Suryaa.co.in

International National

చైనా సరిహద్దుల్లో 59 గ్రామాలు ఖాళీ

ఉత్తరాఖండ్‌ జిల్లాల్లో కొండ ప్రాంతాలను వీడుతున్న ప్రజలు
భారత సరిహద్దులకు సమీపంలో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తూ ప్రజలను తరలిస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో భారత్‌ వైపు చైనా-నేపాల్‌ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులను విడిచి ప్రజలు వలస వెళుతున్నారు. ఉత్తరాఖండ్‌లో పిథోరాగఢ్‌ జిల్లాలో చైనా-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న 59 గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి.
ఏ గ్రామం చూసినా మనిషి జాడ కనిపించే పరిస్థితులు లేవు. జల్‌ జీవన్‌ మిషన్‌ తాజా నివేదిక ప్రకారం.. పిథోరాగఢ్‌ జిల్లాలో ప్రస్తుతం 1,542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆ సంఖ్య 1,601గా ఉండేది. 59 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి.
ఇందులో పిథోరాగఢ్‌ తహసీల్‌లో 13, గంగోలీహాట్, డీడీహాట్, బెరీనాగ్‌ తాలుకాల్లో ఒక్కోదాంట్లో ఆరు, ధారచూలాలో 3, గణాఈ-గంగోలీ, ఫాంఖూ, థాల్‌లో 3 చొప్పున గ్రామాలు ఎడారిని తలపిస్తున్నాయి. ”మూడేళ్ల క్రితం గ్రామాల్లో 16వేల మంది జనాభా ఉండేది. 2019, 2020, 2021లో ఇంటింటి సర్వే చేపట్టాం. బ్రాహ్మణ క్షేత్రంలోని 1,601 గ్రామాల్లో సుమారు 40-50 గ్రామాలు గడిచిన మూడేళ్లలో దాదాపుగా ఖాళీ అయ్యాయి” అని జల్‌ నిగమ్‌ అధికారి రంజీత్‌ ధర్మసత్తూ తెలిపారు.
41 గ్రామాల్లో సగమే..
మైగ్రేషన్‌ కమిషన్‌ డేటాను పరిశీలిస్తే పిథోరాగఢ్‌ జిల్లాల్లో 41 గ్రామాల్లో 50 శాతానికిపైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అందులో గంగోలీహాట్‌ అభివృద్ధి బ్లాక్‌లో 25, బేరినాగ్‌ బ్లాక్‌లో 12 గ్రామాలు, కనాలిచినా, మూనాకోటే బ్లాకుల్లో 2 గ్రామాల్లో సగానికిపైగా ప్రజలు వలస వెళ్లారు.
వలసలకు కారణాలేంటి?
ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడి 21 ఏళ్లు గడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది.కానీ, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేవు. చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. విద్యుత్తు, నీరు, సమాచారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వలసలు పెరుగుతున్నాయి. జిల్లాలో సరైన వైద్య సౌకర్యం లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE