“ఇక్కడికి రావడం నాకు చాలా ఉద్వేగభరితంగా ఉంది. నా బాల్యం, నా జ్ఞాపకాలు అన్నీ ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి. నేను శ్రీకాకుళం, విశాఖపట్నం మధ్యే పెరిగాను. నా అమ్మ, నా అమ్మమ్మ, నా అన్నయ్య—అందరూ ఈ విశాఖపట్నంలోనే ఉన్నారు. మా మామలు కూడా శ్రీకాకుళం, వైజాగ్ మధ్యే నివసిస్తున్నారు.” అని ఆయన తన కుటుంబ అనుబంధాన్ని పిల్లాడై వివరిస్తుంటే నాది వైజాగ్ కాదు, కానీ కళ్లు చెమర్చాయి ఆ మాటలకు.
కాగ్నిజెంట్ లాంటి అమెరికన్ దిగ్గజ కంపెనీకి సీఈవో రవికుమార్ మాటలకు, విశాఖకు వచ్చేసిన ఉద్యోగులు మరింత భావోద్వేగంతో చప్పట్లు కొట్టారు. చంద్రబాబు కూడా అదంతా చూసి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక్కడే ఒక లక్షమంది ఉద్యోగులను తెచ్చి, ఇక్కడికే వచ్చేయండి అని కోరారు. ఇది ఇప్పటికి సాధ్యం కాకపోయినా తరుచూ వచ్చి వెళుతుంటే మీకే ఇక్కడ ఉండాలనిపిస్తుంది అని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ క్యాంపస్ల నుండి అవకాశం ఇస్తే.. బహుశా ఓ వెయ్యిమంది వస్తారేమో అనుకున్నారు. నాలుగువేలమందికి పైగా వెళతాం అనే సరికి ఆశ్చర్యపోయింది కాగ్నిజెంట్ యాజమాన్యం.
అలా మారడం అంత సులువు కాదు. ఎందుకంటే ఎక్కువ కంపెనీలు ఉన్న సిటీలలో సులభంగా వేరే అవకాశాలు వస్తాయి. అక్కడ సౌకర్యాలు, కుటుంబం, పిల్లల చదువులతో స్థిరపడి వుంటారు. పుట్టిపెరిగిన ప్రదేశం అయినా వైజాగుకు ధైర్యంగా వచ్చేశారు 500 మంది. కేవలం నమ్మకం, మన రాష్ట్రం అన్న మమకారం.
ఒక గ్లోబల్ టెక్ దిగ్గజం తమ కార్యకలాపాలను ప్రారంభించడం, స్థానిక యువతకు వేలాది ఉద్యోగావకాశాలను అందించనుండటం… ఒక తల్లి తన సొంత బిడ్డ విజయాన్ని చూసినంత ఆనందాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చింది.
రవికుమార్ గారి ఈ మాటలు… కేవలం ఒక CEO ప్రకటన కాదు, తమ ప్రాంతంపై మమకారం ఉన్న ఒక బిడ్డ మనసులోని భావాలు!