ప్రస్తుతం మనం 2025లో వచ్చిన విశ్వావశునామ సంవత్సరంలో ఉన్నాం. 2026లో నూతన తెలుగు సంవత్సరాది (ఉగాది), శ్రీ పరాభవ నామ సంవత్సరం, మార్చి 19న, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమవుతుంది.
2026లో వచ్చే ఉగాది పండుగ అనేది కేవలం తెలుగు క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, అది మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకోవడానికి ఒక చక్కని మానసిక ప్రేరణ. మన ఆలోచనా విధానంలో మార్పు రావడానికి ఒక గొప్ప అవకాశం. నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తెలుగు వారు కొత్త ఆశలు, కోర్కెలతో స్వాగతం పలుకుతారు.
ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసి, మామిడి ఆకులతో తోరణం కట్టి పంచాంగ శ్రవణంతో పాటు ఉగాది పచ్చడి తిని చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఆనందంగా గడుపుతారు. ఉగాది పచ్చడి అనేది తెలుగు నూతన సంవత్సర వేడుక (ఉగాది) సందర్భంగా తయారుచేసే ఒక ప్రత్యేకమైన, షడ్రుచుల మిశ్రమం.
ఉగాది పచ్చడి – జీవిత పాఠం
ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు (షడ్రుచులు) మన జీవితంలోని ఆరు భావోద్వేగాలకు ప్రతీకలు:
* బెల్లం (తీపి): ఆనందం
* వేప పువ్వు (చేదు): కష్టాలు/దుఃఖం
* చింతపండు (పులుపు): నేర్పు/సవాలు
* మామిడి ముక్కలు (వగరు): కొత్త అనుభవాలు
* మిరప (కారం): కోపం
* ఉప్పు: భయం/జాగ్రత్త
వీటన్నింటినీ సమానంగా స్వీకరించడమే నిజమైన స్థితప్రజ్ఞత
ప్రస్తుతం విశ్వావశునామ సంవత్సరం అయినప్పటికీ, అందులో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, శ్రీ పరాభవ నామ సంవత్సరంకు సిద్ధమవ్వడం అనేది పరిణతికి నిదర్శనం. ఈ సందర్భంగా మీరు సంకల్పం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని ఆచరణలో పెట్టడం అంతకంటే ముఖ్యం.
విజయానికి 5 సూత్రాలు
(పరివర్తన దిశగా..)
ఈ కొత్త సంవత్సరంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఈ క్రిందివి పాటించాలి:
1. సానుకూల దృక్పథం: “నేను చేయలేను” అనే నెగటివ్ ఆలోచన వదిలి, “నేను ఎలా చేయగలను?” అనే పరిష్కార మార్గం వైపు వెళ్లాలి.
2. సమయ పాలన: సోషల్ మీడియా వంటి అనవసర కాలక్షేపాలను తగ్గించి, వ్యక్తిగత ఎదుగుదలకు సమయం కేటాయించాలి.
3. నిరంతర అభ్యాసం: రోజుకు కనీసం 20 నిమిషాలు పుస్తక పఠనం లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం.
4. ఆరోగ్యమే మహాభాగ్యం: వ్యాయామంతో పాటు మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి.
5. కృతజ్ఞత: మనకు ఉన్నదానితో తృప్తి చెందుతూ, తోటివారికి సహాయపడటం.
పంచాంగ శ్రవణంలో చెప్పే రాశిఫలాలు వింటే వినండి కానీ వాటిపై సంపూర్ణంగా ఆధారపడకుండా ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతే ప్రతి ఒక్కరూ విజయం సాధించొచ్చు. పంచాంగ శ్రవణం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం, అది మనకు ఒక మానసిక ధైర్యాన్ని లేదా రాబోయే కాలం పట్ల ఒక అవగాహనను కలిగించవచ్చు. కానీ, కేవలం గ్రహగతులు బాగున్నాయని కూర్చున్నా లేదా బాలేదని నిరాశ పడినా ప్రయోజనం ఉండదు.
చాలా మంది ఉగాది రోజు కొత్త పనులతో పాటు పరివర్తన కోసం మంచి అలవాట్లు కూడా ప్రారంభిస్తారు. పరివర్తన అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం.
లక్ష్య సాధనలో కొన్ని చిట్కాలు
* చిన్నపాటి మార్పులు: ఒకేసారి పెద్ద మార్పులు కాకుండా, చిన్న చిన్న అలవాట్లతో ప్రారంభించాలి. ఉదాహరణకు, రోజూ గంట సేపు వ్యాయామం చేయాలనుకునే బదులు, మొదట 30నిమిషాలతో మొదలుపెట్టాలి.
* స్పష్టత : “నేను బరువు తగ్గాలి” అని అనుకునే కంటే, “ఈ నెలలో 2 కిలోలు తగ్గాలి” అని స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి.
* నిలకడ: ఫలితం వెంటనే రాకపోయినా నిరాశ చెందకుండా ప్రయత్నాన్ని పట్టుదలతో కొనసాగించాలి.
* పురోగతిని గమనించడం: మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను ఒక డైరీలో రాసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నేటి తరం వ్యక్తుల ఆలోచనలకు స్థిరత్వం కాస్త తక్కువ కాబట్టి పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండరు. ఏది ఏమైనా కాలం మారినంత మాత్రాన పెట్టుకున్న లక్ష్యాలకు తగినట్టు శ్రమించకపోతే సరైన ఫలితాలు రావు. కనుక ఈ సంవత్సరం అయినా మీరు అనుకున్నది సాధించేలా ప్రయత్నించండి.
“మంచి పని ప్రారంభించడానికి మంచి ముహూర్తం అక్కర్లేదు” అన్న మాట నిజంగా అక్షర సత్యం. క్రమశిక్షణ, నిరంతర శ్రమ తోడైతే శ్రీ పరాభవ నామ సంవత్సరం ఖచ్చితంగా అందరి జీవితాల్లో ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలుస్తుంది. అందరం కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని స్వాగతిద్దాం. ఈ నూతన తెలుగు సంవత్సరాది మీ జీవితంలో కొత్త ఆశలను, గొప్ప విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. ముందుగా ఉగాది శుభాకాంక్షలు!
– డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం
లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నం.