– పెద్దోళ్లకు అడ్వాన్సులిచ్చి, మా బకాయిలివ్వరేం?
– 1100 కోట్ల బిల్లుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
– మరి పెద్ద కంపెనీలకు అడ్వాన్సులిస్తున్నారే?
– మేం బతికున్న జీవచ్ఛవాలం
– మా బతుకులు చిన్నాభిన్నమపోయాయి
– 20 నెలలుగా నిరసనలు చేసినా పట్టించుకోరా?
– జనసేన ఆఫీసు ఎదుట నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యుఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ మెరుపు ధర్నా
మంగళగిరి: తమకు రావలసిన 1100 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యుఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కాంట్రాక్టర్లు మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.
తమ శాఖకు చెందిన మంత్రి పవన్ కల్యాణ్‌ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని, బిల్లులు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చి పనులు చేయిస్తున్న ప్రభుత్వం, చేసిన పనులకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వాలని కోరుతున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
కాంట్రాక్టర్లు ఏమన్నారంటే.. రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని కలవటానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా , కలవనీయకుండా ఇద్దరి ని మాత్రమే రమ్మ ని లోపలికి కూర్చోబెట్టి.. మంత్రి రాగానే కల్పిస్తామంటూ మాటిస్తున్నారు తప్ప, మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు పట్టించుకోక, ఇటు పాలకులు పట్టించుకోక మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
మాకు రావాల్సిన సుమారు 1100 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గత 20 నెలలుగా మాకు రావాల్సిన బకాయిలను చెల్లించమని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. కార్పొరేట్ సంస్థలకు ముందస్తుగా బకాయిలు చెల్లించి, వారు చేయవలసిన పనులకు ముందుగానే డబ్బులు కేటాయిస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
గత 20 నెలలుగా అనేకసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేము శారీరకంగా బ్రతికే ఉన్నా మానసికంగా చనిపోయాము. మమ్మల్ని పట్టించుకోకపోతే, మా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. ఈనెల 16వ తేదీన పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులోకి వస్తారు. వారిని కలిసి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని అన్నారు.