-పార్లమెంట్లో ప్రశ్నించిన ఎంపీ ఆదాల
ఆంధ్రప్రదేశ్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు మహిళ పారిశ్రామికాభివృద్ధికి ఉపయోగపడే “వైయస్సార్ చేయూత” పధకం లాగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక రచిస్తోందా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో సోమవారం ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి, నిధులను అందించేందుకు ప్రైవేట్ సంస్థలతో ఏదైనా అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందా అని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, మహిళ పారిశ్రామికాభివృద్ధి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం రాతపూర్వకంగా సమాధానమిస్తూ అటువంటి పథకం ఏదీ లేదని తెలిపారు. అయితే మహిళల పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సాధికారత కొన్ని పథకాలను కేంద్రం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా పూచీకత్తు లేని రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొన్ని సంస్థల ద్వారా 50 వేల నుంచి పది లక్షల వరకు వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల కోసం స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రధాని 2016 ఏప్రిల్ 5న ప్రారంభించారని, దీన్ని 2025 వరకు పొడిగించారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఒక బ్యాంకు నుంచి కనీసం ఒక ఎస్సి, ఒక ఎస్టి రుణ గ్రహీత కు 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాన్ని అందించేందుకు ఉద్దేశించారని అన్నారు. మైనారిటీ మహిళల కోసం లీడర్షిప్ డెవలప్మెంట్ కోసం ఒక స్వల్పకాలిక కోర్సు ద్వారా సాధికారత కల్పించడం లక్ష్యంగా ఉందన్నారు. దీంతో పాటు మహిళ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ లద్వారా ఆర్ధిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.