– లోకల్‌గా ధాన్యం కొనే దిక్కులేదు కానీ అంతర్జాతీయ మార్కెటింగా?
– ప్రధానికి లేఖ రాసేస్తే పంటలకు గిట్టుబాటు ధర వచ్చేసినట్టేనా?
– రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వ సాయం ఎందుకు కోరడం లేదు?
– తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కృష్ణా జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని
తాడేపల్లి: వైయస్సార్సీపీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు వాదించిన సిద్ధార్థ లూథ్రాకి ఇవ్వడానికి చంద్రబాబు వద్ద డబ్బులుంటాయి కానీ పంట నష్టపరిహారం ఇవ్వడానికి, గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులుండవా అని కృష్ణా జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఏళ్లుగా అమలవుతున్న వ్యవసాయ విధానాలనే పంచసూత్రాల పేరుతో చంద్రబాబు మార్కెటింగ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి కర్నాటక రాష్ట్రం కృష్ణా జలాలు తరలించుకు పోతుంటే నీటి భద్రత పేరుతో రైతులకు కాకమ్మ కథలు చెబుతున్నారని.. చంద్రబాబు సీఎం అయ్యాక వాస్తవం చూస్తే కెనాల్స్ కింద లాకు గుమాస్తాలు, సూపర్ వైజర్లే సరిగా లేరని స్పష్టం చేశారు. అగ్రిటెక్ గురించి మాట్లాడే చంద్రబాబు వరి కోత మెషీన్లు గతంలో వైయస్సార్సీపీ పాలనలో గంటకు రూ.2500 తీసుకుంటే ఇప్పుడు రూ. 4500 తీసుకుంటున్నారని, ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు. రైతులకు కనీసం గన్నీ బ్యాగులే ఇవ్వలేని చంద్రబాబు పంచ సూత్రాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, రబీ కోసం ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, డెల్టాలో రబీ సాగుకు అనుమతివ్వాలని వైయస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన చెప్పేది నిజమైతే ఏపీకి నష్టం చేస్తూ కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచి కృష్ణా జలాలను ఎలా తరలించుకుపోతోంది? రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే కనీసం గన్నీ బ్యాగులు కూడా దొరకని పరిస్థితి ఉంటే రైతులను ఉద్ధరిస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు. 18 నెలల్లో పదుల సంఖ్యలో మోడీని కలిసిన చంద్రబాబు, రైతుల సమస్యలపై ఎందుకు చర్చించడం లేదు? ప్రధానికి రాసిన లేఖలు ఏమయ్యాయని ఒక్కసారైనా అడిగారా? ఏది చూసినా రైతు కంట కన్నీరే. ఒక్క రూపాయి చెల్లించి ఆదుకున్న దాఖలాలు లేవు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక వైయస్ జగన్ హయాంలో కన్నా ఒక్క పంటకైనా ఎక్కువ ధర పలికితే చూపించాలని సవాల్ విసురుతున్నా. పంట కోయడానికి వరి కోత మెషీన్‌కి గంటకు రూ.4 వేల నుంచి రూ. 4,500 చెల్లిస్తున్నారు. గతంలో వైయస్సార్సీపీ హయాంలో గంటకు రూ. 2,500 తీసుకునేవారు. ఇదేనా చంద్రబాబు కనిపెట్టిన అగ్రిటెక్? కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు వాదించడానికి లూథ్రాకి మాత్రం వేగంగా చెల్లింపులు చేస్తారు. ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరగడానికి డబ్బులుంటాయి.
కానీ రైతులను మాత్రం అస్సలు పట్టించుకోరు. చంద్రబాబు పాలనలో ఏపీలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకోవడానికి దిక్కులేకపోతే ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటున్నా రు. తెలుగుదేశం నాయకులు ఆంధ్రా సరిహద్దుల్లో పోలీసులను మోహరించి ఇక్కడి రైతులు తెలంగాణకి తీసుకెళ్లి ధాన్యం అమ్ముకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మంత్రులు ఒక్కరైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చొరవ చూపిస్తే కదా? పక్క రాష్ట్రంలో అమ్ముకునే స్వేచ్చే లేకపోతే అంతర్జాతీయంగా మార్కెటింగ్ అంటూ కబుర్లు చెబుతున్నారు. రబీ కోసం ఉచిత పంటల బీమాను అమలు చేయాలి. డెల్టాలో రబీ సాగుకు అనుమతివ్వాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. మినుము, పెసర పంటలకు మద్ధతు ధర కల్పించాలి.