శ్రీ వై.యెస్.జగన్మోహనరెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు,
అమరావతి.
విషయం: ముఖ్యమంత్రి వరద ముంపు ప్రాంతాలను వెంటనే సందర్శించాలి
నమస్తే !
రాష్ట్రంలో ప్రకృతి సృష్టించిన విలయంతో పలు జిల్లాల్లో ప్రజలు విలవిలాడుతున్నారు. సర్వస్వం కోల్పోయి గూడు కరువై, కూడు, గుడ్డ లేక ఆకలితో అలమటిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రిగా మీరు కూడా స్వయంగా వరద ప్రాంత ప్రాభావిత ప్రాంతాలను సందర్శించి అక్కడే ఉండి పరిస్థితులు మెరుగు పడే వరకు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. గత నెలలో బద్వేలు ఉపఎన్నికకు రాష్ట్ర నలుమూలలనుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తో ఎలా పనిచేయించుకున్నారో, అలానే ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులందరితో ముఖ్యమంత్రి గా మీరు ముంపు ప్రాంతాలలో ఉండి పని చేయించండి. మరలా మన రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులను ముందుగానే అందించాలి.
కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా కడప జిల్లాను వరద ముంచెత్తిందన్న విషయం విదితమే. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడం, 2 లక్షల 20 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు 3 లక్షల 20 వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు రావడంతో రెండు ప్రాజెక్టులు శుక్రవారం తెల్లవారుజామున తెగిపోయిన విషయం తెలిసిందే. పర్యావసానంగా చెయ్యేరు గట్లు దాటి ప్రవహించింది. దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో 17 గ్రామాల్లోకి నీరు చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు మునిగిపోగా, కొందరు వరదల్లో కొట్టుకుపోయారు.
కడప గడపన పల్లెసీమలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. వరద మిగిల్చిన కష్టనష్టాలు అంచనాలకు అందనివి. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోవడంతో జరిగిన నష్టం అపారం. ఊళ్లు ఆనవాళ్లు కోల్పోయాయి. పొలాలు ఇసుక దిబ్బలుగా మారాయి. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయి ఛిద్రమైన పల్లెల్లోనే శరణార్థుల్లా ప్రజలు ప్రభుత్వ చేయూత కోసం కన్నీటితో ఎదురు చూస్తున్నారు. పంట నష్టం 56,138.6 హెక్టార్లు రూ.81.99 కోట్లు, ఉద్యాన పంటలు 17,704.8 హెక్టార్లు రూ.110.22 కోట్లు, పక్కా ఇళ్లు 2,580 రూ.5.81 కోట్లు, పశువులు, కోళ్లు 13,602 రూ.1.48 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లు 583.91 కి.మీలు రూ.537.95 కోట్లుగా అధికారులు అంచనా వేశారని తెలుస్తున్నది.
రైతుకు జీవనాధారమైన పాడి పశు సంపదకు అపార నష్టం జరిగింది. పులపుత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గండ్లూరు, పాటూరు తదితర గ్రామాల్లో పాడి ఆవులు, గేదెలు, కాడెద్దులు 1,382, దూడలు, పడ్డలు, గొర్రెలు 2,532, కోళ్లు 9,638 వరదకు కొట్టుకుపోయాయి. 462 మంది రైతులు నష్టపోయారు. నష్టం విలువ రూ.1.48 కోట్లుగా అంచనా వేశారు. కడప జిల్లాలోనే కాదు. సరిహద్దున చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలకు పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు, మాండవ్య, కుందూ నదులు, వాగులు, వంకలు వరదతో పోటెత్తాయి. ఊళ్లు, పంట పొలాలు, రహదారులను ఛిద్రం చేశాయి. 56,138.6 హెక్టార్లలో వరి, పత్తి, మినుము, వేరుశనగ, కంది వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 75-100 శాతం దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు రూ.81.99 కోట్లు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్
★వేల హెక్టార్ల పొలాలలో 5 అడుగుల మేర ఇసుక మేటలు వేసాయి. ఉపాధి హామీ పధకం కింద పనులు కోల్పోయిన ప్రజలకు పని కల్పించి వారితో ఇసుక మేటలు తొలగించి, ఏడాదిలోగా సాగులోకి తీసుకురావాలి.
★వరదకు కొట్టుకుపోయిన వ్యవసాయ బావులను తిరిగి ప్రభుత్వమే తవ్వించాలి. విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మోటార్లు, డ్రిప్ పైపులను ప్రభుత్వం ఉచితంగా నష్టపోయిన రైతులకు ఇవ్వాలి.
★పంట రుణాలన్నీ రద్దు చేయాలి. పాడి ఆవుల కొనుగోలుకు మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేయాలి
★వరదకు కొట్టుకుపోయి చనిపోయిన పాడి సంపదను లెక్కించి, ఆ మేరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలి.
★సురక్షిత ప్రాంతాల్లో 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించి ఇవ్వాలి.
★ప్రతి ఇంట్లో కొట్టుకుపోయిన వంట సామగ్రి, టీవీ, కూలర్లు, బట్టలు, ఇతర సామగ్రి నిష్పక్షపాతంగా అంచనా వేసి కొనివ్వాలి.
★పాడిపశువులకు ఏడాది పాటు ఉచితంగా దాణా సరఫరా చేయాలి.