Suryaa.co.in

Education

మన వేద భూమి సాక్షిగా

వారి కలలు
పరిశోధనలకీ
మేటి ప్రతి రూపాలు…!!
వారి ఆలోచనలు
నేటి తరానికి
చైతన్య కిరణాలు….!!
వారి ఆవిష్కరణలు
ప్రపంచ వేదికపై
సజీవ చిహ్నాలు…..!!
ఖగోళశాస్త్ర గుట్టును
ప్రపంచానికి చాటిన దిట్ట
అంతరిక్ష విజ్ఞానంలో
మన ఆర్యభట్ట …!!
జంతువుల ఎముకల నుంచి ….
బలమైన ఔషధం
తయారు చేసిన ఘనుడు
భారతీయ రసాయన
కర్మాగార పితామహుడు
ప్రఫుల్ల చంద్రరే….!!
గురుత్వాకర్షణ శక్తిని
ఒడిసిపట్టిన జ్ఞానవంతుడు
ప్రపంచానికి వరంగా ఇచ్చిన
వరాహమిహిరుడు….!!
ప్రాచీన కాలంలోనే
శస్త్రచికిత్సకు
ఆద్యుడుగా ఖ్యాతి పొందే
సుశ్రుతుడు…!!
గణిత శాస్త్రంలో
సున్నా గొప్పతనాన్ని
గుర్తించిన ప్రథముడు
ప్రపంచానికి పరిచయం చేసిన
గణితమేధావి బ్రహ్మగుప్తుడు….!!
వైర్లెస్ టెలిగ్రాఫ్ ను
కనుగొన్న బాస్
తొలిసారిగా ధృవీకరించిన
జగదీష్ చంద్రబోస్….!!
జాతి గర్వించేలా
యాంటీ బయోటిక్స్ లో
ఎన్నో ప్రయోగాలు చేసిన
శాస్త్రజ్ఞుడు
తెలుగు జాతి ముద్దుబిడ్డడు
ఎల్లాప్రగడ సుబ్బారావు….!!
వైజ్ఞానిక పరిశోధన రంగంలో
రామన్ ఎఫెక్ట్ ను
శిఖరాగ్రాన నిలిపి
తొలి నోబెల్ అందుకున్న
భారతరత్న సర్ సి.వి.రామన్…!!
క్షిపణి పితామహుడుగా
నిత్య స్ఫూర్తి ప్రదాతగా
విద్యకు వినయాన్ని జోడించిన
మువ్వన్నెల సగర్వ చిహ్నం
ఏపీజే అబ్దుల్ కలాం….!!
రెప్పచాటు లోకంలో ….
గగనపు వీధులలో…
అజరామరమైన
ఘనకీర్తిని సాధించిన
మౌన మేధావులకు
అక్షర కుసుమాలతో
వందన హరి చందనాలు….!!
మేధావులకు,శాస్త్రవేత్తలకు
పుట్టినిల్లయిన
“మన వేద భూమి సాక్షిగా”……
మేధోవలసలు జరగకుండా…
నేటి బాలలే
రేపటి శాస్త్రవేత్తలుగా…..
ఇంటి నుండి మింటివరకూ
జాతి ఖ్యాతిని నిలిపిననాడు….
దేశ యవనికపై రెపరెప లాడుతూ
సగర్వంగా ఎగురుతుంది …..
మువ్వన్నెల జెండా….!!
( “ప్రపంచ సైన్స్ దినోత్సవం” సందర్భంగా….)
– వాసవి ప్రసాద్
 

LEAVE A RESPONSE