– మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్
వైసీపీ ప్రభుత్వపు ‘సుపరిపాలన’ దేవుడెరుగు ‘నరకాసుర పాలన’కు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం… వైసీపీ ప్రభుత్వపు ‘సుపరిపాలన’అందిస్తానని చెప్పి ప్రజలకు నరకం చూపిస్తోంది. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ ను చిత్రహింసలపాలు చేసి అతని మరణానికి ఈ ప్రభుత్వమే కారణమైంది. దోపిడీకి సహకరించని అధికారులను భయపెట్టటమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. వెంకటాచలం ఎంపిడిఓ సరళాదేవి చెప్పిన మాట వినలేదని ఆమె ఇంటికి విద్యుత్, నీటి సరఫరాను ఆపేశారు. అలాగే తూర్పు గోదావరి అయినవోలు ఎంపీడివో విజయ అనే అధికారిణి వైసీపీ నాయకుల మాట వినలేదని ఆ మహిళపై కూడా వైసీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఎంపీ శివరామకృష్ణరాజు ప్రభుత్వ అవినీతి అరాచకాలను బయట పెడితే అతనిపై దాడి చేశారు. చట్టమనేది వైసీపీ ప్రజా ప్రతినిధులకు చుట్టంగా మారింది.
ఓ వైసీపీ నాయకుడు స్వయాన తన సహచరుడిని చొక్కా ఊడగొట్టి తంతాను అంటే అతని పై చర్యలు శూన్యం. కొడాలి నాని క్యాంపు కార్యాలయంలో ఓ ఎమ్మార్వో మీద దౌర్జన్యం చేశారు. ఓ సినిమా తీయేటర్ కు ఎన్ ఓ సీ ఇవ్వలేదని ఆ ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. ఇలా దాడులకు పాల్పడండని పోలీసు అధికారులు వైసీపీ మంత్రులకు లైసెన్సులు ఇచ్చారా? అనే అనుమానం కలుగుతోంది. వైసీపీ నాయకులు ఏదైనా మాట్లాడొచ్చా? అదే టీడీపీ నాయకులు మాట్లాడితే అరెస్టులు చేస్తారా? వైసీపీ నాయకులు ఏ పదజాలాలైనా మాట్టాడొచ్చా? బాధ్యత గలిగన మంత్రులు రాష్ట్ర పరువును బజారుపాలు చేశారు. వారి హావభావాలు చూస్తుంటే జనాలకు ఏహ్యభావం కలుగుతోంది. వారి మాటలు చేష్టలు చూస్తుంటే తెలుగు ప్రజలు తల దించుకోవాల్సి వస్తోంది. ఇలా వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి వారిని పిలిచి వారించడంలేదు. పైగా వారిని ప్రశంసిస్తున్నారు.ఇదెక్కడి నైజమో అర్థం కావడంలేదు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కృష్ణలంక పోలీసు స్టేషన్ కు వెళ్లి వీరంగం చేశాడు.
గుడివాడ మండల దళిత తహశీల్దార్ శ్రీనివాసరావుపై మంత్రి కొడాలి నాని అనుచరుడు దాడికి పాల్పడ్డాడు. చిన్న వాటికి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చే పోలీసు యంత్రాంగం వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోరే? మంచి పాలన అందిస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓ కొత్త ట్రెండుకు నాంది పలికింది. దోపిడీకి సహకరించని అధికారుల భయపెట్టడమే పనిగా పెట్టుకుంది. వారిపై దౌర్జన్యం చేయటమే దినచర్యగా పెట్టుకున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అణగారిన వర్గాల వారిని వదలకుండా హింసిస్తున్నారు. తమకు సహకరించని వ్యక్తులపై దౌర్జన్యాలు మరీ మితిమీరాయి. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ను చిత్రహింసలపాలు చేశారనేది జగమెరిగిన సత్యం. అతన్ని మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి చివరకు పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ ప్రభుత్వం అతని మరణానికి కారణమైంది. ఇది ప్రభుత్వ హత్యేననేది ప్రజలందరికీ తెలుసు. ఇతని మృతికి కారణం ప్రభుత్వమేనని సీబీఐ నివేదిక కూడా ఇచ్చింది.
జగన్ మాటలు మెత్తగా ఉండి ఆ తర్వాత గొంతులు కోసేలా ఉంటాయి. మహిళలపై మహిళా అధికారులపై నిస్సిగ్గుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు చేస్తున్న వారిని ముఖ్యమంత్రి పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇదివరకు ఒక బ్రాండ్ ఉండేది. ఇవాళ ఆ బ్రాండ్ ని చెడగొట్టారు. దౌర్జన్యాలు, అధికారులను బెదరించడాలు, అధికారులపై కేసులు పెట్టడం, బూతులు తిట్టడం లాంటి కొత్త టెండ్రుల్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు దాడులకు పాల్పడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం ముందుకొచ్చినప్పుడే నిజాయితీ నిలబడుతుంది. ముఖ్యమంత్రి ఇలాగే పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు ఎక్కువ దూరంలో లేవు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఇబ్బందులపాలు చేస్తున్నారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని వైసీపీ నాయకులు గ్రహించాలి. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. బీఆర్టీ రోడ్డు మీదకు రాకూడదని హుకుం జారీ చేస్తే వేలాది మంది బీఆర్టీ రోడ్డు మీదకు వచ్చారు. రేపు ఈ ఏపీలో వేలాదిమంది ప్రజలు వ్యతిరేకంగా గళమెత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ నొక్కి ఒక్కాణించారు.