– మహాపాదయాత్రకు తులసిరెడ్డి సంపూర్ణ సంఘీభావం
– పెట్రోలు, డీజల్ ధరలు బారెడు పెంపు – బెత్తెడు తగ్గింపు
– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి
విజయవాడ : ‘‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. అదీ అమరావతి మాత్రమే. ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం..ఇదే నినాదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పునరుద్ఘాటించారు. అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరుగుతున్న మహాపాదయాత్రకు తులసిరెడ్డి సంపూర్ణ సంఘీభావం తెలియజేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతి రాష్ట్రం నడిబొడ్డులో ఉందని, రూ.9,500 కోట్లు ప్రజాధనం ఖర్చుచేయడం జరిగిందన్నారు. 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్టణానికి మార్చాలని సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదమని విమర్శించారు. మహాపాదయత్రతోనైనా కనువిప్పు కలిగి రాష్ట్ర సచివాలయాన్ని (రాజధానిని) అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించాలనే నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
బారెడు పెంపు – బెత్తెడు తగ్గింపు : పెట్రోలు, డీజల్ ధరలు భారీగా పెంచడం, తర్వాత కొంచెం తగ్గించడం చూస్తే బారెడు పెంపు – బెత్తెడు తగ్గింపు అనే విధంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడంతో పెట్రోలు, డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. లీటరు పెట్రోల్ పై రూ.33, లీటర్ డీజల్ పై రూ.31.83గా సుంకం విధిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, లీటరు డీజల్ పై రూ.10 తగ్గించి ఘనకార్యం చేసినట్లుగా దీపావళి కానుకగా ఇచ్చినట్టుగా బీజేపీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. అలాగే అస్సాం, త్రిపుర, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, బీహార్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజల్ పై కొంతమేరకు వ్యాట్ తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయని పేర్కొన్నారు. కానీ మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఆలోచన చేయకపోవడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు.