దేశానికి విద్యుత్ సంక్షోభం ముప్పు ముంచుకొస్తోంది. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఆ బొగ్గు కొరత వెంటాడుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో బఫర్ స్టోరేజీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఒక్కటి రెండ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
బొగ్గు ఉత్పత్తి, సరఫరాలోనూ సమస్యలు ఉన్న నేపథ్యంలో దేశంలో ఈ థర్మల్ ఉత్పత్తి మీద ఆధారపడిన ప్రాంతాలన్నీ చీకట్లు అలుముకునే ముప్పు కనిపిస్తోంది. కరోనా రెండో వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో అంటే దాదాపు నలభై శాతం పెరిగాయి. ఈ ప్రభావం భారత్‌పైనా పడుతోంది. పారిశ్రామిక, గృహ అవసరాల కోసం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది.
బొగ్గు నిల్వలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నా.. సాధ్యపడడం లేదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. గడిచిన కొన్నాళ్లుగా విద్యుత్ ప్లాంట్స్‌లో బొగ్గు బఫర్ స్టాక్‌ను ఐదారు నెలలకు సరిపడా పెంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మూడ్రోజులకు మించి స్టాక్ పెట్టలేకపోతున్నామని ఆయన తెలిపారు.
దేశంలో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విద్యుత్తుకు అనూహ్యంగా డిమాండ్ పెరగడం, భారీ వర్షాలు, దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరగడం, వర్షాకాలానికి ముందు తగిన స్థాయిలో బొగ్గును నిల్వ చేసుకోకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితి వచ్చిందని విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్ పవర్ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉండగా, 108 చోట్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. అసలు దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70 శాతం. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి.
అంటే 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలోని నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. 18 ప్లాంట్లు రెండు రోజుల్లోనూ, 19 ప్లాంట్లు 3 రోజుల్లోనూ, 9 ప్లాంట్లు నాలుగు రోజుల్లోనూ, 6 ప్లాంట్లు 5 రోజుల్లోనూ, 10 ప్లాంట్లు ఆరు రోజుల్లోనూ, ఒక ప్లాంటు ఏడు రోజుల్లోనూ బొగ్గు సరఫరా జరగకపోతే మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ మూతపడితే దేశవ్యాప్తంగా 1,36,159 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది.
ఇక దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా ప్రపంచ బొగ్గు ధరల్లో పెరుగుదల కారణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిపై తాము ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో టాప్–2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే మన దేశం అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయం. అదే జరిగితే విద్యుత్‌తో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. బొగ్గు ఉత్పత్తిని కనీసం 10–18 శాతానికి పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది.
దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విద్యుత్ సంక్షోభం నివారణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు.విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు, గ్యాస్ సరఫరా అందిచాలని కోరుతున్నారు. విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓపెన్ మార్కెట్లో యూనిట్ ధర రూ.20 చొప్పున పెట్టి కొనాల్సి వస్తోందని, దీనిపై నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
విద్యుదుత్పత్తి ప్లాంట్లలో బొగ్గు కొరత గురించి ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ స్పందించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల ఉప సంఘం వారానికి రెండుసార్లు బొగ్గు నిల్వల పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది.
దేశంలో తలెత్తిన బొగ్గు కొరతతో ఉత్తరప్రదేశ్‌లోని 8 విద్యుత్ ప్లాంట్లు, ఇతర కారణాలతో మరో 6 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో యూపీలో తాత్కాలికంగా మూతపడిన విద్యుత్ ప్లాంట్ల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 20,000 నుంచి 21,000 మెగావాట్లు ఉండగా, సరఫరా 17,000 మెగావాట్లు ఉంది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు గంటల విద్యుత్ కోత విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
source:nijamtoday.com