Suryaa.co.in

Andhra Pradesh

అంగన్ వాడీ కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి

– సకాలంలో జీతాలు రాక, సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు
– అంగన్ వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా మరో చలో విజయవాడ ఖాయం
– అంగన్ వాడీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనోవికాస కేంద్రాలుగా పనిచేసిన అంగన్ వాడీ కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. నాడు-నేడు కింద అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు.

తనను గెలిపిస్తే జీతాలు పెంచుతానంటూ పాదయాత్రలో అంగన్ వాడీలకు అరచేతిలో వైకుంఠం చూపించిన జగన్ రెడ్డి తీరా పవర్ లోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. మాయమాటలతో నట్టేట ముంచారు. వారి వేతనాన్ని రూ. 11,500 చేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పని మాత్రం చేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేశారు. అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాలివ్వకుండా ఇబ్బందులు పెట్టడం దారుణమైన చర్య.

సకాలంలో జీతాలు రాక, సంక్షేమ పథకాల ఫలాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నా తనకేం సంబంధం లేదన్నట్టు ప్రభుత్వం చోద్యం చూడటం దుర్మార్గం. కరోనా విపత్తులోనూ ప్రాణాలను లెక్కచేయకుండా గర్భిణులు, బాలింతలకు ఇళ్లకే వెళ్లి పౌష్టికాహారం అందించినా అంగన్ వాడీలను ప్రభుత్వం గుర్తించకోగా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయం కాదా?

అంగన్ వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు , కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు వందల కోట్లు బకాయిలు పెట్టడం సిగ్గుచేటు. బినామీ కాంట్రాక్టర్లకు వేల కోట్ల నిధులు విడుదల చేసే ముఖ్యమంత్రికి అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు మాత్రం మనసు రావడంలేదు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో అంగన్ వాడీ కార్యకర్తలే నెలకు రూ. 4000 వేల వరకూ చేతి నుంచి పెట్టుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఎవరు ఎలా పోతే నాకేంటి నా గల్లా పెట్టె నిండిందా లేదా అన్నట్టు ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ జీతాలు చెల్లించాలి. అంగన్ వాడీలకు కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలి. రూ. 10,000 పెన్షన్ ఇవ్వాలి. పీఎఫ్ , ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలి. విధి నిర్వహణలో కరోనా సోకి చనిపోతే వారి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. అంగన్ వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే మరో చలో విజయవాడ ఖాయం.

LEAVE A RESPONSE