– మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ
హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం అనేది వేలాది మంది అమరవీరుల బలిదానాల పునాదుల మీద, దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడింది. అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి, అహంకారానికి పరాకాష్ట. ఇది కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడి.
నాడు పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రం ఇచ్చారని ప్రధాని మోదీ గారు అంటే, నేడు ఒక ఎంపీ ఏకంగా దేశ విభజనతో పోలుస్తున్నారు. బీజేపీ నరనరాల్లో తెలంగాణ పట్ల ద్వేషం నిండి ఉందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి విషం చిమ్ముతున్నారు.
సభలో తోటి ఎంపీ తెలంగాణను అవమానిస్తుంటే, అక్కడ ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం అత్యంత సిగ్గుచేటు. తమ పదవుల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతారా? అలాగే కాంగ్రెస్ ఎంపీలు కూడా మౌనంగా ఉండి పరోక్షంగా తెలంగాణ అవమానాన్ని భరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు.
తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేవలం సూర్య మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బీజేపీ అధిష్టానం కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో, ఈ వ్యాఖ్యలనే బీజేపీ అధికారిక వైఖరిగా భావించి, క్షేత్రస్థాయిలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం.