– ఫార్మా, ఆటో, ముఠా కార్మికులతో రాస్తారోకో
– లేబర్ కోడ్స్ పేరుతో 12 గంటలు పని విధానాన్ని తెస్తే ప్రతిఘటిస్తాం
– సిఐటియు జిల్లా అధ్యక్షుడు వివి శ్రీనివాసరావు పిలుపు
లంకెలపాలెం: కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసే విధంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని 12 పని విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని ఈరోజు లంకెలపాలెం జంక్షన్ లో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఈ ఆందోళనలో ఫార్మా సిటీ కి వెళ్తున్న కార్మికుల ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర బిజెపి ప్రభుత్వం మే 8వ తేదీన 29 కార్మిక చట్టాలు రద్దుచేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ ను అమలకు రూల్స్ రూపొందించి నోటిఫికేషన్ విడుదల చేసిందని ఇది కార్మికులకు అత్యంత ప్రమాదకరమైన చర్యని దీనిని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ లో 8 గంటల పని విధానం రద్దయి 12 గంటలు పని విధానం రావడంతో పాటు ఓటి పేరుతో మరో 12 గంటల వరకు పని చేయించుకునే విధంగా ఈ రూల్స్ లో రూపొందించడం అత్యంత దుర్మార్గం అని అన్నారు. మహిళలు రాత్రి సమయంలో పని చేయాలని యజమానులకు ఊడిగం చేసే విధంగా కట్టు బానిసలుగా కార్మికులకు మార్చే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయని అన్నారు.
యజమానికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు పనిలో పెట్టుకోవడం లేదనుకుంటే తనే ఎప్పుడు తొలగిస్తే అప్పుడు ఇంటికి వెళ్ళిపోయే విధంగా ఈ యొక్క లేబర్ కోడ్స్ లో తీసుకురావటం దుర్మార్గం అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అడుగుజాడల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బిజెపి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ ను అమల్లోకి తెచ్చి 12 గంటల పని విధానం అమలు చేస్తానని ప్రకటించిందని అన్నారు.
దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చడమే ఈ లేబర్ కోడ్స్ ప్రధాన ఉద్దేశం అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ రమణి జిల్లా కమిటీ సభ్యులు చలపతి, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట్రావు, ఆటో యూనియన్ నాయకులు రమణ ఫార్మా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.