బండిపై కొడుకు శవంతో 90 కిలోమీటర్ల ప్రయాణం!

– తిరుపతి రుయా ఆసుపత్రి అంబులెన్సు మాఫియా దాదాగిరి
– శవం తీసుకువెళ్లాలంటే.. అడిగినంత ఇవ్వాలంతే
– ‘‘సిగ్గులేని సమాజం’’ పై సోషల్‌మీడియాలో ట్రోలింగ్స్
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని’’ అంటూ సినిమా, మీడియా ఎన్నిసార్లు నిలదీసినా.. ‘సిగ్గులేని ఈ సమాజం మాదే’నంటూ నిర్లజ్జగా వ్యవహరిస్తున్న అంబులెన్సు మాఫియాను ఎదిరించలేని, ఓ తండ్రి తన కొడుకు శవాన్ని మోసుకువెళ్లిన విషాదమిది. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కోసం, యాప్ తయారుచేయాలని సీఎం జగన్ ఆదేశించిన మూడురోజుల్లోనే.. తిరుపతిలోని రుయా ఆసుపత్రి అంబులెన్సు అవినీతి మాఫియా ముఠా దాదాగిరితో ఆ బాలుడి తండ్రి.. వారు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక నిస్సహాయంగా.. నిర్వేదంగా .. నిస్తేజంగా.. బండిపైనే కొడుకు శవాన్ని మోసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ విషాదం, అధికారుల అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

అన్నమయ్య జిల్లాకు చెందిన జాషువా అనే బాలుడిని, అనారోగ్యంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే నిన్న రాత్రి ఆ బాలుడు హటాత్తుగా మృతి చెందాడు. దానితో మృతదేహాన్ని స్వగ్రామమైన చిట్వేలికి తరలించేందుకు, ఆసుపత్రి బయట ఉండే అంబులెన్సు డ్రైవర్లను సంప్రదించాడు. కానీ వారు చెప్పిన రేటు విని హతాశుడైన తండ్రి, ఈ విషయాన్ని గ్రామంలోని తన మిత్రులకు ఫోన్‌లో వివరించాడు.

దానితో శ్రీకాంత్ యాదవ్ స్పందించి ఆసుపత్రికి అంబులెన్సు పంపించాడు. కొడుకు శవాన్ని అందులో తీసుకువెళ్లేందుకు తండ్రి చేసిన ప్రయత్నాన్ని, అక్కడ ఉన్న అంబులెన్సు డ్రైవర్ల యూనియన్ అడ్డుకుంది. కొందరయితే బయట నుంచి అంబులెన్సు డ్రైవర్‌ను

దారుణంగా కొట్టారు. దీనితో విధిలేక ఆ తండ్రి బైకుపై కొడుకు శవాన్ని కూర్చోబెట్టుకుని, ఆ చీకట్లోనే స్వగ్రామానికి తీసుకువెళ్లిన విషాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో, ఉదయం నుంచి వైరల్ అవుతోంది. ‘సిగ్గులేని సమాజం’ అంటూ నెటిజన్లు, సర్కారు వైఫల్యంపై తెగ ట్రోల్ చేస్తున్నారు.

కేవలం రుయా ఆసుపత్రి అంబులెన్సు డ్రైవర్ల యూనియన్ దాదాగిరి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ‘‘పై అధికారులతో కుమ్మక్కవడం వల్ల.. చాలాకాలం నుంచి బయట నుంచి వచ్చే అంబులెన్సులను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయం ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదు. ఎందుకంటే వాళ్లకూ ఇందులో వాటా ఉంటుంది. అందుకే పట్టించుకోరు. డ్రైవర్ల యూనియన్ పేరుతో జరుగుతున్న ఈ దందా ఇప్పుడు బాలుడి మృతి వల్ల బయటకొచ్చింది. లేకపోతే బయటకు వచ్చేది కాదు. కానీ అక్కడ ఇది మామూలే’’నని రుయా ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ రాష్ట్రంలో హెల్త్‌కేర్: చంద్రబాబు ట్వీట్
కాగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌కేర్ సెక్టార్‌లో జరుగుతున్న దుస్థితి ఇది. ఈ ఘటన కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే’నని ట్వీట్ చేశారు.

Leave a Reply