– తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి
– వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు
– కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్
– మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి
– ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా?
– ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలి
– పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్: ఎన్నికల వేళ చెప్పిందొకటి. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి..వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?
మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా? మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.
కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది. మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలి. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయి. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చింది.
జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారు? కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500 కే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా? ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలి.
ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది.