ఆ రోజే దీదీకి ఈ ధిక్కారం అర్థం అయ్యి ఉంటే దిద్దుబాటు చేసుకొనేది ఏమో!
కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష ఘటన యావత్ భారతావనిని ఉలిక్కిపడేలా చేసింది. న్యాయం కోసం రోడ్లెక్కిన వేలాది మంది నిరసనకారుల మధ్య ఒక దృశ్యం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. సాంప్రదాయ దుస్తులు ధరించి, ఉగ్రరూపంతో, రౌద్ర రసాన్ని ఒలికిస్తూ ఒక యువతి చేసిన నృత్యం నాడు సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.
ఈమె ఒక వైద్యురాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, నిజానికి ఆమె పేరు మోక్ష సేన్‌గుప్తా. ఆమె ఒక సుప్రసిద్ధ నటి మరియు నర్తకి. కేవలం వృత్తిపరమైన నృత్యంగా కాకుండా, సమాజంలో పేరుకుపోయిన అరాచకత్వంపై, వ్యవస్థల వైఫల్యంపై ఒక పౌరురాలిగా ఆమె తన ఆగ్రహాన్ని కళా రూపంలో ప్రదర్శించారు.
ప్రసిద్ధ విప్లవ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రాసిన “కారార్ ఓయ్ లౌహో కొపాట్” (ఆ ఇనుప సంకెళ్లను తెంచేయండి) అనే గీతానికి ఆమె చేసిన నృత్యం గగుర్పాటు కలిగించింది. అన్యాయాన్ని అంతం చేసే శక్తి స్వరూపిణిగా, దుష్టశిక్షణ చేసే కాళికా దేవిని తలపిస్తూ ఆమె చేసిన ముద్రలు నిరసనకారుల్లో ఉత్తేజాన్ని నింపాయి. కేవలం పాదాల కదలికలే కాకుండా, ఆమె కళ్ళలో కనిపించిన నిప్పుకణికలు నాటి దీదీ పాలక పక్షంపై, నేరస్తులకు అండగా నిలుస్తున్న వ్యవస్థలపై సంధించిన అస్త్రాల్లా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ కేసులో వ్యవహరించిన తీరును నిరసిస్తూ, బాధితురాలికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఈ ‘తాండవం’ సాగింది.
చరిత్రలో ఎప్పుడూ కళ అనేది కేవలం వినోదానికే పరిమితం కాలేదు; అది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతూనే ఉంది. కోల్‌కతా వీధుల్లో మోక్ష చేసిన ఈ నృత్యం, ఒక నేరానికి వ్యతిరేకంగా సామాన్యుడు చేసే యుద్ధానికి నిదర్శనం. నేరస్తులకు రక్షణ కవచంలా నిలిచే ఏ వ్యవస్థ అయినా సరే, ప్రజాగ్రహం అనే ‘మహాకాళి’ ముందు తలవంచక తప్పదని ఈ ప్రదర్శన హెచ్చరించింది.
నిశ్శబ్దంగా ఏడవడం కంటే, ఇలాంటి ధిక్కార స్వరాలు వినిపించినప్పుడే వ్యవస్థలో చలనం మొదలవుతుంది. ఈ ‘కాళీ’ నృత్యం కేవలం ప్రదర్శన కాదు, అది న్యాయం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది ఆక్రందన! ఇవే దీదీని గద్దె దింపింది.
-చాకిరేవు