రాజధాని అమరావతి పరిధిలో మందడం పెద్ద గ్రామం. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ లో ఈ గ్రామం చుట్టూ నాలుగు రోడ్లు వెళుతున్నాయి ఉత్తరం వైపున ఈ3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. మధ్యలో ఈ ఫోర్ రోడ్డు ఉంది తూర్పున ఎన్ 7 రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లు కూడా గ్రామానికి ఆనుకునే ఉంటాయి దక్షిణాన ఈ 5 రోడ్డు వెళుతుంది. పడమట మందడం మల్కాపురం గ్రామానికి అనుకొని ఎన్ 9 రోడ్డు వెళుతుంది. ప్రస్తుతం ఈ రోడ్డు ద్వారానే వెలగపూడి సెక్రటేరియట్ కు రాకపోకలు జరుగుతున్నాయి.
మాస్టర్ ప్లాన్లో చూస్తే మందడం గ్రామానికి చుట్టూ సరిహద్దు గోడలాగా ఈ రోడ్లు కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు చర్చ జరిగిన రోడ్డు ఈ8. ఇది సి బి డి అంటే సీడ్ బిజినెస్ డిస్టిక్ కు అనుసంధానంగా నిర్మిస్తున్న మేజర్ ఆర్టీరియల్ రోడ్డు. అంటే 200 అడుగులు వెడల్పుతో ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మించాల్సిందే. కానీ ఇంత పెద్ద రోడ్డు గ్రామం మధ్యలో నుండి ఇప్పటికిప్పుడు నిర్మించడం అవసరమా అనేది ఒక ప్రశ్న.
సుమారు పాతిక లక్షలు జనాభాకు తగిన విధంగా రోడ్లను ప్లాన్ చేశారు ప్రస్తుతం రాజధానిలో చూసుకుంటే మొత్తం రెండు లక్షలు జనాభా కూడా లేదు. మరి అలాంటప్పుడు హడావుడిగా గ్రామం మధ్యలో నుండి రోడ్డు విస్తరించాల్సిన అవసరం ఏముంది. మిగిలిన ప్రాంతం మొత్తం రోడ్లు వేస్తున్నారు కదా. ముందు వాటిని పూర్తి చేయొచ్చు తర్వాత గ్రామాల మధ్యలో రోడ్లను వేయవచ్చు. వాటిని వేయవద్దు అనేది ఇక్కడ సమస్య కాదు. గ్రామాలకు ఇబ్బంది లేని రోడ్లన్నిటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుగా నిర్మించేసి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి చేసుకోవచ్చు .
అయితే భారీగా ఇళ్లను తొలగించి నిర్మించాల్సిన అవసరం ఇప్పటికిప్పుడుగా ఏముంది అనేది ఒక ప్రశ్న. మందడం గ్రామాన్ని తీసుకుంటే అంతర్గత రోడ్లతో పాటు నాలుగు వైపులా భారీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ కూడా 200 అడుగుల విస్తీర్ణంతో ఉండేవి. మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసింది కనుక ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లన్నిటినీ పూర్తి చేసి భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా గ్రామాల మధ్యలో నుండి రోడ్లను నిర్మించుకోవచ్చు. అలా చేస్తే గ్రామస్తుల నుండి కొంత సానుకూలత వస్తుంది. ప్రభుత్వాలు పనిలో పనిగా ఈ రోడ్డు నిర్మించేయాలి అనే ఆలోచనతో ఉండవచ్చు. తప్పులేదు.
కానీ ఇప్పటికే భూములు ఇచ్చేసిన రైతులు ఇల్లు కూడా ఇచ్చేయాలా అనే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించి అవకాశం ఉన్న రోడ్లు ఇతర అభివృద్ధి పనులు అన్నిటిని పూర్తి చేసి గ్రామం మధ్యలో వేయాల్సిన రోడ్లను భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా తరువాత నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం సానుకూలంగా స్పందించి గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గ్రామాల మధ్యలో నుండి వెళ్లే రోడ్లను ఇప్పటికిప్పుడుగా కాకపోయినా మిగిలిన రోడ్లన్నీ పూర్తయిన తరువాత విస్తరిస్తే ఉపయోగంగా ఉంటుంది. రైతుల్లో ఉన్న ఒత్తిడిని ఆందోళనను తగ్గించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది.
ప్రభుత్వం ఈ విషయంలో కొంత సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208