(ఇంద్రాణి )
గల్లా మాధవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి విడదల రజనీపై 55,000 పైగా మెజారిటీతో గెలుపొందిన తెలుగుదేశంపార్టీ శాసనసభ్యురాలు. ఆమెకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగు పెట్టిన ఎమ్మెల్యే. అనర్గళంగా మాట్లాడటం, అలుపెరగకుండా నియోజకవర్గం అంతటా పర్యటించటం ఆమె ప్రత్యేకత.
ఈ మధ్య అంబటి రాంబాబును ఘెరావ్ చేయడంలో మహిళలతో కలిసి ఆమె వ్యవహరించిన తీరు అరాచకానికి మారుపేరైన వైసీపీ వాళ్ళని కూడా విస్తుపోయేలా చేసింది. ఆమెను గురించి ఇటువంటి సెన్సేషన్స్ అనేకం ఆమె ఖాతాలో ఉండగా, కొత్తగా ఆమె ట్రాన్స్‌జెండర్స్ పట్ల కనబరిచిన ఒక సామాజిక బాధ్యత రాజకీయవర్గాలలోనే కాకుండా అన్ని వర్గాలలోనూ పెద్ద చర్చనీయాంశం అయింది.కారణం, గల్లా మాధవి ఒక ట్రాన్స్‌జెండర్‌ను తన పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు.
ఒక సామాజిక బాధ్యతను సాహసోపేతంగా తలకెత్తుకున్నారు. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఉంటూనే సమాజానికి దూరంగా బ్రతికే పరిస్థితుల్లోనే ఉన్నారు. ట్రాన్స్జెండర్లను చూడగానే మనం తెలియకుండానే భయపడతాం. సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్‌జెండర్స్ వాహనం దగ్గరకు వస్తుంటేనే పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేయటం జరుగుతుంటుంది. వారికి డబ్బులిచ్చేవారు కూడా ‘త్వరగా వెళ్ళిపోతే బాగుండు’ అన్నట్లుగా చూస్తుంటారు.
ఇప్పుడిప్పుడే వారి ఆశీర్వచనం మంచిది అనే ప్రచారం జరిగిన తరువాత పెళ్లిళ్లు, పేరంటాలు జరిగినప్పుడు వారికి సంతోషంగా ముట్టచెబుతున్నారు కానీ, వారిని దూరంగానే పెడుతున్నారు.ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. గతంలో కంటే వారి పట్ల ప్రజల ఆలోచనలు మెరుగుపడ్డాయి కానీ, సభ్యసమాజంలో వారికి ఇప్పటికీ స్థానం లేదు. అందులో ప్రజల పాత్ర ఎంత ఉన్నదో, ట్రాన్స్‌జెండర్స్ పాత్ర కూడా అంతే ఉన్నది.
ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ చాలామంది డిగ్రీలు చదువుకుంటున్నారు. కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారూ ఉన్నారు. వృత్తి విద్యల్లోకి ప్రవేశించిన వారు ఉన్నారు. న్యాయవాద వృత్తిలోనే కాక, న్యాయమూర్తులు కూడా అయినవారున్నారు. కానీ చదువుకున్న ట్రాన్స్‌జెండర్లలో చాలామంది ఉద్యోగం చేయటానికి విముఖత చూపిస్తున్నారు. కారణం దశాబ్దాల తరబడి భిక్షాటనతోనే బ్రతకటానికి అలవాటుపడి ఉన్న ట్రాన్స్‌జెండర్స్ ఇప్పటికీ దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మొన్న గల్లా మాధవి ఒక ట్రాన్స్‌జెండర్‌ను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవాలనుకుంటే, వారిలో కొందరు విముఖత వ్యక్తం చేశారు. కారణం అడిగితే ఉద్యోగంలో వచ్చే ఆదాయం కంటే భిక్షాటనలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటమని వారే వెల్లడించారు. కానీ కాజల్ అనే అమ్మాయి వారి కమ్యూనిటీ నుండి వచ్చిన వ్యతిరేకతను కూడా తట్టుకుని, ఎమ్మెల్యే దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేరారు.
ఆ అమ్మాయి ‘రాజనీతి కల్లూరి సురేష్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఉద్యోగంలో చేరిన తరువాత తనకు లభిస్తున్న మర్యాద తన జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు” అని చెబుతూ, తన కమ్యూనిటీ ఇది గుర్తించేలా ప్రభుత్వాలు సహాయం చేయాలని తనదైన భాషలో విజ్ఞప్తి చేశారు.అదే ఇంటర్వ్యూలో మాధవి మాట్లాడుతూ.. “మనుష్యుల ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించిన వీధికుక్కల కోసం పోరాటం చేస్తున్న వారు ఉన్నారు కానీ, ట్రాన్స్‌జెండర్స్ కోసం పోరాడే వారు ఒక్కరూ లేరు” అన్నారు.
అది వాస్తవం. ప్రభుత్వాలు కొన్ని పథకాలు ప్రకటిస్తున్నాయి. 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారికి నెలవారీ పింఛను, గృహవసతి కల్పించే ప్రయత్నం చేసింది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత వారికి ప్రతిపాదించిన సంక్షేమ పథకాలు పక్కదారి పట్టాయి. మరలా 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ₹4,000 పెన్షన్‌తో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ట్రాన్స్‌జెండర్స్ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య.. వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వటానికి ఎవరూ సుముఖత చూపరు.
ఈ విషయం దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం ట్రాన్స్‌జెండర్స్ గౌరవంగా నివసించటానికి ‘గరిమా గృహ’ పథకాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలలోనూ వారికోసం గృహాలను నిర్మించింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో ఒక గరిమా గృహం ఏర్పాటు జరిగింది. ఇంతకంటే ప్రధాన సమస్య.. ట్రాన్స్‌జెండర్స్ పేరుతో సాధారణ వ్యక్తులు కూడా వారి వేషభాషలతో వారి వృత్తిని దెబ్బకొట్టటమే కాక, వారిపైన దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు. దేశంలో ఒకనాడు బెగ్గింగ్ మాఫియా భయంకరంగా అల్లుకుని ఉండేది.
సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వలన, అక్షరాస్యత కూడా మెరుగుపడిన కారణాన భిక్షగాళ్ల మాఫియా ప్రభావం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ పేరుతో బెగ్గింగ్ మాఫియా నడుస్తున్నది. ప్రాంతాల వారీగా విభజించుకుని కొంతమంది ఆధ్వర్యంలో ఈ మాఫియా నడుస్తున్నది. అందులో నిఖార్సయిన ట్రాన్స్‌జెండర్స్‌తో పాటు బయటి వారు కూడా ఉంటూ మాఫియాను నడుపుతున్నారు.
ఈమధ్య తాడిపత్రిలో జరిగిన ట్రాన్స్‌జెండర్స్ ఆధిపత్య పోరులో ఒక ట్రాన్స్‌జెండర్‌ను పాశవికంగా హత్య గావించారు. అందులో ట్రాన్స్‌జెండర్స్ కాక బయటివారే ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌జెండర్స్‌కు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ‘లింగమార్పిడి వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం’ చేసింది. తొలుత 2019లో చేసిన చట్టం ప్రకారం ఎవరైనా తమకు తాము ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకుంటే జిల్లా మెజిస్ట్రేట్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. దానికి కొద్దిగా సవరణలు చేస్తూ ప్రభుత్వం 2026లో మరలా ‘ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ను రూపొందించింది.
సవరించిన చట్టం ప్రకారం.. ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ రావాలంటే ముందు మెడికల్ బోర్డుకు రిఫర్ చేసి, వారు ధృవీకరిస్తేనే జిల్లా మెజిస్ట్రేట్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సవరణ పైన మిశ్రమస్పందన వస్తున్నది. వారు స్వయంగా ప్రకటించుకునే హక్కును హరించివేశారని హక్కుల సంఘాల వారు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కానీ కొన్ని సంక్షేమపథకాలు అమలు సక్రమంగా జరగాలంటే నిబంధనలు తప్పనిసరిగా ఉండవలసిందే. కాకపోతే మెడికల్ బోర్డుకు రిఫర్ చేసే ప్రక్రియ దగ్గర మొదలయ్యే పైరవీ తో, ధృవీకరణ పత్రం చేతికి వచ్చేవరకు వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతకంటే సులువుగా వారికి సర్టిఫికెట్ రావటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ప్రొటెక్షన్ యాక్టులో ట్రాన్స్‌జెండర్స్‌పై జరిగే హింసను అరికట్టేందుకు చేసిన సవరణలు మాత్రం ఆహ్వానించతగినవే. వారిపైన హింస ఎంతగా పెరిగిపోతున్నదంటే.. వారు అది సహజం అని అలవాటు పడేంతగా! ట్రాన్స్‌జెండర్స్ కూడా చదువుకోవటానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో, చదువుతో వచ్చే గౌరవనీయమైన జీవితానికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తే సమాజంలో వారికో స్థానం లభిస్తుంది అనేది గుర్తిస్తే బాగుంటుంది.
ట్రాన్స్‌జెండర్స్ సమస్యను గల్లా మాధవి వివరించగానే, ఒక విధానం రూపొందిద్దాం అని స్పందించినట్లుగానే ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ట్రాన్స్‌జెండర్స్‌కు మేలు చేసిన వారవుతారు నారా లోకేష్. ఒక సామాజిక సమస్యను గుర్తించగానే ఆ సమస్యకు పరిష్కారం దిశగా ఒక అడుగు ముందుకు వేసిన శాసనసభ్యురాలు గల్లా మాధవి అభినందనీయురాలు.
అదే సమయంలో తన సామాజిక మాధ్యమం వేదికగా గల్లా మాధవి నిర్ణయాన్ని స్వాగతించి నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ లు తమవంతు ధర్మాన్ని పాటించి మాధవి బాటలో నడవాలనుకునే వారికి మద్దతు తెలపటం అభినందనీయం.!