విజన్ ప్రకటించేసి చేతులు దులుపుకొంటే చప్పట్లు కొట్టే లక్ష్యాలను గుడ్డిగా చేరుకోలేము. పద్దతి ప్రకారం క్రమం తప్పకుండా మంత్రి మండలి సమావేశాలు, ఎస్ఐపీబీ సమావేశాలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు, మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకుంటూ, సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, గాడిన పడ్డ రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించాక, అభివృద్ధిలో వేగాన్ని చూపడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఇవ్వాళ రాష్ట్ర ఆర్థిక దిశను నిర్ణయించే కీలక సదస్సును సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల కాన్ఫరెన్స్ మొదలైంది. ఈ సమావేశంలో వృద్ధిరేటు పెంపు, ప్రణాళిక అమలు, ప్రజల ఆకాంక్షలు, ఆత్రుత, సమస్యలు గురించి చర్చిస్తారు.
అసలు లక్ష్యం ఏమిటి గుర్తు చేసుకొంటూ.. మొదటి రెండు క్వార్టర్ల ఫలితాలపై సమీక్ష, మిగిలిన వాటిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
డేటా డ్రివెన్ గవర్నెన్స్ వైపు:
పాలనలో పారదర్శకతకు శ్రీకారం చుడుతూ, ప్రభుత్వం డేటా డ్రివెన్ జీఈఎస్డీపీ (GSDP), కేపీఐ (KPI), మరియు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఆధారిత విధానాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అంటే, ఇకపై కేవలం భావోద్వేగాల ఆధారంగా కాకుండా, వాస్తవ గణాంకాలు, లక్ష్యాల సాధన సామర్థ్యం (KPIలు), మరియు ప్రజల సానుకూల దృక్పథం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారన్న మాట. ఈ దిశానిర్దేశంలో, పరిశ్రమలే వృద్ధికి ఇంధనమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి శాఖ చేసే పనులు, అధికారులు తీసుకునే చర్యలు – అన్నీ డేటా రూపంలో రికార్డు అవుతాయని, అది వారి కెరీర్ మొత్తానికి పదిలంగా ఉంటుందని గుర్తుచేయడం, బాధ్యతాయుతమైన పాలన వైపు వేస్తున్న కీలక అడుగు.
ప్రాంతీయ సమస్యలకు ప్రత్యేక పరిష్కారాలు
రాయలసీమ వంటి ప్రాంతాలకు కరువు నుంచి కాంతి వైపు పయనం అవసరమని గుర్తించారు. అనంతపురం వేరుశనగ రైతులకు దేశంలోనే తొలిసారి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, ఇజ్రాయెల్ సాంకేతికతతో కరువు నివారణకు ప్రణాళికలు వేయడం ఆశాజనకం. అన్నా హజారే, రాజేంద్రసింగ్ స్ఫూర్తితో జలసంరక్షణ ఉద్యమం, 944 టీఎంసీల జలాశయాల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలు పైకి వచ్చేలా చేయడం రాయలసీమకు కొత్త ఊపిరి పోస్తుంది.
విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు
“వినియోగం నుంచి ఆదాయం వరకు” అనే నినాదంతో విద్యుత్ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. సౌరశక్తి వినియోగం ద్వారా డిమాండ్‌ను తగ్గించడం, ఈ ఏడాది కరెంట్ ఛార్జీలు పెంచకపోవడం ప్రజలకు ఉపశమనం. పక్క రాష్ట్రాలతో బార్టర్ విధానం (ఉత్పత్తి చేసి వాడుకుని, మిగిలితే అమ్ముకునే) వంటి వినూత్న ఆలోచనలు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడానికి మార్గాలు చూపుతున్నాయి.
ఖర్చు చేయడమే కాదు, ఆదాయం పెంచాలి
అన్నిటికంటే ముఖ్యంగా, “ఖర్చు పెట్టడమే కాదు – ఆదాయం పెంచుకునే మార్గాలు కూడా వెతకాలి” అనే ముఖ్యమంత్రి దిశానిర్దేశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యవసరం. విశాఖ – అమరావతి – తిరుపతి జోన్లుగా రాష్ట్రాన్ని విభజించి, వృద్ధిరేటు లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, మార్పులు చేర్పులు చేస్తూ ప్రజల అవసరాలే మార్గదర్శకంగా ముందుకు సాగాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామం.
– చాకిరేవు