచ్ సీ డాక్టర్లతో ఏం ప్రయోజనం ఉండదు.
మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావాలి. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఈ గ్రామస్తుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలి. సాధారణ మందుల ద్వారా ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమయ్యే పనికాదు. బాధితులకు మంచి మందులు తెప్పించి అందించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా గ్రామస్తులు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని మరిగించి తాగాలి. స్నానం చేసే నీటిలో కూడా డెటాల్ వేసుకోవాలి.
నెల క్రితమే కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
– గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు
తురకపాలెంలో జరుగుతున్న మరణమృదంగంపై ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకే గ్రామంలో ఒకే రకమైన వ్యాధితో 40 మందికి పైగా చనిపోవడం మామూలు విషయం కాదు. వైయస్సార్సీపీ తరఫున మేము గ్రామానికి వస్తున్నామని తెలిశాకనే ప్రభుత్వం స్పందించింది. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
గ్రామంలో బోర్ల ద్వారా తోడిన నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకు సరఫరా చేస్తున్నారు. గ్రామస్తులకు మాత్రం (సంజీవయ్య గుంట) నుంచి క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తించాం. ఈ గుంతల్లోకి నీరు కొండల్లో నుంచి వస్తుంది. ఆ నీటితోపాటు బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా కలిసి నీరు కలుషితమవుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టి పెట్టాలి. మేం గ్రామంల పర్యటిస్తే తప్ప ఆరోగ్యశాఖ మంత్రిలో కదలిక రాలేదు. అధికారుల మీద నిప్పులు చెరిగారని టీవీల్లో బ్రేకింగులు వేసుకుంటున్నారు.
కలుషిత నీటి సరఫరా జరుగుతోందని నెల క్రితమే జిల్లా కలెక్టర్‌కి నెల రోజుల క్రితమే వైయస్సార్సీపీ తరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తక్షణమే గ్రామానికి ఆరోగ్యశాఖ మంత్రిని పంపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలి. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. బాధితులకు న్యాయం జరిగేదాకా వైయస్సార్సీపీ పోరాడుతుంది.
గ్రామాన్ని సందర్శించిన వారిలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ అశోక్, స్ధానిక ఎంపీపీ అంజిరెడ్డి, జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.