– ఫిష్ మార్ట్, మటన్ మార్టులంటూ మత్స్యకారుల పొట్టగొడతారా?
– సాంప్రదాయ వృత్తులను బతకనివ్వరా జగన్ రెడ్డిగారూ…!
– మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజం
అమరావతి: ఇన్నాళ్లూ పారిశ్రామిక విప్లవం తీసుకొస్తామంటూ హడావుడి చేసి.. ఇప్పుడు మటన్ మార్టులు, ఫిష్ మార్టులు, చికెన్ షాపులంటూ జగన్ రెడ్డి చేస్తున్న హడావుడి ఆయన దివాలాకోరు తనానికి అద్దం పడుతోందని మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ బిసి నాయకుడు వనమాడి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడం లేదు. రెండున్నరేళ్లలో యువతకు ఉద్యోగాలివ్వకపోగా… వారి చేత వైన్ షాపుల్లో మద్యం అమ్మిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. ఇపుడు చేపలు, మాంసం అమ్ముతామంటున్నారు, ఖజానా నింపుకోవడానికి ఏళ్లతరబడి సాంప్రదాయంగా ఈ వృత్తిపై ఆధారపడిన మత్స్యకారుల పొట్టగొట్టడానికి సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెనుకాడటం లేదని అన్నారు.ఉద్యోగాల విప్లవమంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నది చేపలు, చికెట్, మటన్ అమ్మడానికా అని ప్రశ్నించారు. ఉద్యోగాల విప్లవం అన్ని మత్స్యకారుల ఉపాథి ఊడగొడుతున్నారు, మద్యనిషేధం అని చెప్పి… ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతోంది.
ఈ ముఖ్యమంత్రి చెప్పేమాటలకు, చేసే పనులకు పొంతన ఉండదనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని కొండబాబు ప్రశ్నించారు. చేపలవేట వృత్తిగా జీవించే మత్స్యకారులకు జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో పైసా ప్రయోజనం లేదు. జీవో నెం.217తో మత్స్యకారుల జీవనానికి ప్రమాదం తెచ్చిపెట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. మత్స్యకారుల జీవనోపాధి మార్గాలపై జగన్ రెడ్డి కక్ష గట్టారని, ఆయన ధనదాహానికి ఇంకా ఎంతమంది బలికావాలో అర్థం కావడం లేదన్నారు.
చిన్న చిన్న సంతల్లో, పట్టణాల్లోని చేపల మార్కెట్లలో ఉండే లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతీస్తున్నారు. మరోవైపు.. మాంసం దుకాణాలు అంటూ ఆయా వర్గాల ఉపాధికి సైతం గండి కొడుతున్నారు. మటన్ షాపులపై ఆధారపడిన కొన్ని సామాజిక వర్గాల ఉపాధికి గండికొట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఇప్పటికే ఆయా వృత్తి, వ్యాపారాల్లోని లక్షలాది అల్పాదాయ వర్గాలు రోడ్డున పడ్డాయని తెలిపారు.
చంద్రబాబునాయుడి హయాంలో అయిదేళ్లపాటు రాష్ట్రం పెట్టుబడులు, భాగస్వామ్య, వాణిజ్య సదస్సులు, ఒప్పందాలతో కళకళలాడేది. వేలాది పరిశ్రమల ఏర్పాటుతో లక్షల్లో ఉద్యోగావకాశాలు లభించి ఉపాధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని కొండబాబు అన్నారు. తాము అధికారంలోకి వస్తే… ఉద్యోగాల విప్లవం సృష్టిస్తామని హోరెత్తించిన జగన్ రెడ్డి… అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తైంది, ఒక్క కంపెనీ రాలేదు, రూపాయి పెట్టుబడీ రాలేదు, విదేశీ పెట్టుబడులు లేవు, ఉద్యోగాల కల్పనా లేదు, ప్రభుత్వ ఉద్యోగాల జాడలేకపోగా, 10లక్షల కోట్లరూపాయల పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని అన్నారు.
అధికారంలోకి వచ్చింది మొదలు.. ఉద్యోగాల పేరుతో హడావుడి తప్ప చేసిందేమీ లేదు, ఇప్పుడు చేపల కొట్లు, మటన్ మార్ట్ లు ఏర్పాటు చేసి ఉద్యోగాల విప్లవం తెచ్చామంటూ ఊదర గొడుతున్నారని కొండబాబు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి విధానాలు, అడ్డగోలు పరిపాలన చూసి దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా పనికిమాలిన పనులు మాని.. ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకోవాలని కొండబాబు హితవు పలికారు.