– సేంద్రీయ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం ప్రత్యేక మొబైల్ యాప్
– మే 4 న“TG ఆర్గానిక్స్” యాప్ ను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
– సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్, వినియోగదారులకు నమ్మకం
– TG ఆర్గానిక్స్ యాప్ పై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల
సేంద్రియ వ్యవసాయం : మంచి యాజమాన్య పద్దతులు పాటిస్తూ, ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు, జన్యుమార్పిడి పంటలను వాడకుండా, సహజ వనరుల నుండి పోషకాలను, సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయు విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు.
సేంద్రియ వ్యవసాయ నేపథ్యం: నేటి ఆధునిక వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాదించాలి అనే లక్ష్యంగా, విచ్చల విడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వలన, రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆశించిన దిగుబడులు సాదించలేకపోవటమే కాకుండా, వాటి అవశేషాలు మనం తినే ఆహారంలోను, చుట్టూ ఉన్న వనరులలో పేరుకుపోయి వాతావరణానికి కూడా తీరని నష్టాల్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నాయి.
సేంద్రియ వ్యవసాయంపై వైపు మొగ్గుచూపుతున్న రైతులు: నానాటికీ ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగా ఎలాంటి రసాయనాల అవశేషాలు లేని సేంద్రియ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, బయటి మార్కెట్ లో ఎక్కువ ధరలకు సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఆసక్తితో సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నపట్టికి వారు పండించిన సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ లో సరైన నాణ్యతా గుర్తింపు విధానం లేకపోవటం వలన, వినియోగదారుడికి రైతు పండించిన సేంద్రీయ ఉత్పత్తులపైన సరైన నమ్మకం లేకుండా పోయింది.
మార్కెట్ లోకి ఇబ్బడిముబ్బడిగా నకిలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్: ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని, దళారులు మార్కెట్ లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో వినియోగదారులను మోసం చేస్తూ విపరీతంగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. ఈ విధంగా గతంలో వినియోగదారుడు ఎలాంటి అనుమానాలు లేకుండా తాను కొనే సేంద్రియ ఉత్పత్తులు నాణ్యమైనవియా..కావా.? అని నిర్దారించుకోకుండా కొనుగోలు చేసేవారు. కానీ కాలక్రమేణా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తుల పట్ల వస్తున్న అవగాహన వల్ల సేంద్రీయ ఉత్పత్తుల నిర్దారణ విషయంలో వాటిని అమ్మేవారిని ప్రశ్నిచడం జరుగుతుంది.
తెలంగాణలో సేంద్రియ సాగుకు మంచి అవకాశాలు: తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఆర్గానిక్ ఆహారానికి ఎక్కువ డిమాండ్ పెరగడం, తద్వారా సేంద్రియ ఉత్పత్తులకు సాధారణ పంటలకంటే ఎక్కువ ధర లభించడం వలన ఎంతో మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అధేవిధంగా, సేంద్రియ వ్యవసాయంపై మంచి అనుభవం, శిక్షణ పొందిన రైతులు కూడా తెలంగాణలో ఉన్నారు. ముఖ్యంగా, ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలలో సేంద్రియ సాగు జరుతుంది, దీనితోపాటు, మంచి మార్కెట్ సదుపాయాలు ఉండటంతో హైదరాబాద్ చూట్టు పక్కల సేంద్రీయ పంటల సాగు పెద్దమొత్తంలో జరుగుతుంది. అధెవిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం క్రింద 60 వేల ఎకరాలలో సేంద్రియ సాగును కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
అందుబాటులోకి సేంద్రీయ దృవీకరణ చేయుటకు మార్గదర్శకాలు: మార్కెట్ లో సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోలు మరియు వాటి నాణ్యతా విషయంలో సరైన ప్రమాణాలు & పద్దతి ప్రకారం ప్రజలకు నమ్మకం కలిగేలా సేంద్రీయ ఉత్పత్తులను దృవీకరించి వినియోదారులకు అందుబాటులో ఉంచాలని, భారత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ (APEDA) ఆధ్వర్యంలో నిర్దేశించిన NPOP ప్రమాణాల ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ సంస్థలకు సేంద్రీయ దృవీకరణ చేయుటకు గుర్తింపు అనుమతులు ఇవ్వటం జరిగింది.
తెలంగాణలో ప్రభుత్వ సేంద్రీయ దృవీకరణ సేవలు ప్రారంభం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో సేంద్రీయ రైతులకు తోడ్పాటును అందించి, సేంద్రీయ వ్యవసాయంను లాభసాటిగా చేసి, సేంద్రీయ ఉత్పత్తుల దృవీకరణ చేయుటకై 2016 లో తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ దృవీకరణ అథారిటీ, సేంద్రీయ దృవీకరణ సేవలు ప్రారంభించింది.
సేంద్రీయ దృవీకరణ అంటే?
సేంద్రీయ ఉత్పత్తిదారులు పండించిన పంటలను ఒక నిర్దిష్ట పద్దతిలో ఆగికల్చర్ ప్రాడ్యూస్ ఎక్స్పొర్ట్ డెవలప్ మెంట్ అథారిటి (APEDA) చే నిర్దేశింపబడిన, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (NPOP) మరియు పార్టీసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (PGS) ప్రమాణాలను అనుసరించి అధికారులు రైతు పంట క్షేత్రాలను తనిఖీ చేసీ, అవసరాన్ని బట్టి నాణ్యతా పరీక్ష కొరకు ల్యాబ్ కు సేంద్రీయ ఉత్పత్తుల శాంపిల్స్ ను పంపి సేంద్రీయ దృవీకరణ చేయటం జరుగుతుంది. సేంద్రీయ ఉత్పత్తుల విక్రయంలో వినియోగదారులకు మరియు ఉత్పత్తిదారులకు మధ్య నమ్మకమైన కొనుగోలు మరియు విక్రయములను పెంపొందించుటకు సేంద్రీయ దృవీకరణ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది.
సేంద్రీయ దృవీకరణ పురోగతి: రాష్ట్రంలో జనవరి 2026 నాటికి, సుమారు 10 వేల మంది సేంద్రీయ రైతులు, 50 వేల ఎకరాలలో, 206 ఆపరేటర్లు, 24 ఆర్గానిక్ ఫార్మార్స్ గ్రూపుల (ICS) క్రింద సేంద్రీయ ధృవీకరణ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల ప్రకారం 61,125 ఎకరాలలో, 489 క్లస్టర్లలో ప్రకృతి వ్యవసాయ దృవీకరణ కూడా చేయుటకు రైతు పంట క్షేత్రాల నమోదును కూడా 2026 లో ప్రారంభించడం జరిగింది.
దృవీకరణ ఆర్గానిక్ ఉత్పత్తులు: తృణ ధాన్య పంటలు (వరి, జొన్న, మొక్కజొన్న మరియు చిరు ధాన్యాలు) పప్పు దినుసులు (కంది, పెసర, మినుము, శనగ మరియు సోయాచిక్కుడు), నూనె గింజలు (వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు), కూరగాయలు (టమాటా, వంకాయ, మిరప, కూకుంబర్, క్యారెట్, సొరకాయ, కాకర, బూడిద గుమ్మడి, బీరకాయ, బీన్స్, బెండకాయ, గోరుచిక్కుడు, ఉల్లిగడ్డ అన్ని రకాల ఆకుకూరలు), పండ్లు (మామిడి, సపోటా, జామా,పుచ్చకాయ, కర్బూజా, నిమ్మ, , ధానిమ్మ, ఫిగ్గ్, మొసాంబి), వ్యాపార మరియు ఔషధ పంటలు, (చెరుకు, పసుపు, ఆలోవీర, మునగ, ప్రత్తి) మొదలగు పంటలకు సేంద్రీయ ధ్రువీకరణ చేయబడుతున్నది.
సేంద్రియ ధ్రువీకరణ వలన కలిగే ప్రయోజనాలు:
• వినియోగదారులకు నమ్మకం & భరోసా, సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్
• మార్కెట్లో అవకతవకల నియంత్రణ
• వాణిజ్య సరిళలో సేంద్రియ ఉత్పత్తులకు ప్రోత్సాహం
• ధృవీకరణ అనేది పారదర్శకతకు ఒక పటిష్టమైన మార్కెటింగ్ సాధనం
సేంద్రియ దృవీకరణ చేయు పద్దతి :
• సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, రైతు గ్రూపులు మరియు ఉత్పత్తిదారులు సంస్థకి తగిన రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలి
• రైతు సేంద్రియ క్షేత్రమును నమోదు చేసుకొనుటకు ముందు ధ్రువీకరణ సంస్థ అధికారులు ఆ క్షేత్రమునకు సంబంధించినటువంటి అన్ని పత్రాలను పరిశీలన చేయడం జరుగుతుంది
• నమోదు చేయబడిన క్షేత్రమును సంస్థ అధికారులు రైతుకు ముందస్తుగా సమాచారం ఇచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది
• తనిఖీ పూర్తి అయిన తరువాత నమోదు చేయబడిన క్షేత్రము మరియు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించిన వివరాలను తనిఖీ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది
• తనిఖీ సంఖ్య ఎన్ని చేయాలి అనే నిబంధన లేదు కానీ పరిస్థితిని బట్టి ఎన్ని తనిఖీలైన చేయవచ్చు, ముందస్తు సమాచారం లేకుండా కూడా తనిఖీ చేయవచ్చు
• ఏదైనా సేంద్రియ ధ్రువీకరణకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే సరిదిద్దుకునే అవకాశం ఉత్పత్తిదారులకు ఇస్తుంది. అది సరి చేయకపోతే సంస్థ ధ్రువీకరణ చేయుట నిరాకరిస్తుంది.
