అక్కడున్నది మనిషేనా..
తన పుట్టుకను విస్మరించి
విజ్ఞతను విడిచి
మానవతను మరచి
అమ్మపై..అలా కర్కశంగా..
ఛీ..తానే ఒక
బ్రతికున్న శవంగా..!
నిన్ను ఈ భూమ్మీదకు తెచ్చి
నీ మలమూత్రాలు కడిగి
అక్షరం..లక్షణం నేర్పి..
ఇదిగో ఈరోజున నువ్వున్న
దశకు చేర్చిన అమ్మ..
అంత బరువైపోయిందా..
ఒక్కసారి చూసుకో..
నీ ప్రవర్తన
నీకే వెగటు పుట్టదా..!
ఎన్ని తప్పులు చేసి ఉంటావు
కడుపులో దాచుకుని
నిన్ను పెంచిన తల్లి..
ఏం చేసిందని ఆ పైశాచికం
వెంటాడి మరీ
ఏంటా కిరాతకం..
సిగ్గనిపించలేదా!?
చూడు ఆ తల్లిని..
ఆ కళ్ళ నిండా నీరు నిండినా
కనిపిస్తున్నది నీ రూపమే..
ఆమె మాటలో నీపై
రవ్వంతైనా కోపం ఉందా
ఏమడుగుతోంది..
బాగా చూసుకోమనేగా..
ఇంకెన్నాళ్ళు ఉంటుంది..
కొస వరకు నీ కోసమేగా
ఉన్నన్నాళ్ళు నిన్ను
కళ్ళారా చూసుకుని..
నీ రూపు కన్నుల్లో నింపుకుని
వెళ్లిపోదా..
ఈలోగా నువ్వు నవ్వితే
అవే ఆమెకు నవరత్నాలు..
అమ్మా అనే నీ పిలుపే
వైతరణి దాటించే బలం
పోయాక పెడతావేమో కొరివి
ఆమెకు కడతావేమో గుడి
ఉన్నప్పుడు ఒక్కసారి
మనసారా హత్తుకోవయ్యా
గుండెకు..
క్షమించు అని నువ్వడిగేలోగానే
ఆ తల్లి కంట
కనిపించదా గోదారి.._
నీ భావి జీవితానికి
చక్కటి దారి!
కన్నీరు ప్రవహిస్తుండగా
ఈ నాలుగు మాటలు..
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286