– పథకాల పేర్లు మార్చి నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ – బీజేపీ దొందూ దొందే
– బీజేపీకి జాతీయ పార్టీ అనే నైతిక హక్కే లేదు: కేటీఆర్.
– ప్రజా క్షేమం కన్నా పేర్ల మార్పుపైనే చిల్లర రాజకీయం
– కేసీఆర్ హుందాతనాన్ని చూసి నేర్చుకోండి
– కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హితవు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పథకాల పేర్లు మార్చడంలోనూ, వాటిని నిర్వీర్యం చేయడంలోనూ ఈ రెండు పార్టీలు ” దొందూ దొందే” అని ఆయన విమర్శించారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ తన సంకుచితత్వాన్ని చాటుకుందని, పల్లె ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జాతిపిత పేరును తొలగించిన బీజేపీకి జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు. పేదలకు రూ. 5లకే భోజనం అందించే “అన్నపూర్ణ క్యాంటీన్ల” పేరును “ఇందిరమ్మ క్యాంటీన్లు”గా మార్చడం చిల్లర రాజకీయమని కొట్టిపారేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ చీరలను నిలిపివేసి, నేతన్నల పొట్టకొట్టి, ఇప్పుడు వాటికి రాజకీయ రంగు పులుముతూ “ఇందిరమ్మ చీరలు”గా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, “కాంగ్రెస్ తల్లి”ని ప్రజలపై రుద్దడం అమానుషమని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలైన రైతుబంధును రైతుభరోసాగా మార్చి రైతులకు అందకుండా చేస్తున్నారని, కేసీఆర్ కిట్లు మరియు న్యూట్రీషన్ కిట్లను నిలిపివేసి తల్లీబిడ్డల ఆరోగ్యంతో కాంగ్రెస్ ఆటలాడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అవార్డులు తెచ్చిపెట్టిన పల్లె ప్రగతి, హరితహారం వంటి పథకాల పేర్లు మార్చి వాటికి నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ గారు గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను అదే పేర్లతో కొనసాగించి తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు.
చివరగా, ప్రజలకు మేలు చేయడం కంటే కేవలం పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడమే లక్ష్యంగా ఈ ఢిల్లీ పార్టీలు పనిచేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. దేశ ముఖచిత్రాన్ని మార్చే ఆలోచన ఈ పార్టీలకు లేదని, 150 కోట్ల భారతీయులు ఈ రాజకీయాల వల్ల నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు త్వరలోనే ఈ రెండు పార్టీల భరతం పడతారని కేటీఆర్ హెచ్చరించారు.