– భూమిని కాపాడిన సీఐని బదిలీ చేస్తారా?
– భూభారతి పేరుతో కాంగ్రెస్ మార్క్ అవినీతి
– రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించిన రేవంత్ రెడ్డి సర్కార్
– సాదా బైనామాకు భూమి అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అనే కొత్త మెలిక పెట్టి లక్షల మంది రైతుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టింది
– అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
– సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం.. భూభారతి తెచ్చి ఉద్ధరిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు.
సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయం వద్ద తమ పనుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు.
భూభారతి తీసుకొచ్చాక ఏప్రిల్ నెలలో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడితే రాష్ట్రవ్యాప్తంగా 8,68,000 అప్లికేషన్లు వచ్చాయి. పది నెలలు గడుస్తున్నా ఆ దరఖాస్తులు ఏమయ్యాయో, అసలు ఆన్లైన్ చేశారో లేదో ప్రభుత్వానికే తెలియదు.ఎన్ని పరిష్కారం అయ్యాయన్న దానిపై ప్రజలకు జవాబుదారీతనం లేదు. ఆ అప్లికేషన్లను చెత్తబుట్టలో వేశారా.. లేక పాత కాగితాల కింద అమ్ముకున్నారా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, మ్యుటేషన్‌తో సహా కేవలం వారం రోజుల్లో పాస్ బుక్ నేరుగా రైతు ఇంటికి వచ్చేది. ఏ ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండేది కాదు. కానీ ఇప్పుడు భూభారతి వచ్చాక రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ బుక్ ఫీజు కింద 300 రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ.. ఆరు నెలలు అవుతున్నా పాస్ బుక్కులు మాత్రం ఇవ్వడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వంలో 6,20,000 మంది రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సాదా బైనామాలు చేసి పాస్ బుక్ లు ఇచ్చాం. రెండో విడత కింద 9,26,000 అప్లికేషన్లు వస్తే, ఆనాడు కోర్టు స్టే వల్ల ఆగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక స్టే వెకేట్ అయినా.. కావాలనే సాదా బైనామాను అమలు చేయడం లేదు. భూమి అమ్మిన వ్యక్తి స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే కొత్త నిబంధన తెచ్చి సాదా బైనామాకు ఉరితాడు బిగించారు.భూమి అమ్మిన వాళ్లు ఇప్పుడు మళ్లీ అఫిడవిట్ ఎందుకు ఇస్తారు? ఈ నిబంధన వల్ల ఒక్కరికి కూడా సాదా బైనామా అమలు కావడం లేదు.
ఉదాహరణకు సిద్దిపేట రూరల్ లో 2400, అర్బన్ లో 1200 అప్లికేషన్లు వస్తే ఏ ఒక్కరికీ ఈరోజు వరకు పాస్ బుక్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం అన్నట్లు వ్యవహరిస్తోంది. గతంలో 10 శాతం ఉన్న నిషేధిత భూముల సంఖ్య.. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి కోటి ఎకరాలు దాటింది. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, ఈ జాబితాను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? మీ అక్రమాలకు, ఇష్టారాజ్య వ్యవహారాలకు అడ్డు వస్తుందనా?
ప్రజలకు తెలియకుండానే వారి భూములను నిషేధిత జాబితాలో పెడుతుండటంతో పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం లాంటి అత్యవసరాలకు కూడా భూములు అమ్ముకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తాం అని బీఆర్ఎస్ మీద దాడి చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజల దగ్గర డబ్బులు లేకపోయినా కనికరం లేకుండా గోసపెడుతున్నారు. మరోవైపు 58, 59 జీవోలను పెండింగ్‌లో పెట్టి పేదలను ఇబ్బంది పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు చెల్లించి, స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా రెండున్నరేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. దీనిపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రిని నిలదీస్తే వెంటనే చెల్లిస్తామని చెప్పారు.. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
నాడు కేసీఆర్ 20 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి స్కేల్ ఇస్తే, అందులో 61 ఏళ్లు దాటిన 4 వేల మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చాం. రెండున్నరేళ్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకుండా, వారికి ఇంకా ఆ పాత 10 వేల రూపాయల వేతనాన్నే ఇస్తోంది. చనిపోయిన 600 మంది వీఆర్ఓల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. తక్షణమే ఆ 4 వేల మంది కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రెవెన్యూ శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతోంది. రోజూ ఏదో ఒకచోట ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. కింది స్థాయి అధికారుల నుంచి మంత్రిగారి కార్యాలయం వరకు ఈ శాఖ అవినీతిలో మునిగితేలుతోంది. మంత్రి కుమారుడే భూ కబ్జాలకు పాల్పడుతుంటే, అతనిపై కేసులు పెట్టాల్సింది పోయి.. ఆ భూమిని కాపాడిన సీఐని బదిలీ చేశారు. మరోపక్క కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ప్రజలను నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు.
ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేసింది ప్రజల్ని గోసపెట్టడం తప్ప పరిష్కరించిందేమీ లేదు. ధరణి పోర్టల్ తీసేసి భూభారతి తెచ్చామంటున్నారు. సిస్టమ్ మీద పేజీ పేరు మారింది. అప్పుడు వారం రోజుల్లో వచ్చే పాస్ బుక్.. ఇప్పుడు ఆరు నెలలైనా రావడం లేదు. అవినీతి మాత్రం పెరిగిపోయింది.
తక్షణమే ముఖ్యమంత్రి, మంత్రి, రెవెన్యూ శాఖపై రివ్యూ చేసి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన ఈ అంశాలన్నింటినీ లేవనెత్తుతాం.