– అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణకు డిమాండ్
– బినామీ భాస్కర్‌రెడ్డి ఆస్తులు తేల్చాలన్న జనసేన
– అమెరికా ట్రిప్పులు, జల్సాలకు డబ్బెక్కడిదన్న జనసేన
– మైనింగ్ లారీలు జిల్లాలు దాటిపోతున్న వైనంపై సీబీఐ, ఐటీకి జనసేన ఫిర్యాదు?
– ఎన్ని మైనింగ్, క్వారీలను స్వాధీనం చేసుకున్నారన్న వివరాలు ఇచ్చిన జనసేన?
– మైనింగ్, పోలీసు అధికారుల సంబంధాలపై ప్రత్యేక వివరణ ఇచ్చిన జనసేన?
– మైనింగ్- క్వారీ యజమానుల అడ్వాన్సులపై సమాచారం?
– చేతులు తడిపినా విజిలెన్స్ అధికారులు లారీలు పట్టుకుంటున్నారన్న ఆందోళన
– అచ్యుతాపురం ,ఒంగోలు లేఔట్లపై విచారణకు ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలి
-బాలినేనిపై యుద్ధంలో వెనుకబడిన తెలుగుదేశం
– యంత్రాంగం లేకపోయినా జనసేన ఒంటరి పోరు
– టీడీపీ మౌనంలో మతలబేమిటి?
-బాలినేనిని వెంటాడుతున్న జనసేన
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగన్ సమీపబంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలన్న డిమాండ్‌తో, జనసేన ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నికల అఫిడవిట్‌లో కేవలం ఐదు కోట్ల ఆస్తులు చూపించిన బాలినేని, అంత విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారో సీబీఐ తేల్చాలని జనసేన పట్టుపడుతోంది. అమెరికాకు ప్రత్యేక విమానంలో ఎలా వెళ్లారని, ఇటీవల జిల్లాలో కోట్లాది రూపాయలతో కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో సీబీఐ నిగ్గులేల్చాలని జనసేన డిమాండ్ చేస్తోంది.
బాలినేని బినామీ భాస్కర్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు కన్నేయడం లేదని జనసేన నిలదీసింది. దీనితో బాలినేని శిబిరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రకాశంజిల్లాలో అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న బాలినేనిని.. జనసేన నిలబడి, నిలదీస్తున్న ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.
ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిపై జనసేన ఫోకస్ పెంచింది. ఆయన అక్రమాస్తులపై దృష్టి సారించిన జనసేన, ఆ మేరకు వాటిని ఆదాయపన్ను, సీబీఐ వంటి అత్యున్నత విచారణ సంస్థల దృష్టికి తీసుకువెళ్లే పనిలో ఉంది. ప్రకాశం జిల్లాలో పార్టీ యంత్రాంగం, బలమైన నేతలున్న టీడీపీ కూడా.. ఈ విషయంలో పడకేసింది.
మాజీమంత్రి బాలినేని వ్యవహారాలను బయటపెట్టే అంశంలో… టీడీపీ వెనుకబడిపోగా, పెద్దగా యంత్రాంగం లేని జనసేన మాత్రం.. బాలినేని ఆస్తుల వ్యవహారంలో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం విశేషం. బాలినేని బినామీల చరిత్ర, మైనింగ్‌ను జిల్లాలు దాటించడంలో వస్తున్న ఆదాయం తదితర అంశాలపై .. జనసేన ఈపాటికే సీబీఐ, ఆదాయపన్ను శాఖలకు ఫిర్యాదు చేసినట్లు జనసేన వర్గాల సమాచారం.
ప్రధానంగా.. గత నాలుగేళ్ల నుంచి బాలినేని ఎన్ని మైనింగ్, క్వారీలను బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నదీ.. దానిలో ఆయనకు వస్తున్న ఆదాయం? ఏయే మార్గాల్లో మైనింగ్ జిల్లా దాటుతోంది? అందుకు సహకరిస్తున్న అధికారుల పేర్లను జనసేన సీబీఐ-ఐటీ శాఖకు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా విజయవాడ వెళ్లి ఎవరెవరు బాలినేనిని కలుస్తున్నారు? ఆయన సమీప బంధువు ఏయే సందర్భాల్లో జోక్యం చేసుకుంటున్నారు? మైనింగ్-క్వారీ యాజమాన్యాలు ఎవరి ద్వారా చేతులు తడిపారు? పెద్ద మొత్తంలో చేతులు తడిపినా, విజిలెన్స్ అధికారులు తమ లారీలు పట్టుకుంటున్నారని ఎవరికి మొర పెట్టుకుంటున్నారు? అన్న కీలక అంశాలను జనసేన నేతలు.. ఐటి, సీబీఐకి సోదాహరణగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రకాశం జిల్లా టీడీపీ నాయకత్వం వెనుకబడిపోయిందన్న వ్యాఖ్యలు, జిల్లా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
మొత్తం ఆస్తి అయిదు కోట్లే… ప్రతి ఏటా ఖర్చులు ఏమో పదులకోట్లలో… ఇది ఎలా సాధ్యం బాలినేని గారు?
బాలినేని సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి మూడు కోట్ల రూపాయలు. ఆయన సతీమణి ఆస్తి మరో రెండు కోట్లు. మొత్తం ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న బాలినేనికి నెలవారీ వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఏమీ లేదు. ఆయన పూర్తి సమయం పొలిటీషియన్. వ్యాపారాలు ఏమీ లేవు. అయినా ఆయన ఖర్చులు మాత్రం కోట్ల రూపాయల్లోనే. రెండు, మూడు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేసి ఏటా ఆయన తన మనవడి జన్మదినోత్సవాన్ని వైభవంగా జరుపుతారు.
ఆయన జన్మదిన వేడుకలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు తోనే. ఈ ఏడాది ఆ వేడుకలు గోవాలో జరిగాయి.ఇటీవల ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. అంతకుముందు అత్యంత విలాసవంతమైన విదేశీయానాలకు ప్రత్యేక విమానంలో స్నేహితులతో వెళ్లి వచ్చారు. అమెరికా ట్రిప్ కి రెడీ అవుతున్నారు. ఇవేవీ అధికారికం కాదు. సొంత ఖర్చులతో జరిగేవి. వీటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో బాలినేని గారు చెప్పగలరా.
వీటన్నింటికీ మించి జూదం తన వ్యసనమని ఆయన బహిరంగంగానే అంగీకరిస్తారు. అందుకోసం ఆయన కోట్ల రూపాయల్ని కేటాయిస్తారని ఒంగోలు వాసులకే కాదు, రాష్ట్ర రాజకీయ నాయకులు అందరికీ తెలిసిందే. ఏ వ్యాపారం లేని నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయి.? దీనిపైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు.
బినామీ భాస్కర్ రెడ్డి లావాదేవీలపై ఐటీ దృష్టి సారించాల్సిందే
భాస్కర్ రెడ్డి పెద్దగా చేసే వ్యాపారాలు ఏమి కనిపించకపోయినా.. ఆయన కొద్ది సంవత్సరాలలో వేయి కోట్లకు పైగా లావాదేవీలను, అధికారికంగానే చూపించారు. విశాఖ దసపల్ల కొండపై ఆయన 60 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించారు. అచ్చుతాపురం లేఔట్లో కొంత భాగాన్ని 2019 ఎన్నికలకు ముందు తాను స్లీపింగ్ పార్టనర్ గా వున్న ఆండ్రూ మినరల్స్ కు 50 కోట్ల రూపాయలకు విక్రయించి నట్లు చూపించి, అవే భూములను ఈ ఏడాది మార్చిలో తిరిగి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది కేవలం మనీ లాండరింగ్ కోసమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ బృందం తెలంగాణ రాష్ట్రం చిలుకూరులో 111 జీవో పరిధిలోకి వచ్చే 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన 1150 గజాల గృహ నిర్మాణ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ కొనుగోళ్లు, అక్రమ లావాదేవీలు అన్నిటి పైన విచారణ జరపాలని ఆదాయ పన్ను శాఖను మరో మారి కోరుతున్నాం. ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అమరావతి నుంచి మంత్రి బాధ్యతలు నిర్వహించగా, ఆ సమయంలో కొంతకాలం విశాఖ నుంచి వియ్యంకుడు అయిన భాస్కర్ రెడ్డి, అక్రమ లావాదేవీల కోసం కాలుష్య నియంత్రణ మండలి కి చెందిన సొంత సామాజిక వర్గ అధికారి ఒకరు ఓఎస్డి గా విశాఖ లో పని చేశారు.
విశాఖలో నిర్మిస్తున్న ఇంటి సెల్లార్లో ప్రతిరోజు బాలినేని కి సంబంధించిన విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో భాస్కర్ రెడ్డి సమావేశాలు , సమీక్షలు జరిపి సెటిల్మెంట్లు చేసేవారు. వీటన్నిటి కారణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ , బాలినేని ని మంత్రి పదవి నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ అధికార పార్టీలో బాలినేని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
సవాలుకు సిద్ధం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్వేచ్ఛనిచ్చి విచారణకు ఆదేశించాలి
బాలినేని, ఆయన వియ్యంకుడు సవాల్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలినేని ఆయన బినామీ భాస్కర్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం.
అచ్యుతాపురం ,ఒంగోలు లేఔట్లపై విచారణకు ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలి. ఇందులో కబ్జాలు ,అక్రమాలకు పలు శాఖలతో సంబంధం వున్నందున వారందరితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి , వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి.
భాస్కర్ రెడ్డి, బాలినేని సవాల్ ను స్వీకరించి ఇందులో అక్రమాలు ఉంటే జగనన్న కాలనీలుగా మార్చి , పేదలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదాయం పన్ను శాఖ కూడా అక్రమ ఆర్థిక లావాదేవీలు మనీ లాండరింగ్ పై విచారణ జరపాలి.