Suryaa.co.in

Telangana

ఏడేళ్లుగా నవోదయ విద్యాలయాల ఊసే ఎత్తని కేంద్ర ప్రభుత్వం

– తెలంగాణలో విద్యా వికాసానికి మోకాలడ్డుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం
– కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ, రాష్ట్రంలో ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఎం ఏర్పాటును మరిచిన కేంద్రం
– రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు నెలకొల్పేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ ఏర్పాటు, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐ.ఐ.ఎం ) వంటి పలు విద్యా సంస్థలు మంజూరు చేయకుండా కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణకు తీరని అన్యాయానికి గురి చేస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు.

రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదని, కనీసం సొంతంగానైనా బీజేపీ ఎంపీలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.రాష్ట్ర బీజేపీ ఎంపీల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని, కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ ను మినహాయిస్తే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాకొకటి చొప్పున రాష్ట్రానికి మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యా పరంగా ఎంతో మేలు జరుగుతుందని వినోద్ కుమార్ వివరించారు.

కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి దురదృష్ట పరిస్థితులను కల్పిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని వినోద్ కుమార్ వెల్లడించారు.కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ. ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 23 నవోదయ విద్యాలయాలు, ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఎం, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

షర్మిలది అవగాహన రాహిత్యం
వైఎస్సార్.టీ.పీ. నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.షర్మిల.. మీరు ముందుగా వాస్తవాలు తెలుసుకుని.. ఆ తర్వాత రైతు బీమా విషయంపై మాట్లాడాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ. ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ., జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారు. కేంద్ర, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయని, ఈ విషయం మీకు తెలియదా..? అని ఆయన షర్మిల ను ప్రశ్నించారు.

ఇదీ వాస్తవం కాగా, షర్మిల మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇలాంటి పథకాలను షర్మిల మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తే ఎలా అని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE