Suryaa.co.in

Editorial Entertainment

నిజం..ఆయనకు దాసరి కలలోకొచ్చారు!

– విష్ణు ప్యానల్‌ను సమర్ధిస్తున్నానన్నారు
– హీరోలూ.. నాకు ఓ గంట కేటాయించండి
– ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేద్దాం
– నటుడు, న్యాయవాది సీవీఎల్ వీడియో వైరల్
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీవీఎల్ తెలుసుకదా? చయనం వెంకట లక్ష్మీ నరసింహారావు అనే‘ సీవీఎల్’ పేరు ఇంకా గుర్తుకు రాకపోతే… భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు తెలుసుగా.. ఎస్. ఆయనే! కానీ ఆయన భార్యాబాధితుడు కాదనుకోండి. అది వేరే విషయం. నిజానికి సీవీఎల్ పేరొందిన క్రిమినల్ లాయర్. సినిమా వాళ్ల కేసులు దాదాపు ఆయనే టేకప్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పే రాజీలు, లోక్‌అదాలత్ వంటివన్నీ ఆయన కొన్నేళ్ల క్రితం తన ‘రక్ష’ సంస్థ పక్షాన చెప్పినవే. కాకపోతే ప్రభుత్వాలు వాటిని ఇప్పుడు అమలు చేస్తున్నాయంతే.
సీవీఎల్ ఒక్క నిమిషం ఖాళీగా ఉండరు. ఆయన క్లైయింట్లను డీల్ చేసే స్టైల్ చాలా గమ్మతుగా ఉంటుంది. సీరియస్‌గానే హాస్యం పండిస్తారు. హాస్యం నుంచే సీరియస్‌కు వెళుతుంటారు. ఓసారి ఓ క్లైంట్ అమెరికా నుంచి ఫోన్ చేశారు. సమస్య చెప్పారు. ఫలానా ఆయన రిఫర్ చేశారని చెప్పాడు. ఓకె. మీరు కన్సల్టెన్సీ కింద 5 వేలు గూగుల్ పే చేయమన్నారు. అప్పుడా అమెరికా వ్యక్తి అదోరకంగా నవ్వాడు. దానితో సీవీఎల్ కూడా అంతే నవ్వుతూ ‘మీరు నవ్వారు కాబట్టి పదివేలు పంపించండి. ఐదు వేలు పెనాల్టీ. పంపించి, నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి,సాయంత్రం మాట్లాడదాం’ అని కూల్‌గా ఫోన్ పెట్టేశారు. అదీ ఆయన స్టైల్.
సామాజిక స్పృహ ఉన్న కొద్దిమంది లాయర్లలో ఆయనొకరు. సొసైటీకి ఏదో చేయాలన్న తాపత్రయం. అన్నట్లు ఆయన భార్య అనూరాధ. ఆమె కూడా న్యాయవాది. జీవిత నిర్వహించే ‘బతుకు జట్కాబండి’లో బాధితులకు న్యాయసలహాలిచ్చారు. ఆమె కూడా ఆయనకు తగ్గట్లే స్పాంటేనియస్‌గా జోకులేస్తుంటారు. భార్యాబాధితుల సంఘాన్ని ఆమె తన భర్తతో కలసి ప్రారంభించడం మరో విశేషం. చివరాఖరకు ఫ్రెండ్స్,బంధువుల నుంచి ఆమెకు బోలెడు ఫోన్లు. ఏమిటీ.. మీ ఆయనను వేధిస్తున్నారా అని! పిల్లలకూ అవే బాధలు. ఏమిటీ మీ నాన్న భార్యాబాధితుడా అని! దీంతో ఓ ఫైన్ మార్నింగ్ ఆ భార్యాభర్తలిద్దరూ ప్రెస్‌మీట్ పెట్టి, మేమిద్దం హ్యాపీగానే ఉన్నాం. ఇది కేవలం భార్యాబాధితులయిన భర్తల సమస్యల పరిష్కారానికి వేదిక మాత్రమే. మహిళలు చెప్పుకునేందుకు మహిళా సంఘాలున్నాయి. మరి మగవారికి ఎవరున్నారు? అందుకే భార్యాబాధితుల సంఘం పెట్టామని అనౌన్సు చేయడంతో, ఆ గొడవకు తెరపడింది.
అలాంటి సీవీఎల్ మంచి నటుడు. దూరదర్శన్ కాలం నుంచీ ‘ వేషాలు వేస్తుండేవారు’. తర్వాత సీరియల్స్, ఆ తర్వాత సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు పాత్రలు వేస్తున్నారు. గతంలో ‘మా’ ఎన్నికలకు ఆయనే ఎలక్షన్ ఆఫీసర్. ఇప్పుడు రసవత్తరంగా మారిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. గత కొద్దిరోజుల క్రితం.. తెలంగాణ-ఆంధ్రాకు సెపరేట్ ‘మా’ ఏర్పాటుచేసుకోవాలని, ఆంధ్రా హీరోలు ఏపీలో ‘మా’ ఏర్పాటుచేసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కూడా మద్దతునిచ్చారు.
ఇలా ఎప్పుడూ సంచలనాలు సృష్టించే సీవీఎల్.. ఇప్పుడూ అలాంటి పనే చేసి, అందరినీ తనవైపు మళ్లించుకునేలా చేశారు. అదేంటమిటంటే.. చాలాకాలం క్రితమే మృతి చెందిన దాసరి నారాయణరావు ఆయన కలలోకొచ్చారట. నిజం. ఇది ఆయనే చాలా సీరియస్‌గా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అలాగని దాసరి ఏమైనా ఆయనకు బాగా పరిచయమా అంటే అదీ కాదట. జస్ట్ ఓ రెండుసార్లు కలిశారట. అలాంటి దాసరి సీవీఎల్ కలలోకి వచ్చి, మా ఎన్నికల గొడవపై మాట్లాడారట. ‘నా సంగతి పక్కనపెట్టు. ఈ సమస్య పరిష్కారానికి నువ్వేం చేస్తున్నావోయ్ సీవీఎల్లూ’.. అని వాకబు చేస్తే, ‘నా ప్రయత్నం నేను చేస్తున్నా సార్’ అని ఆయన దాసరికి చెప్పారట. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.ఇంతకూ ఆ వీడియో ముచ్చట ఇదీ..
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. దాసరిగారు నాకు కలలోకి వచ్చారు. అందరికీ ఇది కాస్త వెటకారంగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న రాముడు, ఇవాళ దాసరా? అని. కానీ ఆయనని మరచిపోలేం. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ, ఒకటి రెండు సార్లు మాత్రం కలిశాను. అప్పట్లో ఏవీఎస్‌గారితో కలిసి ఆయన దగ్గరకు ఓ సమస్యను తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయనలేని లోటు

సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని నాకనిపించింది. ఆయనతో ఏంటండీ ఇదంతా అని అడిగాను(కలలో). అందుకు దాసరిగారు.. ‘మీరంతా నేను ఉన్నానని అంటుంటారుగా? మీరంతా ఏం చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడు, గురువును మించిన శిష్యుడు అంటుంటారుగా? మోహన్ బాబు నన్ను తనయుడిగా అనుకున్నాడు. నేను అతన్ని కొడుకుగా, శిష్యుడిగా భావించాను. నా కొడుకు కొడుకు విష్ణు ఉన్నాడు. ఆయనని గెలిపించమని చెప్పడం లేదు.. కానీ నేను మోహన్ బాబుకి నేర్పిన సంస్కారం, ఆయన వాళ్లబ్బాయికి నేర్పిన సంస్కారం తెలియంది కాదు. ఆ సంస్కారం వల్లే కదా.. పెద్దవాళ్లందరూ కలిసి తప్పుకోమంటే తప్పుకుంటానని అంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. మీ వ్యవహారం ఏంటి?’ అని అడిగారు. దీనికి నేను.. పెద్దవారందరినీ కూర్చోబెట్టి యునానిమస్‌గా చేయడానికి నా దగ్గర వాళ్లందరి నెంబర్లు లేవు సార్.. అని చెప్పా. అయితే మీరు చేసేది మీరు చేయండి.. నేను చేసేది నేను చేస్తానని దాసరిగారు అన్నారు.
ఇక అది దాసరిగారు చూసుకుంటారు కాబట్టి.. మీడియా సమక్షంలో కృష్ణగారు, కృష్ణంరాజుగారు, విజయ్ చందర్‌గారు, బాలకృష్ణగారు, గిరిబాబుగారు.. ఇండస్ట్రీలో ఫ్యామిలీలో అంటుంటారుగా.. ఆ ఫ్యామిలీలకు చెందిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. మొత్తంగా పెద్దలందరిని ఒక చోట కూర్చోబెట్టి దీని గురించి మాట్లాడేందుకు ఒక గంట కేటాయించమని కోరుతున్నాను. ఇంకా ఎన్నికలకు టైమ్ ఉంది కాబట్టి.. మీడియా ముఖంగా, మా సభ్యులందరూ టైమ్ కేటాయిస్తే పెద్దలను ఓ అరగంటో, గంటో టైమ్ కేటాయించేలా చేసి ఈ సమస్యను పరిష్కరించాలనేది నా ప్రయత్నం. ఇది ట్విస్ట్ అనుకుంటారో.. ఇంకా ఏమైనా అనుకుంటారో తెలియదు కానీ.. ఇది నా మొదటి ప్రయత్నం’’అన్నారు.ఇవీ.. దాసరి- సీవీఎల్ కలల ముచ్చట్లు.

LEAVE A RESPONSE