ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చెప్పిన లెక్కల ప్రకారం.. సగం నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు.. ఏకంగా 263 కు చేరనున్నాయి. కొన్ని కీలక ప్రాంతాలపై తనదైన ముద్ర వేయడానికి సీఎం చంద్రబాబు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అమరావతి రాజధాని విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చంద్రబాబు పార్లమెంటులో అమరావతి బిల్లు పాసైన అనంతరం.. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో కొందరు.. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావించారు. అమరావతి రాజధానిని అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చాలని కొందరు ప్రతిపాదించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మంచి ఆలోచన అని కితాబు కూడా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఉంటున్న నేపథ్యంలో రాజధాని అమరావతిని అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చే ప్రతిపాదనపై ఆయన కసరత్తు చేస్తున్నారు. తద్వారా రాజధాని పేరు.. జాతీయస్థాయి ఎన్నికల సంఘం రికార్డుల్లోనూ కనిపిస్తుందని.. అప్పుడు ఇక, రాజధానులను మార్చే దుస్థితి తప్పుతుందని ఆయన అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ప్రతిపాదన చేయాలనే విషయంపై స్థానిక ఎమ్మెల్యేలతో ఆయన చర్చించనున్నారని తెలిసింది.
ప్రస్తుతం దేశంలో గుజరాత్ రాజధాని గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ఆ నియోజకవర్గం సీటు కోసం భారీగానే పోటీ ఉండనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతి ప్రాంతం ప్రధానంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. రాజధాని అమరావతికి సంబంధించిన కోర్ క్యాపిటల్ ఏరియా ప్రాంతాలైన సచివాలయం, అసెంబ్లీ వంటి ప్రధాన భవనాలు ఉన్న వెలగపూడి, తుళ్ళూరు మొదలైన ప్రాంతాలు తాడికొండ నియోజకవర్గం కిందకు వస్తాయి.చారిత్రక అమరావతి గ్రామం మరియు అమరావతి మండలం పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఒక ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చడం వల్ల స్థానిక అభివృద్ధికి, పరిపాలనకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, దీనికి కొన్ని ఆచరణాత్మక మరియు చట్టపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు, కొత్తగా స్థిరపడే ఉద్యోగులు, వ్యాపారుల సమస్యలు భిన్నంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ఎమ్మెల్యే ఉంటే, వారి గొంతుక చట్టసభల్లో బలంగా వినిపిస్తుంది. సమస్యల పరిష్కారానికి ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ఉంటారు.రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఎమ్మెల్యే నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు నేరుగా కేటాయించడానికి వీలుంటుంది.
దీనివల్ల ఆ ప్రాంతంపై మరింత ఏకాగ్రత పెరిగి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది.ఒక మెగా సిటీగా అభివృద్ధి చెందే ప్రాంతానికి ఒకే నాయకత్వం కింద ప్రణాళికాబద్ధమైన పాలన అందించడం సులభం అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం మంగళగిరి, తాడికొండ వంటి వేర్వేరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉండటం వల్ల అభివృద్ధి పనుల్లో సమన్వయ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర రాజధాని ప్రాంతం ప్రత్యేక నియోజకవర్గంగా ఉంటే, అధికార మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాయి. ఇది అంతిమంగా ఆ ప్రాంత పురోగతికి దోహదపడుతుంది.
అసెంబ్లీ సీట్లను పెంచాలన్నా లేదా భౌగోళిక సరిహద్దులు మార్చాలన్నా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇది భారత ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకోలేదు. ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటు కావాలంటే నిర్ణీత ఓటర్లు లేదా జనాభా ఉండాలి. ఒకవేళ రాజధానిని ప్రత్యేక సీటుగా ఏర్పాటు చేస్తే, ఆ ప్రాంత జనాభా ప్రాతిపదికన మాత్రమే అది సాధ్యమవుతుంది.
అమరావతిని అంటే CRDA పరిధిలోని కోర్ క్యాపిటల్ గ్రామాలను ప్రత్యేక సీటుగా చేస్తే, దాని చుట్టుపక్కల ఉన్న మంగళగిరి, తాడికొండ తదితర నియోజకవర్గాల భౌగోళిక స్వరూపం, కుల సమీకరణాలు, ఓటు బ్యాంకు పూర్తిగా మారిపోతాయి. దీనివల్ల స్థానిక రాజకీయ ముఖచిత్రంలో మార్పులు వస్తాయి. పరిపాలనా సౌలభ్యం, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల దృష్ట్యా అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఒక ప్రత్యేక అసెంబ్లీ సీటుగా మార్చడం ఖచ్చితంగా ప్రయోజనకరమైన ఆలోచనే అని చెప్పాలి.
ఇది అమరావతి రాజధాని ప్రాంతం సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆచరణలోకి వస్తే ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు సంతోషానికి అవధులు ఉండవనే చెప్పాలి.
-జి.సత్యనారాయణ రాజు
సీనియర్ జర్నలిస్ట్