Suryaa.co.in

Features

అంతరంగ దృక్పథం

( సునీతశేఖర్)
“మనల్ని ఆవేశంతో కుదిపేసే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సరిగ్గా గుర్తుపట్టాలే కానీ, ఆహ్లాదం పంచేవి కూడా చాలానే ఉంటాయి. లోపలికి చూసుకునేవాడికి బయట కూడా ఆనందమే ఉంటుంది. లోపల ప్రశాంతత లేకపోతే బయటి వస్తువులేవీ మనకు దానిని తెచ్చిపెట్టలేవు. సంతృప్తిని మించినది లేదని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.”
జీవితంలో ఆటుపోట్లు అతిసహజం. పరిస్థితులు, సంఘటనలు ఊహించినట్లుగా వుండవు. మనకు జరిగే మంచిగానీ, చెడు గానీ ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం కోరుకున్నా ఇంకోలా జరగడం వుండదు. ప్రతి సందర్భంలో దానికి సరిపోయే ఒక అంతరంగ దృక్పధం మనలో ఉండనే ఉంటుంది.
పైపైన మాత్రమే ఆలోచిస్తున్నప్పుడు, అంతరంగ దృక్పథమన్నది ఒకటుంటుందని అవగాహనలోకి రాదు. బాహ్యప్రభావాల ఆటుపోట్లకు గురవుతూఉంటాం. మనం కలిసే వ్యక్తిని బట్టి మన భావాలు వుంటాయి. మనం అంతరంగంలోకి చూసుకోవడానికి అలవాటు పడకపోవడం వల్లనే ఇతరుల ప్రభావంలో పడతాం. దీని నుండి తప్పించుకోవాలంటే ఎక్కువగా అంతరంగంలోకి పయనించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే బయటిశక్తులకు ఆధీనం కాకుండా, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతాం.
ఉదాహరణకు ఎవరైనా కోపగించుకున్నపుడు ఆ ప్రకంపనలో తగులుకోకూడదు. ఏదైనా తొందరగా చేయవలసి వచ్చినా ఒకింత తమాయించుకుని అంతరంగంలోకి అడుగు వేస్తే, అద్భుతంగా సఫలమవుతాం.
జీవితంలోని సకల కార్యకలాపాల ప్రభావం వ్యక్తి చైతన్యం మీద ఉంటుంది. ఈ విషయాన్ని వ్యక్తి ఏదో ఒక దశలో గ్రహించకపోడు. విషయాలు వాటికవి మంచివిగానో, చెడ్డవిగానో ఉండవు. వాటితో మనకున్న అనుబంధాన్ని బట్టి అలా ఉంటాయి. వీటిపై మనకున్న దృక్పధానికి అనుగుణంగా వాటి ప్రభావం మనపై ఉంటుంది. ఒకే విషయాన్ని దైవకృపతో లభించినదిగా భగవత్ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనం ఇంకా చైతన్యవంతంగా, నిజాయితీగా ఉండటానికి అది సహకరిస్తుంది. “ఒక వ్యక్తి సరియైన దృక్పధంతో, ఉన్నత సంకల్పాలతో ఉండటం వందలమందిని ఉపద్రవాల నుంచి రక్షించగలదు. సంఘర్షించే ప్రపంచం అలాగే వదిలివేయబడినా, ఒక వ్యక్తి సాధించే పరిపూర్ణత ప్రపంచాన్ని రక్షించగలదు” అంటారు ‘సావిత్రి’ లో శ్రీ అరవిందులు.
దైవకృపమీద పూర్తి విశ్వాసమున్నపుడు ప్రతి అడుగులో దైవం మనతో సరియైన పనినే చేయిస్తాడని తెలుసుకుంటాం. కానీ ఇలా జరగాలంటే మనలో ఏ ఇతర చలనాలచేత ఖండించబడని విశ్వాసం… మన అస్తిత్వమంతా పరివ్యాప్తమై ఉండాలి. అప్పుడు మనలోని సమస్త భయాల నుండి, విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి దైవకృప రక్షణకవచంలా పనిచేస్తుంది.
మనం ఎంత పురోగతి చెందితే అంత జాగరూకతతో ఉండాలి. అంతరంగంలో ప్రసన్నతను పెంచుకోగలిగినపుడు అది నిత్యసంతోషానికి దారితీస్తుంది. దీనిని మనలో నిలుపుకోగలిగితే ఆ వెలుగులో పురోభివృద్ధికి ప్రతిబంధకమయ్యే దుష్ప్రభావాలతో పోరాడే శక్తి అధికమవుతుంది. వీటితో ఒక తల్లి – ఇంటిని ఆనందదాయకం చేస్తుంది. ఒక వైద్యుడు – రోగులు త్వరగా కోలుకునేట్లు చేస్తాడు. ఒకయజమాని – తన సేవకుల పనిని తేలికపరుస్తాడు. ఒక కార్మికుడు – తన తోటి కార్మికుల సౌహార్ద్రతకు స్ఫూర్తిదాయకమవుతాడు. సుదూర ప్రయాసభరిత ప్రయాణంలో ఒక ప్రయాణికుడు – తన తోటి ప్రయాణీకులకు సహాయకారి అవుతాడు.
అసంతృప్తితో గొణగటం వల్ల అన్నిరకాల శక్తులు మనలోకి ప్రవేశించి క్రిందకు లాగుతాయి. సహనశక్తి లేకపోతే ఉత్కృష్టమైనదేదీ సాధ్యపడదు. ఒక గొప్ప కార్యం సాధించాలంటే సహించవలసినదంతా సహించాలి. “మనలో అంతరంగ దృక్పధాన్ని పెంచుకోవాలంటే దైవకృప మీద విశ్వాసం కలిగి వుండాలి.” ఇతర బలహీనతలు తలెత్తినపుడల్లా ఒక అడుగు వెనక్కు వేసి అంతరంగ ప్రశాంతత వైపు దృష్టి మరల్చాలి.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE