– బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
– ధైర్యం ఉంటే, మీరు ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ముందు నెరవేర్చండి
– కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల, అసమర్థ, మోసాల పాలనపై బిజెపి చార్జ్‌షీట్ విడుదల సందర్భంగా మీడియాతో బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: 23 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చని పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజల వద్ద ఓటు అడిగే హక్కు లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ ప్రచారానికి దిగజారారు.
“కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే రూ.2000 పెన్షన్ కట్ అవుతుంది, 25వేల రేషన్ కార్డులు రద్దవుతాయి, ఉచిత బియ్యం రావు” అని ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడారు. ఇది పూర్తిగా బ్లాక్మెయిల్ టాక్టిక్. ఇలాంటి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం.
ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మేము ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలను ఒక్కటైనా నెరవేర్చక, ఇప్పుడు ప్రజల సంక్షేమ పథకాల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
ఒకవైపు ప్రజలను బెదిరిస్తూ, మరోవైపు బిజెపి నాయకులపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీరు ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ముందుగా నెరవేర్చండి. తర్వాతే ప్రజల వద్ద ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఉంటుంది.