– డంపింగ్ యార్డ్‌పై నేను రాజీ పడకపోతే సీబీసీఐడీ కేసులతో జైలుకు పంపిస్తామనే బెదిరింపులు – ప్రజల కోసం నా పోరాటం ఆగదు
– డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: హుజురాబాద్‌లో నాలుగు జిల్లాల చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్య అని మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుతోంది
డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి తీవ్రంగా కాలుష్యానికి గురై ప్రజల జీవితం దెబ్బతింటుందని తెలిపారు. వ్యవసాయం నాశనం అవుతుందని, తాగునీరు కలుషితం అవుతుందని, రోగాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రజల అభిప్రాయం లేకుండా తీసుకున్న నిర్ణయం వెంటనే రద్దు చేయాలి
ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ఈ ప్రాజెక్ట్‌ను అక్కడ ఏర్పాటు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
కేసులు పెట్టినా నా పోరాటం ఆగదు
డంపింగ్ యార్డ్ అంశంపై నేను ఎలాంటి రాజీకి రానని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో, నాపై తప్పుడు కేసులు నమోదు చేసి, సీబీసీఐడీ కేసులతో జైలుకు పంపిస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న నన్ను భయపెట్టే ప్రయత్నాలు ఎంత జరిగినా, నేను వెనక్కి తగ్గేదేలేదు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. “నా ప్రాణం పోయే వరకు అయినా సరే, డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది” అని కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
బండి సంజయ్, ఈటల రాజేందర్ మౌనంపై ప్రశ్నలు
ఈ అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అలాగే ఇరవై ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఈటల రాజేందర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.
లక్షల మందితో బహిరంగ సభ పెడితే ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే
ప్రజలందరూ ఒకే వేదికపైకి వచ్చి “డంపింగ్ యార్డ్ వద్దు” అని చెప్పాలని పిలుపునిచ్చారు.
నకిలీ ప్రేమ, రాజకీయ నాటకాలు బయటపడతాయి
ఇలాంటి కీలక అంశంపై స్పందించకుండా ఉండటం ప్రజలపై నకిలీ ప్రేమ చూపడమేనని విమర్శించారు. ప్రజలు ఈ విషయాలను గమనించి తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా పక్కకు తప్పుకోకుండా ప్రజల ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
22న పాదయాత్ర – ప్రజా ఉద్యమానికి శ్రీకారం
డంపింగ్ యార్డ్ రద్దే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రను ప్రజా ఉద్యమంగా మార్చి మరింత ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పారు.డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
SC కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, గందె శ్రీనివాస్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిల్ రమేష్, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, తిరుపతి రావు, చుక్కా రంజిత్, మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ రవీందర్ రావు, బచ్చు శివశంకర్, మాజీ ఎంపీపీ దొడ్డె మమత తదితరులు పాల్గొన్నారు.