ఎన్.టీ. ఆర్. ఒక ఐంద్రజాలికమైన పేరు. తెలుగులో ఎంతో కదిలిన పేరు తెలుగును ఎంతో కదిలించిన పేరు. ఇంకా మనలో మెదులుతూ ఉన్న పేరు. ఇవాళ మన తెలుగు జిలుగు నందమూరి తారకరామారావు జయంతి. ఈ సందర్భంగా ఒకసారి ఆయన గురించి నెమరు వేసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ, వైవిధ్యం, depth, width, insight ఉన్న చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు చౌదరి. నందమూరి తారక రామారావు పూర్తి పేరు నందమూరి తారక రామారావు చౌదరి. కొద్దిమందికి మాత్రమే ఈ పూర్తి అసలు పేరు తెలుసు. జ్యోతిష్కుడు భమిడిపాటి రాధాకృష్ణకు స్వయంగా ఎన్.టీ.ఆర్. ఇది తన తల్లితండ్రులు తనకు బారసాల రోజున పెట్టిన పేరు అని తెలియజేశారు.
భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత ప్రతిభ ఉన్న చలనచిత్ర నటుడు మరొకరు ఉండరేమో? ఆయన నటనలో చూపిన వైవిధ్యం మరేనటుడూ ప్రదర్శించలేదు. ‘రామారావు ఒక అభినయవేత్త’.
పౌరాణికాలు మాత్రమే కాదు సాంఘీకాలలో కూడా రామారావు అంతర్జాతీయ స్థాయి నటనను ప్రదర్శించారు. వివాహబంధం, పిచ్చి పుల్లయ్య , షావుకారు, చిరంజీవులు, బడిపంతులు వంటి సినిమాలు అందుకు తార్కాణం. రాజు పేద సినిమాలో ఆయన పోషించిన భిక్షగాడి పాత్ర మరెవ్వరూ ఆయనలా చెయ్యలేరు. తమిళ నటుడు ఎమ్.జీ.రామచంద్రన్ కు ఈ పాత్ర బాగా ఇష్టమట.
“పాత్రధారి” అంటారు కదా? రామారావు పాత్రధారి. ధరించిన పాత్రలను ఆయన అమోఘంగా పోషించారు.
ఆహార్యం, వాచికం, ఆంగికం, అభినయం… కదా నటనలో ఒక నటుడికి కావాల్సినవి. ఆహార్యం (make up) నటుడికి ఇతరులు చేస్తారు.
వాచికం… రామారావు ప్రదర్శించిన వాచికం ఎంతో గొప్పది. మల్లిశ్వరి, పాతాళ భైరవి, పిచ్చిపుల్లయ్య వంటి చిత్రాలలో ఆయన వాచికం ఎంతటి ప్రతిభావంతమైనదో మనం తెలుసుకోవచ్చు.
కళ్లు మూసుకుని విన్నా ఆయన వాచికం వల్ల ఆ సన్నివేశమూ, భావమూ దృశ్యరూపంగా మనకు కనిపిస్తాయి. ఇంక ఆంగికం… బీదపాత్రలు చేసినా, పౌరాణికాలు చేసినా ఆయన ఆంగీకం వల్ల ఆ పాత్రలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కృష్ణదేవరాయలు పాత్రను కన్నడంలో గొప్ప నటుడు రాజ్ కుమార్ చాల బాగా చేశారు. కానీ తన ఆంగీకం, వాచికం, రూపం వీటివల్ల ఆ పాత్రలో రామారావు మెరుగ్గా మెరుస్తారు. కృష్ణ దేవరాయలు పాత్రకు రామారావు సమకూర్చిన గాంభీర్యాన్ని రాజ్‌కుమార్ తీసుకు రాలేకపోయారు.
గాంభీర్యం అంటే రామారావు. హిందీ పృధ్వీరాజ్ కపూర్, మన ఎస్.వీ. రంగారావు ఈ గాంభీర్యం విషయంలో రామారావుకు సాటి రాగలరు.
సత్య హరశ్చంద్ర , బడిపంతులు పాత్రలలో రామారావు చూపిన సాత్వికత, దైన్యత చాలా విలువైనవి. దేవదాసు పాత్ర నాగేశ్వరరావు చాల గొప్పగా చేశారు. అందరికీ తెలిసిందే. రామారావు అలాంటి పాత్రను చిరంజీవులు సినిమాలో చేశారు. ఆ పాత్ర ధారణ అద్వితీయం.