• ఈ విధంగా తనిఖీ మరియు మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తరువాత ఆ పంటకి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుంది
• చివరిగా ఈ క్రింది దృవీకరణ పత్రాలు జారీ చేయటం, స్కోప్ సర్టిఫికెట్ (సేంద్రియ పంటల ఉత్పత్తి కొనసాగించుటకు ఇచ్చే సర్టిఫికేట్) మరియు ట్రాన్సాక్షన్ సర్టిఫికెట్ (సేంద్రియ ఉత్పత్తుల అమ్మకానికి ఇచ్చు సర్టిఫికెట్)
• సంస్థ జారీ చేసిన ఈ పత్రాలకు చెల్లుబాటు ఒక సంవత్సరం వరకు ఉంటుంది. సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేసుకోవచ్చు
సేంద్రీయ దృవీకరణ ఛార్జీలు :
• సేంద్రీయ ధ్రువీకరణ పొందుటకు ఎకరాకు రూ.2960/- మొదలుకొని 25 ఎకరాల వరకు 3200/- రూపాయలు మాత్రమే రుసుము చెల్లించవలసి ఉంటుంది.
రైతులకు అందుబాటులోకి “TG ఆర్గానిక్స్” మొబైల్ యాప్ – సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
• శుక్రవారం రోజు తెలంగాణ సెక్రటేరియట్ లో “TG ఆర్గానిక్స్” యాప్ పై సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
• సమీక్ష సమావేశానికి హాజరైన వ్యవసాయ శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్, IAS మరియు తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ దృవీకరణ అథారిటీ డైరెక్టర్ మరియు ఇతర అధికారులు.
• ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక వ్యవసాయ వారోత్సవాలలో భాగంగా మే 4 న వికారాబాద్ జిల్లా, తాండూర్ లో “TG ఆర్గానిక్స్” మొబైల్ యాప్ ను ప్రారంభించనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
• తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ పొందిన రైతులు తమ యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి మార్కెటింగ్ సౌకర్యాలను అందించడంలో భాగంగా “TG ఆర్గానిక్స్” యాప్ ను అందుబాటులో తీసుకరావటం జరిగింది.
• రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగులు చేయదలచుకున్న కస్టమర్లు నేరుగా TG ఆర్గానిక్స్ మొబైల్ యాప్ ద్వారా రైతులను సంప్రదించి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు.
• ఈ విధంగా, రాష్ట్రంలో సేంద్రీయ దృవీరన పద్దతి మరియు TG ఆర్గానిక్స్ మొబైల్ ద్వారా మార్కెట్ లో ఇబ్బడిముబ్బడిగా నకిలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నియంత్రించే అవకాశం నెలకొంటుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి, తగిన చర్యలు కూడా తీసుకుంటుంది.
“TG ఆర్గానిక్స్” యాప్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేయు పద్దతి:
• కస్టమర్లు ఎవరైనా ప్లే స్టోర్ నుంచి TG ఆర్గానిక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు
• ఆ తరువాత, OTP ద్వారా లాగ్ ఇన్ అవ్వాలి
• మొదటగా తమకు కావలసిన పంటల గ్రూపును, పంట ఉత్పత్తులను సెలెక్ట్ చేసుకోవాలి
• ఆ తరువాత వచ్చే రైతుల వివరాల ద్వారా నేరుగా వారిని సంప్రదించి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు
• ఇందులో తమకు 50 కిలోమీటర్ల పరిదిలో ఉండే రైతుల వివరాలు మొదటగా వస్తాయి, ఒకవేళ పరిధిని తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవచ్చు
“TG ఆర్గానిక్స్” యాప్ ప్రత్యేకతలు:
– ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు యాప్ లో ఉన్నారు (ఈ సంఖ్య మున్ముందు పెరుగును)
– సేంద్రియ దృవీకరణ సేవలు ఇస్తున్న ఇతర రీజినల్ కౌన్సిల్స్ (RCs) అయిన ఏకలవ్య ఫౌండేషన్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (CSA) తో ఇతర RC లకు చెందిన ఆర్గానిక్ రైతుల వివారాలు కూడా ఈ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది.
– సుమారు 100 కు పైగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ యాప్ లో కస్టమర్లకు అందుబాటులో ఉంచడం జరిగింది
– రైతు మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు
– రైతు వద్ద అందుబాటులో ఉన్న ధృవీకరించిన వివిధ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
– తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ సర్టికెట్లు పొందిన రైతుల వివరాలు మాత్రమే యాప్ లో ఉంటాయి
– ఈ యాప్ ద్వారా కేవలం ఆర్గానిక్ రైతు వివరాలు మరియు అతని వద్ద అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ వివరాలు మాత్రం ఈ యాప్ లో ఉంచడం జరిగింది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క రేటు ను నిర్ణయించే అధికారం రైతుకు మాత్రమే ఉంటుంది. కావున రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.
