Home » హిందువులు పెళ్లి కోసం మతం మారడం తప్పు: మోహన్ భగవత్

హిందువులు పెళ్లి కోసం మతం మారడం తప్పు: మోహన్ భగవత్

వివాహం కోసం ఇతర మతాలకు మారుతున్న హిందువులు తప్పు చేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ హెచ్చరించారు. చిన్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఇది జరుగుతోందని చెబుతూ హిందూ కుటుంబాలు తమ పిల్లలకు ఒకరి మతం, సంప్రదాయాల కోసం గర్వించదగిన విలువలను ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“కైసే మతంతరాన్ హోతా హై? అప్నే దేశ్ కే లడ్కే, లడ్కియన్ దుస్రే మాతోన్ మే కైసే చాలీ జాతి హై? ఛోటే ఛోటే స్వర్థాన్ కే కరణ్. వివా కర్నే కే లియే. కర్నే వాలే గలాత్ హై వో బాత్ అలాగ్ హై. లేకిన్ హమారే బచ్చే హమ్ నహీ తయ్యార్ కార్టే? (మతమార్పిడి ఎలా జరుగుతుంది? మన అమ్మాయిలు, అబ్బాయిలు ఇతర మతాన్ని ఎలా స్వీకరిస్తారు? చిన్న స్వార్థ ప్రయోజనాల కోసం, వివాహం కోసం. ఆ విధంగా తప్పు చేయడం మరొక విషయం. కానీ మనం మన పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దుతున్నామా?” అని భగవత్ ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వానీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, వారి కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ “మన ఇంట్లో మనం మన పిల్లలకు విలువలను నేర్పాలి. మనలో, మన మతం, మన ప్రార్థన, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించాలి. ప్రశ్నలు ఉంటే, వాటికి సమాధానమివ్వండి, గందరగోళానికి గురికావద్దు” అంటూ మార్గదర్శనం చేశారు.
భారతీయ కుటుంబ విలువలు, వాటిని సంరక్షించడం గురించి భగవత్ సుదీర్ఘంగా మాట్లాడుతూ చాలా ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పురుషులు మాత్రమే కనిపిస్తారనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. “ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం. కానీ మనం ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను నిర్వహించినప్పుడు కేవలం పురుషులను మాత్రమే చూస్తున్నాము. ఇప్పుడు మనం మొత్తం సమాజాన్ని సంఘటిత పరచాలి అనుకొంటే, అందులో సగం మంది మహిళలు ఉన్నారని గుర్తించాలి” అని ఆయన మార్గదర్శనం చేశారు.
భారతీయులు ఎల్లప్పుడూ తమ సంపదను ఇతరులతో పంచుకునేవారని భగవత్ చెప్పారు. మొఘలులు వచ్చే వరకు భారతదేశంలో చాలా సంపద ఉందని ఆయన గుర్తు చేశారు. 1 వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు – దేశంలో మొఘల్ దోపిడీ ప్రారంభానికి ముందు – భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత సంపన్న దేశం. అందుకే దీనిని బంగారు పక్షి అని పిలిచేవారని వివరించారు.
ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై తమ పిల్లలు ఏమి చూస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. “ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లు అన్ని రకాల విషయాలను చూపుతాయి. మీడియాలో వచ్చేవి పిల్లలకు, మన విలువ వ్యవస్థకు ఏది మేలు చేస్తుందనే దృక్పథంతో కాదు. మన పిల్లలకు ఇంట్లో ఏమి చూడాలి, ఏమి చేయకూడదో నేర్పించాలి ” అని భగవత్ సూచించారు.
భారతీయ కుటుంబ వ్యవస్థలోని సద్గుణాలను ప్రశంసిస్తూ, పశ్చిమ దేశాలు భారతీయ కుటుంబ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నాయని భగవత్ చెప్పారు. కానీ ఈ విలువలను నాశనం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. “ప్రజలను బానిసలుగా ఉంచడానికి, పశ్చిమ దేశాలు చైనాకు నల్లమందు పంపాయి. యువత నల్లమందుకి అలవాటు పడింది. తరువాత పశ్చిమ దేశాలు చైనాను పాలించాయి” అని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు మన దేశంలో కూడా ఇదే జరుగుతోందని డా. భగవత్ హెచ్చరించారు. నేడు దేశంలో డ్రగ్ కేసులు, ఈ డ్రగ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయో చూసినప్పుడు అది ఎక్కడ నుండి, ఎందుకు వస్తుందో మీకు తెలుస్తుందని ఆయన చెప్పారు. అట్లాగే తద్వారా వాటి నుండి ఎవరు ప్రయోజనం పొందుతున్నారో కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.

Leave a Reply