కృష్ణుడు పాత్ర అంటే రామారావు. ఇది మామూతెలిసినదరికీ తెలిసినదే. కానీ రామారావుకు కృష్ణుడు పాత్ర సహజంగా అమరింది కాదు. ఆయన సాధించుకున్నది. తన శారీరిక దోషాలకు అతీతంగా, తన సహజ గాత్రధర్మానికి అతీతంగా తన మేధతో తన ఆలోచనా సరళితో, తన పరిశీలనతో, తన ప్రతిభతో సాధించుకున్న ఘనత కృష్ణుడు పాత్ర.
కృష్ణుడు పాత్ర ధారణే రామారావు మహోన్నతమైన నటుడు అన్నదానికి సరైన తార్కాణం. అదేవిధంగా రాముడు పాత్ర. మన దేశంలో రాముడు పాత్రను ప్రేమ్ అదీబ్ (హిందీ చిత్రాలు: భరత్ మిలాప్, రామరాజ్య) రామారావుకు ముందు చక్కగా పోషించారు. రామారావు ఆ రాముడు పాత్రను తనదిగా చేసుకున్నారు.
రాముడుగా చేసిన రామారావు రావణుడుగా చెయ్యడం అదీ సీతారామ కళ్యాణంలో మహోన్నతంగా చెయ్యడం ఒక అద్భుతం. ఎన్నో ప్రత్యేకతలను నిబిడీకృతం చేసుకుని రావణుడు పాత్రను చేశారు రామారావు. ముఖ్యంగా పేగులతో వీణ వాయించే సన్నివేశం నభూతో న భవిష్యతి. ఆయన రావణుడు పాత్రలో ప్రదర్శించిన క్రౌర్యం, భక్తి అపూర్వం.
కచ్చితత్వంతో ఆ సినిమాలో రామారావు రావణుడి పాత్ర చేశారు.
కృష్ణుడుగా చేసిన ఆయన దుర్యోధనుడుగా చేశారు. శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధనుడుగా రామారావు చేసినది విశిష్టమైనది. ఇక కర్ణుడుగానూ రామారావు చేసినది ఉత్తమమైనది. కర్ణుడు పాత్రను అంతకు ముందు తమిళ్ష్‌లో శివాజీ గణేస(శ)న్ చేశారు. కానీ రామారావు ఆ పాత్ర చెయ్యడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది.
శివాజీ గణేసన్ కర్ణుడుగా చేసిన తమిళ్ష్ సినిమాలో రామారావు కృష్ణుడుగా చేశారు. అందులో రామారావు పాత్ర నిడివి చాల తక్కువగా ఉంటుంది. ఆ సినిమాను చూస్తూ శివాజీ గణేసన్ “నాకళ్లు కూడా రామారావునే చూస్తున్నాయి. ఆయన ముందు నేను నాకే కనిపించడంలేదు” అన్నారు. తమిళ్ష్‌లో శివాజీ గణేసన్ చేసిన గుడిగంటలు, కలిసి ఉంటే కలదు సుఖం, రక్తసంబంధం సినిమాల్లోని పాత్రలు ఆయనకన్నా రామారావు తెలుగులో మేలుగా చేశారు. దిలీప్ కుమార్ సైతం గుడిగంటలులో రామారావు నటనకు తులతూగలేకపోయారు.
రామారావు screen presense చాల గొప్పది. చాల అరుదైంది. దిలీప్ కుమార్, కన్నడ రాజ్‌కుమార్, ఎస్.వీ. రంగారావు, ముమ్ముట్టి, అమితాబ్ బచన్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి నటులకు మాత్రమే అలాంటి, అంతటి screen presense ఉంది. ‘చలనచిత్ర నటన పరంగా రామారావు ఒక అద్భుతం’.
మగతనం ఉట్టి పడే రామారావు నర్తనశాలలో పేడి పాత్ర చెయ్యడం అదీ గొప్పగా చెయ్యడం ఇంకెక్కడా, ఇంకెవ్వరూ కనీసం ఊహించలేనిది. రామారావుకు మాత్రమే సాధ్యపడేది. డాక్టర్ ఆనంద్ సినిమాలో దుష్టత్వం ఉన్న పాత్రను చేశారు. ఒక నాయకుడుగా, దేవుళ్ల పాత్రల నటుడిగా ప్రజాదరణ ఉన్న రామారావు డాక్టర్ ఆనంద్ లాంటి పాత్రలు చెయ్యడం పెద్ద సాహసం. ఆ పాత్రనూ గొప్పగా పోషించారు రామారావు.
conceptualized performance and designed performance రామారావు నటన. దిలీప్ కుమార్ తరువాత రామారావు దీన్ని సాధించి చూపించారు. రామారావు పాత్రపోషణలో ఇతర నటులలో పెద్దగా కనిపించని insight ఉంటుంది. “అలిగితివా సఖీ ప్రియా…” పాటలో “ప్రియురాలవనీ…” అని వచ్చిన చోట ఎదురుగా ఉన్న సత్యభామను చూపించకుండా చేతి వేళ్లను కృష్ణుడు తన హృదయాన్ని తాకించి చూపుతాడు. సఖీ, ప్రియ హృదయంలో ఉన్నదన్న insightతో కృష్ణుడుగా ఎన్.టి.ఆర్ అభినయించారు. ఇలా ఇంకెన్నో ఉన్నాయి.
