October 3, 2026

పాపం.. విజయలక్ష్మి!

  • క్యాబినెట్ మీటింగుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మికి నో ఎంట్రీ
  • హాలులోకి వెళ్లకుండా ఆపేసిన అవమానం
  • సమాచారలోపమేనంటూ అధికారవర్గాల సర్దుబాటు
  • ఈసారి క్యాబినెట్‌కు పిలుస్తామని సమాధానం
  • గతంలో వినూద్‌కుమార్, నిరంజన్‌రెడ్డికి క్యాబినెట్ మీటింగులో చోటు
  • మొన్నటివరకూ చిన్నారెడ్డికీ పిలుపు
  • ఇప్పుడు గద్వాల విజయలక్ష్మికి నో ఎంట్రీ
  • బీసీ బిడ్డను అవమానిస్తారా అంటూ బీసీ నేతల ఫైర్
  • కేసీఆర్ హయాంలో ప్లానింగ్‌బోర్డు చైర్మన్లకు గౌరవం ఇచ్చేవారన్న మాజీ మంత్రి తలసాని
  • బిసి బిడ్డ కాబట్టే గద్వాలను పిలవలేదా?
  • సిరిసిల్లలో మంత్రి పదవి సంగతి తర్వాత.. ముందు ఉన్న బీసీ నేతలను గౌరవించడం నేర్చుకోండి
  • సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి తలసాని చురకలు
  • కాంగ్రెస్‌కు మరో బీసీ పితలాటకం
  • ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను రెడ్లకు ఇవ్వడంపై బీసీల లొల్లి
  • కొత్తగా గద్వాలకు అవమానంతో మరో శిరోభారం

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘బీసీ టైమ్స్’ నడుస్తున్నట్లుంది. ‘బిసి టైమ్స్’ అంటే బీసీలు వెలిగిపోవడమనుకుంటే త(ప)ప్పులో కాలేసినట్లే. బీసీలకు అడుగడుగునా అవమానమన్న పర్వమన్నమాట. అంటే కాంగ్రెస్‌లో ఎటు చూసినా బీసీలే కేంద్రబిందువులవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ అవమానపరంపర ‘విజయ’వంతంగా కొనసాగుతోంది.

బీసీ బిడ్డ కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బహిష్కరించినప్పటి నుంచీ, ఏదో ఒక సందర్భంలో బీసీలకు అవమానం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడుగులకు గొడుగుపట్టే ‘పాత కాంగ్రెస్’ స్థానంలో వచ్చిన కొత్త కాంగ్రెస్ నాయకత్వమే ఈ మార్పులకు కారణమని కాంగ్రెస్ బీసీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు బీసీ బిడ్డ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి నుంచి తప్పించిన నాయకత్వం..ఆమెపై సీఎల్పీ వేదికగా దూషించిన ఎమ్మెల్యేలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సురేఖ కంటే రేవంత్‌నుద్దేశించి ఘాటుగా మాట్లాడిన.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌లో రెడ్లకు పట్టం కట్టి, బీసీలను అణచివేసేవేనన్న భావన బలంగా నాటుకుపోయింది.

రెండురోజుల క్రితం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సామ రామ్మోహన్‌రెడ్డిని ప్రకటించడంపైనా బీసీలు భగ్గుమన్నారు.

కాంగ్రెస్’కు బీసీలు అవసరం లేదా? సంప్రదాయానికి భిన్నంగా రెండు ఎమ్మెల్సీలూ బీసీలకే ఎలా ఇస్తారు? సహజంగా రెండు ఎన్నికలొస్తే ఒకటి ఓసీ, ఒకటి బీసీ లేదా ఎస్సీకి ఇవ్వడం కాంగ్రెస్ సంప్రదాయం. అలాంటి సంప్రదాయాన్ని కొత్త కాంగ్రెస్ సమాధి చేసింది. అంటే బీసీలు చచ్చారనుకుంటున్నారా? బతికారనుకుంటున్నారా? ఇన్ని అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్ బీసీ నేతలు నోరు మూసుకోవడం బట్టి, మీరంతా పదవుల కోసం పెదవులు మూసుకున్నట్లు అర్ధమవుతోంది. బీసీలకు ఎవరు సీటిస్తే మా ఓట్లు వాళ్లకే వేస్తామ’ని బీసీలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దానిపై బీఆర్‌ఎస్ నేతలు కూడా విరుచుకుపడి, కాంగ్రెస్‌లో అగ్రకులాలకే పట్టం కడతారన్న నిజం మరోసారి తేలిపోయిందని దుయ్యబట్టారు.

ఆ వివాదం ఇంకా సమసిపోకముందే మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశానికి ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న బిసి బిడ్డ గద్వాల విజయలక్ష్మిని అనుమతించకపోవడం మరో దుమారానికి తెరలేపింది. క్యాబినెట్ సమావేశాలకు ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మన్ ఆహ్వానితులే. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వినోద్‌కుమార్, నిరంజన్‌రెడ్డి ప్రతి క్యాబినెట్ మీటింగుకూ హాజరయ్యేవారు. రేవంత్‌రెడ్డి హయాంలో విజయలక్ష్మికి ముందు.. ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డి కూడా హాజరయ్యేవారు.

క్యాబినెట్ మీటింగు జరిగే హాలులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విజయలక్ష్మిని అధికారులు అనుమతించలేదని, జాబితాలో మీ పేరు లేదని చెప్పడంతో ఆమె వెనుతిరిగి వెళ్లారన్న వార్తలు మీడియా-సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఇదంతా కేవలం సమాచారలోపం వల్లే జరిగిందని, ఇకపై జరిగే క్యాబినెట్ సమావేశానికి ఆమెను ఆహ్వానిస్తామని అధికారవర్గాలు చెప్పాయి.

బిసి బిడ్డకు క్యాబినెట్ ప్రవేశం లేకుండా చేశారన్న వార్త, సోషల్‌మీడియా ద్వారా వైరల్ కావడంతో బీసీలు భగ్గుమన్నారు. ‘క్యాబినెట్ హోదా ఇచ్చి ఆమెను క్యాబినెట్ మీటింగుకు అనుమతించకపోవడం అంటే ఏదో నామమాత్రంగా బీసీలకు పదవులిచ్చినట్లు అర్ధమవుతుంది. పేరుకు బీసీలకు పదవులిచ్చారని ప్రచారం చేసుకోవడం, ఆచరణలో వారిని ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నట్లు గద్వాలకు జరిగిన అవమానం ద్వారా అర్ధమవుతుంద’ంటూ పోస్టింగులు పెడుతున్నారు. ఇప్పటికయినా కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు తమకు జరుగుతున్న అవమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.

బీసీలకు కాంగ్రెస్ అవమానం అలవాటే: తలసాని

బీసీలకు అన్యాయం చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస యాదవ్ విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్‌కు బీసీలు అవసరం లేదని ఇప్పటికి చాలాసార్లు రుజువయింది. మొన్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా అగ్రకులాల వారిని ప్రకటించారు. ఇప్పుడు బిసి బిడ్డ గద్వాల విజయలక్ష్మిని క్యాబినెట్ మీటింగుకు రాకుండా అడ్డుకుని అవమానించారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్లు క్యాబినెట్ మీటింగుకు ఆహ్వానితులు. ఆ విషయం సీఎంకు తెలియకపోతే, అధికారులయినా చెప్పాలి కదా?

ఎలాగూ క్యాబినెట్‌లో దళితులకు స్థానం లేదు. కనీసం అర్హత ఉన్న బీసీలను కూడా అడ్డుకుంటే ఇక బీసీలకు దిక్కెవరు? కేసీఆర్ హయాంలో ఇద్దరు ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మన్లు క్యాబినెట్‌కు హాజరయ్యేవారు కదా? మొన్నటి వరకూ చిన్నారెడ్డిని కూడా ఆహ్వానించి, ఇప్పుడు బీసీ బిడ్డ విజయలక్ష్మిని అడ్డుకుని అవమానించడం బీసీలను అణచివేయడమే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బిసి బిడ్డ గద్వాల విజయలక్ష్మిని మేయర్ చేసి గౌరవించిన చరిత్ర మాది. దీన్నిబట్టి బీసీలు ఎవరి వైపు ఉండాలో నిర్ణయించుకోవాల’’ ని తలసాని వ్యాఖ్యానించారు. ‘సిరిసిల్లలో గెలిచిన బీసీలకు మంత్రి పదవి ఇస్తానంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందు హోదాలో ఉన్న బీసీలను గౌరవించండి. అదే పది వేలు. అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు వడ్డాణం కొంటాడన్నట్లు ఉంది రేవంత్‌రెడ్డి తీరు. ఇవన్నీ బీసీలు గమనించి, ఆత్మపరిశీలన చేసుకోవాల’న్నారు.

Total Visitors: 2,855,269