Suryaa.co.in

Andhra Pradesh

టిటిడి ధార్మిక‌మండ‌లిని జ‌గ‌న్ దోపిడీ మండలిగా చేశారు

-శ్రీవారి సేవా టికెట్లను దోపిడీ దొంగ‌ల్లా టిటిడి పాలక మండలి సభ్యులు వాటాలేసుకుంటున్నారు
-ప్ర‌సాదం, వస‌తి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచి ఏడుకొండ‌ల‌వాడిని భక్తులకు దూరం చేసే కుట్ర
-31 కేసుల్లో నిందితుడైన సీఎం, క్రిమినల్ కేసులున్న 16 మందిని పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా వేశారు
– టిటిడి పాల‌క‌మండ‌లి నిర్ణ‌యాల‌ని త‌ప్పుబ‌ట్టిన‌ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధార్మిక మండ‌లిని, జ‌గ‌న్ ఆయ‌న బంధువులు క‌లిసి దోపిడీ మండ‌లిగా మార్చేశార‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మండిప‌డ్డారు. శ్రీవారి ద‌ర్శ‌న సేవాటికెట్లు, ప్ర‌సాదం, వ‌స‌తి రేట్లు పెంచుతూ టిటిడి పాల‌క‌మండ‌లి తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ని ఖండిస్తూ బుధ‌వారం నారా లోకేష్ మీడియాకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కలియుగదైవం తిరుమల వెంకన్నని భక్తులకు దూరంచేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందని ఆరోపించారు. ధార్మిక‌మండ‌లి ద‌ళారీల దందా మండ‌లిగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రసాదం, వసతి, వివిధ సేవల రేట్లు విపరీతంగా పెంచి భక్తులను దోచుకోవాలని పాలకమండలి భావించడం అన్యాయమన్నారు.

శ్రీవారిని భక్తులకు దగ్గర చేసి ఆధ్యాత్మిక సేవ‌లో త‌రించాల్సిన పాల‌క‌మండ‌లి సభ్యులు వ్యాపారంగా మార్చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిధుల సమీకరణ పేరుతో ఉదయాస్తమాన సేవ రేట్లను కోటి, కోటిన్న‌ర‌కి పెంచడమే అతి పెద్ద త‌ప్ప‌న్నారు. వీటి బుకింగ్ ప్రారంభించిన వెంటనే సేవా టిక్కెట్లు ద‌ళారుల్లా త‌మ‌లో తామే పంచుకున్నామంటూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం సిగ్గుచేట‌న్నారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలో ఏ ఆల‌యానికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు తిరుప‌తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయో పాల‌క‌మండ‌లి స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. వేద ఆశీర్వచనం టిక్కెట్ రేటుని రూ.3 వేల నుండి రూ.10 వేలకు, సుప్రభాత సేవ టిక్కెట్

రేటుని రూ.240 నుండి రూ.2 వేలకు, కళ్యాణోత్సవం టిక్కెట్ రేటుని రూ.1000 నుండి రూ.2 వేలకు, తోమాల సేవ-అర్చన టిక్కెట్ రేట్లను రూ. 240 నుండి రూ.2 వేలకు, వస్త్రాలంకరణ సేవని రూ.50 వేల నుండి రూ.లక్షకు పెంచాలని టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.

ఎటువంటి ఆలోచన, స‌మీక్ష‌ లేకుండా టిటిడిని కార్పొరేట్ వ్యాపార‌సంస్థ మాదిరిగా భావిస్తూ..ఇష్టానుసారంగా అన్ని రేట్లు పెంచేద్దాం అంటూ లైవ్‌లోనే పాల‌క‌మండ‌లి చేసిన ప్ర‌తిపాద‌న‌లు తిరుమ‌ల తిరుప‌తి ప‌విత్ర‌త‌ని దెబ్బ‌తీసేలా వున్నాయ‌న్నారు. 31 కేసులున్న సీఎం, బోర్డులో 16 మంది నేర చరిత్ర కలిగినవారిని స‌భ్య‌లుగా నియ‌మించార‌ని, వారంతా క‌లిసి వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటూ టిటిడి ప‌రువు మంటగ‌లిపేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రూ.10,500 చెల్లిస్తే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టి తద్వారా వస్తున్న నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తామంటున్నారని, ఈ నిధుల వినియోగంపైనా అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు.

ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిగే తిరుమలలో ఇప్పుడు అన్ని ఏకాంత సేవలేనని, సీఎం తాడేపల్లి ఇంటి నుండి బయటకి రారు…కోవిడ్ పేరుతో శ్రీ వారినీ బయటకి రానివ్వడం లేదన్నారు. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఎత్తేసినా ఇంకా కోవిడ్ ప్రోటోకాల్‌ పేరుతో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లేకుండా చెయ్యడం వ్యాపార‌బుద్ధిగ‌ల పాల‌క‌మండ‌లి కుట్రేన‌ని ఆరోపించారు.

హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ పాల‌క‌మండ‌లి తీసుకుంటున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు వెన‌క్కి తీసుకోవాల‌ని, సేవాటికెట్ల రేట్లు త‌గ్గించాల‌ని, సామాన్యుల‌కు శ్రీవారి ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించాల‌ని నారా లోకేష్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE