– “ఆప్ఘనిస్తాన్ టూ ఆంధ్రా..” దుష్ప్రచారం టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
– హెరిటేజ్ వాహనాల్లో ఎర్ర చందనం తరలించిన చరిత్ర ఎవరిది..?
– బాబుకు రాష్ట్రంలో ఆధార్ కార్డు అయినా ఉందా..?
– వైజాగ్ వీరప్పన్ 20 ఏళ్ళు మంత్రిగా పనిచేసి ఉత్తరాంధ్రకు ఏం చేశాడు?
– అయ్యన్నపాత్రుడి గుండె లబ్ డబ్ కు బదులు పెగ్.. అని కొట్టుకుంటుంది
-బాబు భూములు అమ్మితే కమ్మగా ఉంటుందా..? అదే, రాష్ట్ర ప్రయోజనాలకోసం మేం ఏదైనా చేస్తే రంకెలేస్తారా..?
– బాబు హయాంలో 54 ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేస్తే మాట్లాడరా..?
– కోకాపేటలో ఎకరా రూ. 40 కోట్లకు అమ్మితే అబ్బో కేక.. అని ఇదే ఎల్లో మీడియా రాసింది
– విశాఖలో లక్ష ఎకరాల భూముల రికార్డులు గల్లంతై భారీ స్కాం జరిగింది టీడీపీ హయాంలో కాదా?
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వాళ్ల పార్టీ ముఖ్యనేతలు సమావేశంలో ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి , మంత్రుల మీద అడ్డగోలుగా విమర్శలు చేశారు. తన కడుపు మంటను తీర్చుకునేందుకు అడ్డగోలుగా విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి 151 సీట్లు ఇచ్చారు. అప్పటి నుంచే చంద్రబాబు రాష్ట్రంతో పాటు ప్రజల మీద పగపట్టినట్లు కనిపిస్తోంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా అనేక సందర్భాల్లో సభలు, సమావేశాల్లో “నేను వేసిన రోడ్లు మీద మీరు నడుస్తున్నారనే” అహంభావంతో మాట్లాడిన మాటలు చూశాం. రాష్ట్రంలో చంద్రబాబు నియంతలా వ్యవహరించారు. అధికారం పోయింది, ప్రజలు ఆయన్ని ఓ మూల కూర్చోపెట్టారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూశాక చంద్రబాబుకు అర్థం అయింది.
ప్రభుత్వం మీద ఏదో రకంగా విష ప్రచారం చేయాలనే ఉద్దేశంతో దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, దానికి వైయస్సార్ సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , పార్టీ నేతలు, మంత్రులు కారణమనేలా మాట్లాడటం చూస్తున్నాం. ఏది జరిగినా..దానికి ప్రభుత్వం కారణం అన్నట్లుగా ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి, మంత్రులు మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు టీడీపీ ఈ- పేపర్ ను చూస్తే ఆఫ్ఘనిస్తాన్ టూ ఆంధ్రా అని ప్రచురించారు. సీఎం కుటుంబసభ్యుల్ని, మా పార్టీ నేతలకు సంబంధం ఉన్నట్లు అడ్డగోలుగా రాతలు రాసి ప్రచురణ చేశారు. దీనికి సంబంధించి, బాధ్యులైన టీడీపీ, చంద్రబాబు, లోకేష్ తదితరులపై చర్యలు తీసుకోవాలి. మీకు పత్రికలు ఉన్నాయని ఏదైనా ఆరోపణలు చేయడం, అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని చట్టం, ప్రజలు చూస్తూ ఊరుకోరన్నది మీరు గ్రహించాలి.
నిత్యం టీడీపీ పని ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం తాలుకా పెద్దలపై ఏ అభాండం వేయాలి, ఎక్కడ శవ రాజకీయాలు చేయాలి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్వలేదు.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను ఏవిధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో అడ్డగోలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
హెరిటేజ్ వాహనాల్లో ఎర్ర చందనం తరలించిన చరిత్ర ఎవరిది? స్మగ్లింగ్‌లు, గంజాయి మాఫియా, ల్యాండ్ మాఫియా కలిగిన నేర చరిత్ర ఉన్నవాళ్లను చంద్రబాబు తన చంకలో పెట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడమా? వారికి ప్రభుత్వానికి విమర్శించే హక్కు లేదు.
తిరుపతి రైల్వేస్టేషన్‌లో జేబులు కొట్టేవ్యక్తి ఒకరు ఉండేవాళ్లని గతంలో నాదేండ్ల భాస్కరరావు చెప్పేవాళ్లు. అలాంటి వ్యక్తిని కరకట్ట దగ్గర నివాసం ఉంటున్న వ్యక్తితో పోల్చితే ఊరుకుంటారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడటంలేదు. కనీసం ఆయనకు ఇక్కడ ఆధార్ కార్డు అయినా ఉందా? ఉండేది హైదరాబాద్‌లో వ్యాపారాలు అక్కడే. ఎన్నికలు ఇక్కడ జరిగితే సమీక్షలేమో అక్కడ నుంచా? వారి గురించి ఏమనుకుంటున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు ఏదిపడితే అది మాట్లాడటం సరికాదు.
ఇవాళ మళ్లీ వైజాగ్ వీరప్పన్ మాట్లాడాడు. రాష్ట్ర ప్రభుత్వం మీద, విశాఖపట్నానికి సంబంధించి భూములు మీద మాట్లాడాడు. దాదాపు 20 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన ఆయన విశాఖకు, ఉత్తరాంధ్రకు ఏమైనా చేశారా? టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన వీరప్పన్ ఏం చేశారో చెబితే బాగుంటుంది.
మా గుండెల మీద చేయి వేసుకుంటే లబ్‌డబ్ మంటుంది. అదే అయ్యన్నపాత్రుడు తన గుండె మీద చేయి వేసుకుంటే పెగ్గు.. పెగ్గు అంటూ ఉంటుంది. అదే పనిగా తాగుతూ… ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రిని, మంత్రులను తిడతాడు. ఇవాళ మళ్లీ కూర్చుని నీతి వ్యాఖ్యాలు చెప్పడమా? గతంలో ఆయన మీద కాస్తో, కూస్తో గౌరవం ఉండేది. మీ రాజకీయ అవసరాల కోసం మీ సోదరుడిని పాలేరుగా వాడుకున్నావ్. నువ్వా మామీద విమర్శలు చేసేది.
విశాఖపట్నంలోని ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేస్తున్నారని గగ్గోలు పెట్టడమా? చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని భూములు అమ్మారో చెప్పాలి. ఆయన ఏం చేసినా మీకు కమ్మగా ఉంటుంది. పక్క రాష్ట్రం తెలంగాణలోని కోకాపేట లో ప్రభుత్వ భూములు ఎకరం రూ.40 కోట్లకు అమ్మితే అబ్బో.. కేక అంటూ.. హెడ్డింగ్‌లు పెట్టి వార్తలు రాస్తారు. అదే ఏపీకి వస్తే మాత్రం ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారంటూ దుమ్మెత్తిపోయడమా?
కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా… ప్రజల్ని ఆదుకోవాలనే తపనతో కరోనా లాంటి కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్షా పదివేల కోట్ల రూపాయలను ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకే జమచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అయినా ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు.
కరోనా కష్టకాలంలో ..ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పని స్థితిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రూపాయికో, బేడకో కోట్లాది రూపాయిల భూములను అమ్మలేదే? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనకున్న వనరుల్ని ఉపయోగించు కోవడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజల అభివృద్ధి కోసమే.
విజయసాయి రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల ఎకరాల భూములను కాపాడాం. 2015లో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ జరిగింది టీడీపీ హయాంలో కాదా? తప్పులు మీరు చేసి… నెపాన్ని మా మీద వేయాలని చూస్తారా? గత ఎన్నికల్లో చంద్రబాబును జాకీల పెట్టి లేపినా.. 23సీట్లు వచ్చాయి. ఇలాంటి వ్యక్తులు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడే అర్హత ఉందా? విశాఖ రైల్వే జోన్ గురించి మీ హయాంలో ఏం చేశారు? బుర్ర పనిచేయక, తాగింది దిగకో ప్రభుత్వంపై విమర్శలా?
రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, వైయస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేసే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. వారానికి ఒకసారి చంద్రబాబునాయుడు మీడియాలో కనిపిస్తే, మిగతా టీడీపీ నేతలు కనిపించకుండా ఉండటం చూస్తే వారంతా హెరాయిన్ తీసుకుని నిద్రపోతున్నారేమో. -మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతే కానీ దేశంలో ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ప్రభుత్వానికి, వైయస్సార్ సీపీ నేతలకు ముడిపెట్టడం సరికాదు.