– మహిళా సంఘాలెక్కడ?
– పలుకుబడి కల వారు మానభంగాలు చేసినా చట్టం ఏం చేయదు
(ప్రొఫెసర్ దోగిపర్తి సుబ్రమణ్యం)
సందేహమే లేదు . కుక్కల్ని , అవుల్ని కొట్టక్కర లేదు . ఓ తిట్టు తిట్టినా బడిత పూజే . ఓ అయిదారేళ్ళ కింద రోడ్ల మీద అవుల్ని వదిలేయడం వలన ట్రాఫిక్కుకి ఇబ్బందిగా ఉంటుంది అని పోస్ట్ పెట్టా . అది చెపుతూ చానాళ్ళ కింద ఒక అమెరికన్ రొటేరియన్ టీం రోడ్ల మీద అవుల్ని చూసి వీటికి షెల్టర్లు ఉండవా అని అడిగారని నేను పోస్టులో వ్రాసాను .
ఓ జాతీయవాద సోదరి , గోవుల మీద అపార ప్రేమ కలిగిన ఆమె వెటకరిస్తూ కామెంట్ పెట్టింది . ఇక్కడ కొస మెరుపు ఏమిటంటే నాకు ఆమె ఓ ఇరవై ఏళ్ళుగా తెలుసు . నాకు పరోక్ష విద్యార్ధి కూడా . తాను పరీక్ష పాసయిన ప్రతీ సారి నా కాళ్ళకు దండం పెట్టిపోతూ ఉంటుంది .
అయిననూ , నాకన్నా ముఖ పరిచయం కూడా లేని రోడ్ మీద అడ్డంగా పడుకుని ట్రాఫిక్కుని ఇబ్బంది కలిగించిన ఆవులే ముఖ్యం అయినాయి ఆమెకు .
ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న ఆవు కూడా ఆ మాటే అంటుంది . ఆవును మాట అన్నా మన మీద విరుచుకుపడే సెలబ్రిటీలు , నాయకులు కుప్పలుకుప్పలు . ఆవుల్ని ఏంటి ! కుక్కల్ని ముద్దు చేయటం ఎక్కువ అయిందని , రీల్సులో కుక్కలతో చేసే శృంగార విన్యాసాల గురించి చెప్పే పనే లేదని , ఫంక్షన్లలో డైనింగ్ హాలుకు కూడా తెస్తున్నారు అని మరో పోస్టులో పెట్టా .
ఓ రిటైర్డ్ DSP , నాకు సుమారు 40 సంవత్సరాలుగా స్నేహితుడు ఓ కామెంట్ పెట్టాడు . ఏమని ? నువ్వు anti-hindu and anti-sanatani అని . నా పోస్టుకు నాకిచ్చిన బిరుదుకు ఏమయినా సంబంధం ఉందా ? ఇలా తయారయ్యారు . ఇలాంటోళ్ళను ఏం చేయగలం ? మానసిక రోగులు అని వదిలేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది .
ఆడపిల్లల మీదే కాదు ; నోరు లేని మనుషుల మీద అఘాయిత్యాలు జరిగినా దిక్కు ఉండదు . పలుకుబడి కల వారు మానభంగాలు చేసినా , చేసి చంపేసినా , తుపాకులతో కాల్చినా , గొడ్డళ్ళతో నరికినా చట్టం ఏం చేయదు . ఎవరూ నోరెత్తరు . పేపరోళ్ళు వ్రాయరు . టివి వాళ్ళు డిబేట్లు పెట్టరు . రోజులు మారాయి . మంచి రోజులు వచ్చాయి .
