October 3, 2026

నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

  • ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదు..
  • పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.40 వేల విలువైన ఆన్‌లైన్ కోచింగ్ ఉచితం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.40 వేల విలువైన ఆన్‌లైన్ కోచింగ్ యాక్సెస్‌ను ఉచితంగా పి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ కోచింగ్, హాస్టల్ ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నాం. కోచింగ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరించలేక నాణ్యమైన కోచింగ్‌కుదూరమవుతున్నామని తమ గ్రామాలు, పట్టణాల్లోనే ఉంటూ ప్రముఖ కోచింగ్ సంస్థల నుచి శిక్షణ పొందే అవకాశం కల్పించాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు.

వారి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రతిభ ఉన్న యువత ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.

రూ.40 వేల విలువైన కోచింగ్.. ఉచితంగా అందుబాటులోకి

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో మంచి ఆదరణ ఉన్న ఆర్‌.సి. ఎగ్జామ్స్ కోచింగ్ సంస్థకు చెందిన ఆన్‌లైన్ క్లాసులు, మాక్ టెస్టుల యాక్సెస్‌ను పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఇప్పటికే పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనే నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ ఆన్లైన్ కోర్స్ లో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1 ప్రలిమ్స్, గ్రూప్ 2,3,4 , పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రైల్వే, ఇతర అన్ని పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్ , ప్రాక్టీస్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. ఒక సారీ రిజిస్టర్ అయినవారికి సుమారు 5 వేలకు పైగా వీడియో క్లాసులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో 1 సంవత్సరం పాటు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ వేదిక రూపకల్పన

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతంగా అమలు చేసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మంత్రి పొంగులేటికి నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞతలు

తమ విజ్ఞప్తిపై వెంటనే స్పందించి ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు ముందుకొచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరుద్యోగ జేఏసీ నాయకులు వంశీ, చెర్రీ ప్రవీణ్, తేజావత్ ప్రవీణ్, శిరీష కృతజ్ఞతలు తెలిపారు.

Total Visitors: 2,855,250