October 3, 2026

మేమూ కొడంగల్‌లో సభ పెడతాం

  • కొడంగల్‌లో మా సత్తా చూపిస్తాం
  • త్వరలో విద్యుత్, నీటి సంక్షోభం
  • అందుకే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
  • జనాలు అమాయకులు కాదు
  • సిరిసిల్లలో రేవంత్ సభ రొటీన్
  • మేం కొడంగల్‌లో పెడితే అది రొటీన్‌కు భిన్నం
  • సిరిసిల్ల పక్క రాష్ట్రంలో ఉందా?
  • కొత్త శాసనసభను చూస్తున్నాం
  • నాటి విలువలకు పాతర
  • విపక్షాలకు విలువేదీ?
  • ఖైర తాబాద్‌లో మాదే విజయం
  • మీడియాతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఉపనేత తలసాని శ్రీనివాసయాదవ్ చిట్‌చాట్

(సుబ్బు)

‘రేవంత్‌రెడ్డి ఏదో పక్క రాష్ట్రానికి దండయాత్రకు వెళ్లినట్లు మందీమార్బలం, వేలాది పోలీసులతో సిరిసిల్లకు వెళ్లి ఏం సాధించారు? ఆయన సిద్దిపేటలో కూడా మీటింగ్ పెడతానంటున్నాడు కదా? పెట్టనీయండి. ఆ తర్వాత మేం కూడా రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సభ పెట్టి మా సత్తా చూపిస్తాం. అధికారంలో ఉన్న సీఎం ప్రతిపక్షనేత నియోజకవర్గంలో సభ పెట్టడం రొటీన్. దానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. అదే సీఎం నియోజకవర్గంలో ప్రతిపక్షమైన మేం సభ పెడితే అది రొటీన్‌కు భిన్నం. జనం-మీడియా దానికి ప్రాధాన్యం ఇస్తారా? మాకు ఇస్తారా?’ అని మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ఎల్పీ నేత తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయ ఇన్చార్జి, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి తలసాని మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.

రేవంత్‌రెడ్డి తనకు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షాలను అణచివేసి, వారిపై కేసులో పెట్టే పనిలో ఉండటం ఎప్పుడూ జరగలేదన్నారు.

‘ఒక సీఎంగా రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికయినా వెళ్లవచ్చు. దానికి హంగూ ఆర్భాటం అవసరం లేదు. అయినా సిరిసిల్లకు వెళ్లిన రేవంత్ సభతో అక్కడి ప్రజలకు ఏం వచ్చింది? నయాపైసా నిధులు ప్రకటించకుండా బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ భవనాలు ప్రారంభించారు. ఆ భవన నిర్మాణాలు ఎవరి హయాంలో ప్రారంభమయిందో మిగిలిన ప్రాంతాలకు వారికి తెలియకపోయిన ఆ జిల్లా ప్రజలకు తెలియదా? రేవంత్‌రెడ్డి హడావిడికి అక్కడి జనం నవ్వుకోరా?’ అని ప్రశ్నించారు.

‘సనత్‌నగర్ టిమ్స్, ఎల్‌బీనగర్ ఆసుపత్రులు ఎవరు కట్టారో అక్కడి జనాలకు తెలియదా? బీఆర్‌ఎస్ హయాంలో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో, ఈ ప్రభుత్వం చేసిన పని 20 శాతం మాత్రమే. ఆ నిజాలకు మరుగునపరిచి అబద్ధాలాడితే పోయేది ప్రభుత్వ పరువే’ అన్నారు.

మొన్న రేవంత్ సిరిసిల్లకు వెళ్లి హడావిడి చేసి ఏం సాధించారు? అదే మేం త్వరలో కొడంగల్‌లో సభ పెడతాం చూడండి. ప్రతిపక్షం పెట్టే సభల వైపే జనం చూస్తారు తప్ప, సీఎం సభలను చూడరు కదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మరికొద్ది నెలలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యే తీవ్ర సంక్షోభం రాబోతోందని తలసాని హెచ్చరించారు. ‘విద్యుత్, నీటి సంక్షోభం రాబోతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో 7, 10 గ ంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. మేం సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్‌లు చూస్తే ఈ నిజం అర్ధమవుతోంది. అది కూడా నాణ్యంగా ఉండటం లేదని రైతులే చెబుతున్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం. హైదరాబాద్‌లో కరెంటు పోని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎంత సేపు కరెంటు ఉంటుందనేది వార్త.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సబ్‌స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు తనిఖీలతో హడావిడి చేశారు. నేను సవాల్ చేస్తున్నా. మంత్రి కోమటిరెడ్డి ధైర్యం ఉంటే ఇప్పుడు అవే సబ్‌స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు చూడాలని సవాల్ చేశారు.
ఈ సంక్షోభం తెలిసే రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని విమర్శించారు. ‘సీఎం ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా బాధలు అనుభవించే ప్రజలకు స్థానిక సమస్యలు తెలుసు. కాంగ్రెస్ ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, బాధితుల నిర్ణయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదు కదా? అని ప్రశ్నించారు.

శాసనసభలో నైతిక-రాజకీయ ప్రమాణాలు పడిపోతున్నాయని, తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణ పరిస్థితి ఏనాడూ చూడలేదన్నారు. ‘నేను కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని చూసిన సీనియర్ ఎమ్మెల్యేను. ఏనాడూ ఇంత పక్షపాతంతో సభ నిడిచిన సందర్భాలు లేవు. మొదట్లో మేం సభలో ఏం జరుగుతుంది? ఎలా మాట్లాడాలని నేర్చుకునేందుకు ఆసక్తిగా వెళ్లేవాళ్లం. నారాయణగౌడ్, శ్రీపాదరావు, నర్శిరెడ్డి లాంటి వాళ్లు స్పీకర్ స్థానంలో ఉంటే విపక్షాలకు సైతం ఎక్కువ అవకాశాలిచ్చేవారు. ప్రభుత్వం మాట కూడా వినేవారు కాదు.\

ఇప్పుడు అసలు స్పీకర్ ప్రతిపక్షం వైపే చూడటం లేదు. అప్పట్లో మంత్రులు, ప్రభుత్వంపై పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తే అప్పటి సీఎంలు ఆ వార్త రాసిన జర్నలిస్టుకు స్వయంగా ఫోన్ చేసి, వాటిపై ఆరా తీసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం ఏదీ? పత్రికారంగంలో కూడా పెనుమార్పులొచ్చాయి. అప్పట్లో జర్నలిస్టులకు ప్రభుత్వాలు, పార్టీలు విలువ ఇచ్చేవి. ఇప్పుడు ఆ సంప్రదాయం ఏదీ’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

22ఏ సమస్యలపై నిలదీస్తారన్న భయంతోనే ప్రభుత్వం మమ్మల్ని సమావేశాల వరకూ సస్పెండ్ చేసింది. నిజానికి అది చిన్న సమస్య. దానికే సెషన్ అంతా సస్పెండ్ చేయడం ఏమిటో అర్ధం కాలేదని తలసాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ మమ్మల్ని ఓవైపు సెషన్ అంతా సస్పెండ్ చేసి, మళ్లీ దమ్ముంటే సభలోకి వచ్చి చర్చించాలని సవాల్ చేయడం జోక్. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు మళ్లీ సభలోకి ఎలా వస్తారన్న కనీస విషయ పరిజ్ఞానం కూడా లేదు. అంటే కనీస సంప్రదాయాలు, సభా నియమాలు కూడా తెలియకుండా ప్రభుత్వం సభ నడిపిస్తోందన్నమాట’ అని వ్యాఖ్యానించారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా గెలుపు మాదే. నగరంలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగినవి. వాటికి, రేపటి ఉప ఎన్నికకూ చాలా తేడా ఉంది. అభ్యర్ధిని పార్టీ నిర్ణయిస్తుంది. ఒక ప్రత్యేక వ్యూహంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు వెళతాం అన్నారు.

ఈ ప్రభుత్వంలో జరిగినన్ని అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని తలసాని వాపోయారు. కేసీఆర్ ఫాంహౌస్‌ను ఎంపీలు, ఎమ్మెల్యేలు తనిఖీ చేస్తారట. ఏ అధికారంతో ఆ పనిచేస్తారు? అదేపని మేం కూడా చేయవచ్చు. నిజానికి ఆ పనిచేయాల్సింది ప్రభుత్వ అధికారులు కదా? సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లో స్వయంగా ముసుగువేసుకుని వచ్చిన వ్యక్తులు కేటీఆర్ పీఏపై దాడి చేస్తారు. వారితో సీఐ మాట్లాడతారు. నేనిచ్చిన ఫిర్యాదులో ఒక లైను తీసేయమంటారు. ఒక సీఐ ఫిర్యాదుదారుతో అలా చెప్పవచ్చా? ఏమిటిదంతా? ఎప్పుడైనా ఇంత అన్యాయం చూశామా? అని తలసాని పశ్నించారు.

Total Visitors: 2,855,255