– సుప్రీంకు స్పష్టం చేసిన సీబీఐ
– ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయండి
– వివేకా బిడ్డ సునీతకు సుప్రీం ధర్మాసనం ఆదేశం
– పిటిషన్ దాఖలు చేసిన ఎనిమిది వారాల్లో నిర్ణయం ప్రకటించాలి
– ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశం
– ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాలని వివేకానంద కూతురు సునీతకు సూచించిన సుప్రీంకోర్టు.. దానిపై ఎనిమిదివారాల్లో నిర్ణయం ప్రకటించాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది.
అటు సీబీఐ కూడా.. వివేకా హత్య కేసును పునర్విచారించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని సంసిద్ధత తెలిపింది. దీనితో వివేకా హత్య కేసులో మళ్లీ పురోగమనం కనిపించింది. ఫలితంగా వివేకా హంతకులను శిక్షించేందుకు మార్గం సుగమమయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దివంగత వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సీబీఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది.
రెండు వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషన్ దాఖలు చేసిన ఎనిమిది వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ఆదేశించింది.
ఎంఎం మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. మంగళవారం వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించే విషయంలో, ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది .
ఈ విచారణ సందర్భంగా.. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. అందుకు కోర్టు తగిన ఆదేశాలిస్తే తాము దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ పేర్కొంది.