Portray లేదా పాత్రధారణలో రామారావు చాల గొప్పవారు.
రామారావు చివరి దశలో చేసిన కవిసార్వభౌమ శ్రీనాథ సినిమాలో శ్రీనాథుడి పాత్రను అద్భుతంగా portray చేశారు రామారావు.
జనరంజకమైన నటుడవడం వల్ల రామారావు ఒక మహోన్నతమైన నటుడు అన్నదీ, విశ్వంలోనే ఒక అరుదైన నటుడు అన్నదీ మరుగున పడిపోయింది. ఆయనకు వచ్చిన పేరుకన్నా ఆయన ఎంతో గొప్ప నటుడు. రామారావు నటనా విస్తృతిపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఆయన నటనా వైదుష్యం ప్రపంచానికి ఇంకా సరిగ్గా తెలియరాలేదు. ఆ పని జరగాలి.
రామారావు గురించి కొన్ని:
పుట్టిన తేది :
1923.
పుట్టిన చోటు :
నిమ్మకూరు.
వివాహం :
1942.
చదువు :
బి.ఎ.
ఎత్తు :
5 ‘ 10
తొలి దశ లో చేసినవి:
పాలు అమ్మడం,
పొగాకు వ్యాపారం,
బొంబాయి లో సౌండ్ రికార్డింగ్ శిక్షణ,
బొంబాయిలో మెస్ నడపడం
తొలి మేకప్ మాన్ :
మంగయ్య
తొలి స్ట్యూడియో :
శోభనాచల
తొలిసారి కెమెరా అనుభవం :
మనదేశం సినిమా
తొలి పాత్ర :
సబ్ ఇన్ స్పెక్టర్
తొలి సినిమా రాబడి:
1116
తొలి దర్శకులు :
ఎల్.వి. ప్రసాద్
తొలిసారి కథానాయకుడి పాత్ర: పల్లెటూరి పిల్ల
తొలి నాయిక :
అంజలి దేవి
తొలి సారి కృష్ణుడి పాత్ర:
ఇద్దరు పెళ్ళాలు
తొలిసారి రాముడి పాత్ర:
చరణదాసి.
తొలి రావణ పాత్ర :
భూకైలాస్
తొలి శివుడి పాత్ర :
దక్షయజ్ఞం
అద్భుతమైన నటనా వ్యక్తిత్వం. విస్తారమైన, విపులమైన నటనా ప్రావీణ్యం నందమూరి తారకరామారావు.
ఆయన జనరంజక నటుడైపోవడం వల్ల ఆయన నటన-ఘనతపై దృష్టి సరిగ్గా పడలేదు. ఆయన నటనా వైదుష్యంపై ప్రపంచానికి సమగ్రమైన అవగాహన రాలేదు. తెలుగువాళ్లకు కళాకారుల ఘనతను అర్థం చేసుకోవడం ఇతరులకు తెలిసినట్టుగా తెలియకపోవడం వల్ల, రామారావుకు నటుడిగా దక్కాల్సిన ఇంకా గొప్ప స్థానం దక్కలేదు.
తమిళ్ష్ వంటి ఇతర భాషల్లో over rated actors ను చూశాం. అదేమిటో రామారావు under rated actor. అంటే ఆయన ఎంత గొప్ప నటుడో అంత గొప్ప నటుడుగా పరిగణించబడడం లేదు.
అభినయం, ఆంగికం, వాచికం ఈ మూడిట్లో రామారావు విశేషమైన ప్రజ్ఞ ఉన్న వారు.
ఎంతో విస్తృతమైన పరిధి, ప్రతిభ, లోతు, ఎత్తు, సామర్థ్యం ఉన్న నటుడు రామారావు. ఎన్.టీ. రామారావు నటనపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులోనైనా నందమూరి తారకరామారావు చౌదరి నటన సామార్థ్యంపై సమగ్ర అవగాహన విశ్వవ్యాప్తం అవాలి.
- రోచిష్మాన్
94440 12279